25, నవంబర్ 2025, మంగళవారం

మద్దతు ధర మాయమై… మామిడి రైతు బతుకు భారమై...

కనీస ధర బిల్లుల కోసం మామిడి రైతుల పోరుబాట 

కాయలు తోలి ఆరు నెలలు అవుతున్న అందని బిల్లులు 

నేడు, రేపు అంటూ కాలం గడుపుతున్న ఫ్యాక్టరీలు 

జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదేశించినా,  బిల్లుల ఊసే లేదు 

కలెక్టరేట్ ముట్టడికి మామిడి రైతుల పిలుపు


చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.


చిత్తూరు జిల్లా మామిడి రైతుల పరిస్థితి ఇటీవలి కాలంలో అత్యంత క్లిష్టంగా మారింది. ఆసియాలోనే అతిపెద్ద పల్ప్ క్లస్టర్‌గా పేరొందిన ఈ ప్రాంతంలో ప్రతి సంవత్సరం లక్షల టన్నుల మామిడి దిగుబడి వచ్చినా, రైతులు మాత్రంకు ప్రతి సంవత్సరం అప్పులు, నష్టాలు మిగులుతున్నాయి. గత ఏడాది టన్నుకురూ.30,000 పలికిన తోతాపురి రకం మామిడికి ఈ సంవత్సరం కేవలం రూ 4,000 నుండి 5,000 మాత్రమే రావడం రైతుల జీవన విధానాన్నే అస్తవ్యస్తం చేసింది. సరైన మార్కెట్ లేక, దోపిడీ పెరగడంతో కొందరు రైతులు తమ టన్నుల కొద్దీ పండ్లను రోడ్లపై పారబోసి నిరసన తెలుపాల్సిన పరిస్థితికి దిగజారారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలను రైతులకు చెల్లించిన మామిడికాయలను కొనుగోలు చేసిన జ్యూస్ ఫ్యాక్టరీలు ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదు. ఆరు నెలల కాలంగా ఓపిక ఎదురుచూసిన రైతులకు ఆందోళన బాట పడుతున్నారు. ఇటీవల జిల్లా ఇన్చార్జి మంత్రి రాంప్రసాద్ రెడ్డి జ్యూస్ ఫ్యాక్టరీ యజమానులతో సమావేశమై బిల్లులు చెల్లించాలని కోరినా, ఫ్యాక్టరీ యజమానులలో మాత్రం చలనం కనిపించడం లేదు. డిసెంబర్ నెలలో జిల్లా కలెక్టరేట్ ముట్టడికి మామిడి రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. మళ్లీ సీజన్ ప్రారంభమవుతున్న బిల్లులు రాకపోవడంతో మామిడి రైతులు ఆర్థికంగా కుదేలవుతున్నారు.


