5, నవంబర్ 2025, బుధవారం

ప్రేమలో మునిగి మునిగి… ప్రాణాలను కోల్పోతున్న విద్యార్థులు

జీవితం కన్నా ప్రేమే సర్వస్వమని నమ్ముతున్న పసి హృదయాలు

పిల్లల మనసును అర్థం చేసుకోలేకపోతున్న తల్లిదండ్రులు, అధ్యాపకులు 

పిల్లలకు సమయం కేటాయించలేకపోతున్న తల్లిదండ్రులు

చదువుకోవాల్సిన వయస్సులో చావు దిశగా నడుస్తున్న యువ హృదయాలు


 చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

తల్లిదండ్రులు కళ్ళల్లో కలలను, గురువులు ఆశలను, సమాజం ఎదుగుదలను అర్థం చేసుకుంటూ మానసిక వికాసాన్ని పెంచుకోవలసిన దశ విద్యార్థి దశ. చదువు, సృజనాత్మకత, విజ్ఞానం పట్ల మమకారం పెంచుకోవాల్సిన వయసు. కానీ ఆ వయస్సులోనే యువ హృదయాలు ప్రేమ, భావోద్వేగం, నిరాశల మధ్య తడబడి ప్రాణాలను కోల్పోతున్న దృశ్యాలు ఇప్పుడు తరచుగా కనిపిస్తున్నాయి. ఇటీవల చిత్తూరు జిల్లాలో జరిగిన రెండు విద్యార్థి ఆత్మహత్యలు మనసును కలవరపెడుతున్నాయి.  ఒకటి పెనుమూరులో అరవింద్‌ది, మరొకటి చిత్తూరులో రుద్ర‌ది. ఈ వాస్తవాన్ని భయానకంగా మనముందు నిలిపాయి. ప్రేమలో విఫలమై మృత్యువును ఎంచుకున్న యువకుల సంఘటనలు సగటు తల్లిదండ్రులలో తమ బిడ్డల భవిష్యత్తు పట్ల భయాందోళనలను రేకెత్తిస్తున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలతో స్నేహపూర్వకంగా మెలగాల్సిన పరిస్థితిని మరోమారు గుర్తుచేస్తున్నాయి. పిల్లలకు కూడా కొంత సమయం కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలియజేస్తున్నాయి. అధ్యాపకులు విద్యార్థుల మనసులను కూడా అధ్యయనం చేయాలని, సరైన లక్ష్యం వైపు నడిపించాలని చెబుతున్నాయి.

పెనుమూరు మండలానికి చెందిన 17 ఏళ్ల అరవింద్, తన ప్రియురాలి ఎడబాటు తట్టుకోలేక, తల్లిదండ్రులకు క్షమాపణా లేఖ రాసి ఉరివేసుకున్నాడు. ఆ లేఖలో ఆమె నన్ను నమ్మించింది, కానీ వదిలి వెళ్లిపోయింది అని రాసిన పదాలు ప్రతి తల్లిదండ్రి గుండెను పిండేస్తున్నాయి.
మరోవైపు, చిత్తూరులోని బీటెక్ విద్యార్థి రుద్ర, తన ప్రేమను తిరస్కరించిందని బాధతో కళాశాల మూడవ అంతస్తు నుంచి దూకి ప్రాణాలు కోల్పోయాడు. ఈ రెండు ఘటనలూ వారం రోజుల వ్యవధిలోనే జరగడం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల మానసిక ఆరోగ్య పరిస్థితిపై తీవ్రమైన చర్చకు దారి తీసింది.


 *ప్రేమ అనే మాయలో మునుగుతున్న యువతరం*

నేటి యువత ప్రేమను జీవితంలో ఒక భాగంగా కాకుండా జీవితమే ప్రేమ కోసం అన్నట్లు భావిస్తున్నారు. సోషల్ మీడియాలో స్నేహం మొదలై, అర్ధాంతరంగా ప్రేమగా మారుతుంది. మెసేజ్‌లు, వీడియో కాల్స్, రాత్రివేళ చాటింగులు ఇవన్నీ ఒక భావోద్వేగ బంధంగా తయారవుతున్నాయి. కానీ, ఆ బంధం పటిష్టం కాదు. ఎప్పుడో ఒకప్పుడు ఇరువురి మధ్య విభేదాలు తలెత్తుతాయి. ఇష్టం లేకపోయినా ఒక్కొక్కసారి ఇష్టమైన వ్యక్తి బలవంతంగా విడిపోవలసి వస్తుంది. అలా విడిపోవడంతో మనసు విచ్ఛిన్నమవుతుంది. ఆ క్షణిక నిరాశే చాలామందికి చివరి నిర్ణయం తీసుకునే దిశగా నడిపిస్తోంది. టీవీ సీరియల్స్, సినిమాలలో చూపిస్తున్న ప్రేమే సర్వస్వం అనే తప్పుడు సందేశాలు ఈ భావనను మరింత బలపరుస్తున్నాయి. నిజ జీవితంలో సమస్యలు ఉంటాయనే అవగాహన లేకుండా, కల్పిత భావజాలంలో మునిగి పోతున్నారు.


 *మానసిక స్థైర్యం లేక జీవితాన్ని అర్థం చేసుకోలేని తరం*

చిన్న వయస్సులో ప్రేమ విఫలమవడం పెద్ద విషయం కాదు. కానీ ఆ విఫలతను జీర్ణించుకోలేని స్థాయికి వెళ్లడం ఆందోళనకరం. ఈ వయస్సులో మానసిక స్థైర్యం చాలా తక్కువగా ఉంటుంది. విజ్ఞానంతో పాటు భావోద్వేగ విద్య లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం. విద్యార్థులు బాధ, నిరాశ, ఒంటరితనం వంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకోవడం లేదు. తల్లిదండ్రులు చదువు అనే ఒక్క మాటతో పిల్లల భావోద్వేగ ప్రపంచాన్ని పక్కన పెట్టేశారు. ఉపాధ్యాయులు కూడా పాఠాలకే పరిమితమైపోయారు. ఇటు తల్లిదండ్రులు అటు ఉపాధ్యాయులు విద్యార్థులు మానసిక పరిస్థితులు అంచనా వేయలేకపోతున్నారు. మానసిక వార దగ్గర
 కాలేకపోతున్నారు. వారి కష్టసుఖాలలో పాలు పంచుకోవడం లేదు. ఫలితంగా విద్యార్థి ఒత్తిడి, ప్రేమ విఫలం, లేదా చిన్న తప్పుబాటు  ఏదైనా ఎదురైతే, జీవితం ముగిసిందనే తప్పుడు భావనకు లోనవుతున్నారు.

*ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల బాధ్యత*

విద్యార్థి జీవితంలో గురువుల పాత్ర పుస్తకాలకే పరిమితం కాకూడదు. విద్యార్థి ప్రవర్తనలో మార్పు కనిపిస్తే, వెంటనే మాట్లాడి, అతని మనసులోని కలతలను తెలుసుకోవాలి.
తల్లిదండ్రులు కూడా కఠినంగా కాకుండా స్నేహపూర్వకంగా మాట్లాడాలి. ఎందుకు చదవడం లేదు ఆమె ప్రశ్నించడం కంటే  చదవడం ఎందుకు ఇష్టం లేదో తెలుసుకోవాలి. ఉన్నపలంగా పిల్లల ప్రవర్తనలో మార్పులు వస్తే, స్నేహపూర్వకంగా కారణం తెలుసుకోవాలి. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలి. ప్రతి ఇంట్లో పిల్లలు ఏమి  చేస్తున్నారు. వారి ప్రవర్తన ఎలా ఉంది. అనే విషయాలు తెలుసుకునే వాతావరణం ఉండాలి. పిల్లలతో స్నేహపూర్వకంగా మెలగాలి. వారికోసం కొంత సమయాన్ని కేటాయించాలి. పిల్లలు భయపడకుండా తమ మనసులోని భావాలను వ్యక్తం చేయగల పరిస్థితి ఉండాలి.

*విద్యాసంస్థల్లో కౌన్సిలింగ్ తప్పనిసరి*

ప్రతి కళాశాల, పాఠశాలలో మానసిక ఆరోగ్య కౌన్సిలర్ ఉండాలి. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడి, ప్రేమ సంబంధ సమస్యలు, నిరాశ వంటి అంశాలపై వారికి మార్గదర్శకత్వం కల్పించాలి. ప్రతీ నెలా ఒకసారి లైఫ్ స్కిల్స్ సెషన్ నిర్వహించాలి. దానిలో విఫలతను ఎలా స్వీకరించాలో, నిరాశను ఎలా ఎదుర్కోవాలో, సంబంధాల్లో సమతౌల్యం ఎలా పాటించాలో నేర్పించాలి. ప్రేమ విఫలమైతే జీవితం ముగిసిందన్న అర్థం కాదు. జీవితంలో ప్రేమకంటే పెద్ద లక్ష్యాలు, అవకాశాలు చాలా ఉన్నాయి. యువతను మానసికంగా బలంగా తీర్చిదిద్దడం సమాజం బాధ్యత. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వం, మీడియా  అందరూ కలసి యువతను సరైన దిశలో నడిపించాల్సిన సమయం వచ్చింది. ఆత్మహత్య ఏ సమస్యకు పరిష్కారం కాదు. ప్రతి సమస్యకు పరిష్కారం జీవితంలోనే ఉంది. ప్రేమలో విఫలం అయితే మరోసారి లేచి నిలబడే ధైర్యం నేర్పించాలి. అదే సమాజం చేయగల గొప్ప సేవ. ప్రేమ అనేది జీవితం లోని ఒక భాగం మాత్రమే. ప్రేమే జీవితం కాదని యువతకు అర్థమయ్యేలా చెప్పాలి. జీవితమంటే ఏమిటో తెలియ చెప్పాలి. అసలైన లక్ష్యం వైపు మనసులు మళ్లించాలి. ప్రేమలో విఫలమైతే చావు దిశగా  కాకుండా, జీవితాన్ని గెలుచుకునే దిశగా యువతను నడపాలి. అప్పుడే సమాజంలో ఈ ఆత్మహత్యలు తగ్గుతాయి. పటిష్టమైన యువతరం రూపుదిద్దుకుంటుంది. అలాంటి యువతరం మీదనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *