బెంగళూరు ఏటీఎం దోపిడీ నగదు కుప్పంలో రికవరీ
కూర్మానీ పల్లెలో రూ. 5.76 కోట్ల నగదు స్వాధీనం
ఈ కేసులో ఐదు మంది నిందితుల అరెస్టు
కారు ఇంజన్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు
కొలిక్కి వచ్చిన ఏటీఎం నగదు దోపిడి కేసు
చిత్తూరు, నవంబర్ 22 (ఆంధ్రప్రభ బ్యూరో) : బెంగళూరు పోలీసులు ఇటీవల చోటుచేసుకున్న ఏటీఎం క్యాష్ వ్యాన్ దోపిడీని ఛేదించారు. ఈ దోపిడీలో రూ.7.21 కోట్ల నగదును దోచుకున్న కేసులో ఐదుగురు నిందితులను కుప్పం మండలంలో అరెస్టు చేశారు. కుప్పం మండలం కూర్మానీపల్లెలో దోపిడీ సొత్తుకు సంబంధించి 5.76 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా బెంగళూరు పోలీసులు ఈ దోపిడీలో క్యాష్ వ్యాన్ ఇన్‌ఛార్జ్, ఒక పోలీస్ కానిస్టేబుల్, సి ఎం ఎస్ కంపెనీ మాజీ ఉద్యోగి నవీన్ తో పాటు సస్పెన్షన్ కు గురైన పోలీసు కానిస్టేబుల్ కర్ణాటక నాయక్, జీవియర్, గోపి, నెల్సన్ లను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఏటీఎం క్యాష్ దోపిడీ తర్వాత పోలీసులు గుడిపాల మండలంలో లభించిన కారు ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. కారుకు నకిలీ నంబర్ ప్లేటును దుండగులు అమర్చినట్లు తెలుసుకున్నారు. దీంతో కారు ఇంజన్ నంబర్ ఆధారంగా దర్యాప్తును ప్రారంభించారు. ఈ కారు బెంగళూరుకు చెందిన ఒక ట్రావెల్స్ ఏజెన్సీదిగా తేలింది. ట్రావెల్స్ యజమాని ద్వారా వివరాలను సేకరించిన పోలీసులు దోపిడిలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని ఆధారంగా కేసును దర్యాప్తు చేయడం ప్రారంభించారు. శుక్రవారం నగదు దోపిడీకి సంబంధించిన కాళీ బాక్సులను చిత్తపార అడవి ప్రాంతంలో కనుగొన్నారు. దీంతో నగదును గుడిపాల మండలం చిత్తపార గ్రామంలో ఒక ఇంటిలో దాచినట్లు కనుగొన్నారు. ఇందుకు ఒక మహిళ సహాయం తీసుకున్నట్లు తెలిసింది. ఆ ఇంటిలోకి వెళ్లి చూడగా నగలదు కనిపించలేదు. దీంతో దోపిడీ కేసులో కీలకంగా వ్యవహరించిన నవీన్ అనే వ్యక్తి కోసం గాలించారు. అతను కనిపించకపోవడంతో తండ్రి రామదాసును అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు కుప్పం మండలంలోని కూర్మానీ పల్లెలో నగదు దాచినట్లు కనుగొన్నారు. అక్కడికి వెళ్లి అక్కడ దాచిన 5.76 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ దోపిడీకి పాల్పడిన ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన నగదు కోసం పోలీసులు గాలిస్తున్నారు.
శనివారం పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ ఈ విషయమై మాట్లాడుతూ.. పోలీసులు ఈ ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.5.76 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నవంబర్ 19న, ఆర్‌బిఐ అధికారులుగా నటిస్తూ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ ఒక ఎటిఎం క్యాష్ వ్యాన్‌ను ఆపి సుమారు రూ.7 కోట్లతో పారిపోయారని పోలీసులు తెలిపారు. జెపి నగర్‌లోని ఒక బ్యాంకు శాఖ నుంచి సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్ వాహనం నగదును రవాణా చేస్తుండగా ఈ దోపిడి జరిగింది. నిందితులు భారత ప్రభుత్వ స్టిక్కర్ ఉన్న కారులో వచ్చి, పత్రాలను ధృవీకరించాలని చెప్పి వ్యాన్‌ను ఆపి, నగదుతో పాటు సిబ్బందిని బలవంతంగా తమ వాహనంలోకి ఎక్కించారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ మాట్లాడుతూ.. ఈ దోపిడీలో క్యాష్ వ్యాన్ ఇన్‌ఛార్జ్, ఒక పోలీసు కానిస్టేబుల్, ఒక సి ఎం ఎస్ మాజీ ఉద్యోగి పాల్గొన్నట్లు వెల్లడించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.5.76 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మిగిలిన మొత్తాన్ని కనుగొనడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ ఆపరేషన్ కోసం పదకొండు బృందాలను ఏర్పాటు చేసి 200 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు. ఈక్రమంలో 30 మందికి పైగా వ్యక్తులను ప్రశ్నించి, ముగ్గురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. నేరస్థులను పట్టుకోవడానికి ఆరు బృందాలను అన్ని దక్షిణాది రాష్ట్రాలు, గోవాకు వరకు వెళ్లాయని వెల్లడించారు. వీరిలో వెహికల్ ఇన్‌ఛార్జ్, సిఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్ మాజీ ఉద్యోగి, గోవిందపుర పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ నిందితులుగా ఉన్నారని చెప్పారు. ఈ ముఠా మూడు నెలల క్రితమే దోపిడీకి ప్లాన్ చేసిందని ఆయన తెలిపారు. వారు క్యాష్ వ్యాన్ వెళ్లే మార్గాన్ని పరిశీలించి, సీసీటీవీ కెమెరాలు లేని మార్గాన్ని దోపిడికి ఎంచుకున్నట్లు వెల్లడించారు.