మామిడి పంటలో చిత్తూరు జిల్లాకు ప్రత్యేక స్థానముంది. 97,006 హెక్టార్ల సాగు విస్తీర్ణంలో ప్రధానంగా తోతాపురి రకం సాగవుతుంది. ఈ రకం ప్రధానంగా పల్ప్‌ తయారీకి మాత్రమే ఉపయోగపడుతుంది. అందువల్ల రైతులు స్థానిక పల్ప్ ఫ్యాక్టరీలపైనే పూర్తిగా ఆధారపడాల్సి వస్తుంది. కానీ ఈ ఆధారపడ్డ వ్యవస్థనే మార్కెట్ మాఫియాగా మారి రైతులను చెక్కుచెదరనంతగా నష్టపరుస్తోంది. గత సంవత్సరం నుంచే పల్ప్ యూనిట్లలో భారీగా నిల్వ ఉన్న 2.74 లక్షల టన్నుల పల్ప్ స్టాక్ కారణంగా యూనిట్లు కొత్త మామిడిని కొనడానికి ఆసక్తి చూపలేదు. ఎగుమతి మార్కెట్లు యుద్ధాలు, ఆర్థిక మందగమనంతో నిలకడ కోల్పోవడంతో పల్ప్ డిమాండ్ పడిపోయింది. ఈ పరిస్థితుల్లో చిత్తూరులోని 27 యూనిట్లు రోజుకు పట్టే ఇన్‌పుట్ మొత్తాన్ని కేవలం 7 మెట్రిక్ టన్నుల వరకు తగ్గించాయి. రైతుల నిరసనలు పెరగడంతో ప్రభుత్వం తోతాపురికి కనీస మద్దతు ధరగా రూ. 12/కేజీ ప్రకటించింది. ఇందులో రూ.8 యూనిట్ చెల్లించాలి, మిగిలిన రూ. 4 సబ్సిడీని ప్రభుత్వం జమ చేయాలి. కానీ మద్దతు ధర కేవలం కాగితం మీదే మిగిలిపోయింది. పల్ప్ యూనిట్ యజమానులు, కొందరు వ్యాపారులు సిండికేట్ ఏర్పాటు చేసుకుని ధరలను నియంత్రించడం ప్రారంభించారు. రైతులు గేటు వద్దకు పండ్లు తీసుకువచ్చాకే రూ.4 నుండి5 కేజీ మాత్రమే అందిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ధరలు ఇలా కుప్పకూలడంతో రైతుల పెట్టుబడులు, వారి జీవనం రెండూ దెబ్బతిన్నాయి. వ్యవసాయ అధికారులు పేర్కొన్నట్లుగా కనీస మద్దతు ధరను అమలు చేసే పర్యవేక్షణ కూడా పూర్తిగా వైఫల్యం చెందింది. మరోవైపు వాతావరణ మార్పులు కూడా రైతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈశాన్య రుతుపవనాల్లో జిల్లాలో సాధారణ వర్షపాతం 395 మి.మీ. ఉండాల్సింది పోయి 688 మి.మీ. కురిసింది. అధిక వర్షాలు పూత కాలాన్ని దెబ్బతీశాయి. ఆ తర్వాత ఆకస్మికంగా పెరిగిన ఉష్ణోగ్రతల ప్రభావంతో పూత, పిందెలు రాలిపోవడం ఎక్కువైంది. దీని ఫలితంగా 5 లక్షల టన్నులుగా అంచనా వేసిన దిగుబడి దాదాపు 40 శాతం తగ్గింది. 3.30 లక్షల టన్నుల దిగుబడి మాత్రమే వచ్చింది. అదనంగా ముడత తెగులు, బూడిద తెగులు, కాయకుళ్లు తెగులు వంటి వ్యాధులు పంట నాణ్యతను మరింత దిగజార్చాయి. దిగుబడి తగ్గుతున్న కొద్దీ రైతులు రసాయనాలపై అత్యధికంగా ఖర్చు పెట్టడం ప్రారంభించారు. కొందరు రైతులు సీజన్‌కు పెట్టే రూ.4 లక్షలలో సగానికి పైగానే పెస్టిసైడ్లు, రసాయనాలకే పెట్టాల్సి వచ్చిందని చెబుతున్నారు. అయినప్పటికీ 20–25 శాతం దిగుబడే వస్తుందని రైతులు బాధపడుతున్నారు. ఈ విచక్షణారహిత రసాయన వాడకం నాణ్యతను తగ్గించడమే కాక, ఎగుమతులకు అవసరమైన ప్రమాణాలను కూడా దెబ్బతీస్తోంది. ప్రకృతి విపత్తుల కారణంగా పంట నష్టం జరిగిన రైతులకు ప్రభుత్వం ఒక హెక్టారుకు రూ. 20,000 పరిహారం ఇస్తోంది. అయితే ఇది పొందాలంటే కనీసం 33 శాతం నష్టం నిరూపించాలి. పూత, పిందె రాలిపోవడం సరిపోదు. చెట్లు పాక్షికంగా ధ్వంసమై ఉండాలనే నిబంధన వల్ల వేలాది మంది చిన్న రైతులకు పరిహారం అందడం లేదు. ఈ విధమైన కఠిన నిబంధనలు రైతుల ఆర్థిక భారాన్ని మరింత పెంచుతున్నాయి. చిత్తూరులో రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న మరో నిర్మాణాత్మక సమస్య ప్రీ-హార్వెస్ట్ కాంట్రాక్టర్ల  దోపిడీ. చిన్న రైతులు కోత, రవాణా, మార్కెట్ రిస్క్‌ను భరించలేక ముందుగానే తమ తోటలను తక్కువ ధరకు కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారు. ఈ విధానం వల్ల మార్కెట్ ధర ఎక్కువగా ఉన్నా, రైతులకు వాటా తగ్గిపోతుంది.  దాదాపు సగం లాభం మధ్యవర్తులే దోచుకుంటున్నారు. ఈ మొత్తం సంక్షోభానికి తాత్కాలిక పరిష్కారాల కంటే శాశ్వత మార్గాలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వం మూడు జిల్లాల్లో రూ.183 కోట్ల సబ్సిడీ జమ చేసినప్పటికీ, ఇది రైతులకు చిన్న ఉపశమనమే. పల్ప్ పరిశ్రమలపైన ఆధారపడే ఈ వ్యవస్థను పునర్నిర్మించకపోతే సమస్య పూర్తిగా పరిష్కారం కాకపోవచ్చును. మామిడి పల్ప్‌పై ప్రస్తుతం ఉన్న 12 శాతం ఉన్న జిఎస్టిని  5 శాతంకు తగ్గిస్తే పరిశ్రమలు తక్కువ ధరకు పండ్లు కొనుగోలు చేయగలవని పరిశ్రమల వర్గాలు చెబుతున్నారు. అలాగే కనీస మద్దతు ధర అమలు జరుగుతున్నదో లేదో కఠినంగా పర్యవేక్షించే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. పోతాపురిని పల్ప్‌కే పరిమితం కాకుండా డ్రైడ్ మ్యాంగో, క్యూబ్స్, స్లైసెస్ వంటి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీలోకి రైతులను ప్రోత్సహించడం అవసరం. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు  బలోపేతం అయితే ప్రాసెసర్‌లకు ప్రత్యక్ష విక్రయం జరగడం ద్వారా మధ్యవర్తుల దోపిడీ తగ్గుతుంది. నీరు కొరత ఉన్న చిత్తూరు వంటి ప్రాంతాల్లో మైక్రో ఇరిగేషన్‌ను ప్రోత్సహించడం, పండ్ల కవర్లను వినియోగించడం ద్వారా తెగుళ్లను అదుపులో ఉంచవచ్చు. నాణ్యత పెరుగితే ధరలు కూడా రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. చిత్తూరు మామిడి రైతుల సమస్య కేవలం ధరలు పడిపోవడమే కాదు. ఇది మార్కెట్ అవినీతి, వాతావరణ అనిశ్చితి, వ్యవస్థపరమైన లోపాల మధ్య చిక్కుకున్న భారీ సంక్షోభం. ఈ రంగాన్ని రక్షించాలంటే తాత్కాలిక ఉపశమనాలు సరిపోవు. పాలసీ, మార్కెట్ సంస్కరణలు, నాణ్యత నియంత్రణ, ప్రత్యక్ష మార్కెటింగ్‌ వంటి సమగ్ర చర్యలు తీసుకోవడం అత్యవసరం. లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఉద్యానవన రంగం మరింత తీవ్రమైన దెబ్బ తినే ప్రమాదం ఉంది.




అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *