ఎడబాటు తట్టుకోలేక మైనర్ ప్రేమికుడి ఆత్మహత్య
పెనుమూరులో విషాదం – తల్లిదండ్రులకు లేఖ రాసి ఆత్మహత్య
చిత్తూరు నవంబర్ 2 ఆంధ్రప్రభ బ్యూరో
ప్రియురాలు ఎడబాటు తట్టుకోలేక మైనర్ ప్రేమికుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారక ఘటన చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని పెనుమూరు మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే – పెనుమూరు మండలం ఎర్రమట్టిపల్లికి చెందిన అరవింద్ (17) పెనుమూరులోని తిరుమల ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అదే కళాశాలలో, అదే తరగతిలో ఎర్రవారిపాలెంకు చెందిన ఒక ముస్లిం యువతి కూడా చదువుతోంది. ఆ యువతి పెనుమూరులో అమ్మమ్మ ఇంట్లో ఉంటూ చదువుకుంటోంది. ఒకే తరగతిలో చదువుతున్న వీరి మధ్య స్నేహం ప్రేమగా మారి గాఢమైన అనుబంధంగా మారింది. ఇటీవల ఇద్దరూ పెద్దల అనుమతి లేకుండానే అక్టోబర్ 24 వ తారీఖున పెళ్లి చేసుకొని పారిపోయారు. ఈ విషయం తెలిసిన అమ్మాయి తల్లిదండ్రులు పెనుమూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పెనుమూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అబ్బాయి వాళ్ళ బంధువులకు ఫోన్ చేసి తమ విజయవాడ గన్నవరంం లో ఉన్నట్లు సమాచారం ఇవ్వడంతో అబ్బాయి తండ్రి పరంధామయ్య ఒక ఏఎస్ఐ ఒక కానిస్టేబుల్ వెళ్లి వారిని మంగళవారం రాత్రి పెనుమూరుకు తీసుకొని వచ్చారు. బుధవారం ఇద్దరి తరపున పెద్ద మనుషులు పోలీస్ స్టేషన్లో మాట్లాడారు. పోలీస్ స్టేషన్‌లో ఇరువురికి కౌన్సిలింగ్ నిర్వహించారు. అమ్మాయి మేజర్ అయిన అబ్బాయి మైనర్ కావడంతో ఇరువురికి పెళ్లి చేయడం కుదరదని పోలీసులు తేల్చి చెప్పారు. ఇరువురి తరపున పెద్దలు మాట్లాడుతూ ఇద్దరూ బాగా చదువుకుని స్థిరపడిన తర్వాత కూడా ప్రేమ అలాగే ఉంటే అప్పట్లో పెళ్లి జరిపిస్తాం అని హామీ ఇచ్చారు. అబ్బాయి తండ్రి పరంధామయ్య మాట్లాడుతూ డిగ్రీ పూర్తి అయిన తర్వాత తానే ఉద్యోగము తీసి ఇచ్చి అదే అమ్మాయితో వివాహం చేస్తానని అబ్బాయికి హామీ ఇచ్చారు. అమ్మాయిని వాళ్ల సొంత ఊరైన ఎర్ర వారి పాలెం తీసుకెళ్లిపోయారు. మూడు రోజులపాటు బాగానే ఉన్నా అబ్బాయి అరవింద్ ఆదివారం మధ్యాహ్నం ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఎర్రమట్టిపల్లి, పెనుమూరు ప్రాంతాల్లో తీవ్ర విషాదం నెలకొంది. అరవింద్ ఆత్మహత్యకు ముందు రాసిన లేఖ మరింత మానసిక వేదనను ప్రతిబింబించింది. అరవింద్ రాసిన సూసైడ్ నోట్ లో ఇలా ఉంది. అమ్మా, నాన్నా సారీ. నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించండి. డాడీ, నాకు బతకాలని లేదు. నావల్ల నీవు చాలా బాధ పడ్డావు. సారీ డాడీ. ఆ పిల్ల నన్ను చాలా నమ్మించింది, నాతోనే ఉంటానని చెప్పింది. కానీ మోసం చేసింది. నా వల్ల కాదు డాడీ… మీ కోసం బతకాలని ఉంది కానీ నన్ను క్షమించండి, సారీ డాడీ… అందరినీ వదిలి వెళ్ళిపోతున్నాను. ఈ ఘటనపై పెనుమూరు పోలీసులు కేసు నమోదు చేసి తాలూకా సిఐ నిత్య బాబు ఆధ్వర్యంలో పెనుమూరు ఎస్సై వెంకట నరసింహ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
గంగ 2 మృతుడు అరవింద్

