చిరుత దాడికి మరో ఆవు బలి
వరుస ఘటనలతో ప్రజల్లో భయాందోళన
చిత్తూరు, నవంబర్ 15 (ఆంధ్రప్రభ బ్యూరో)
చిత్తూరు జిల్లా ఐరాల, తవణంపల్లి మండలాల పరిసర అటవీ ప్రాంతాల్లో చిరుత దాడులు విపరీతంగా పెరుగుతున్నాయి. పశువులను మేపే రైతులు, రాత్రి పొలాలకు వెళ్లే కార్మికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. శనివారం మరొకసారి చిరుత దాడి చేసి ఆవును చంపిన ఘటన తవనంపల్లి మండలం వెంగంపల్లిలో చోటుచేసుకుంది. వెంగంపల్లి గ్రామానికి చెందిన రైతు దేవేందర్ రెడ్డి తన నాలుగు పాడి ఆవులను గ్రామానికి సమీపంలోని అడవి అంచు వద్ద ఉన్న పొలంలో కట్టి పెట్టాడు. ఉదయం వెళ్లి చూడగా ఒక తరుపు కనిపించలేదు చుట్టుపక్కల ప్రాంతాలలో గాలించగా ఆ రైతు షాక్ గురి అయ్యాడు. ఆవు రక్తపు మడుగులో మృతదేహంగా పడి ఉండటంతో గ్రామస్థులు ఒక్కసారిగా గుబులు పట్టింది. ఆవు గొంతు భాగం చిరుత దాడికి గురై ఉండగా, పొదుగు భాగాన్ని జంతువు పూర్తిగా తినివేసినట్లు గుర్తించారు. అడవి వైపు ఆవు మాంసాన్ని ఈడ్చుకుపోయిన దాఖలాలు కూడా కనిపించాయి. వేకువజావన నాలుగు గంటల ప్రాంతంలో ఆవులు బిగ్గరగా అరిచాయని సమీపంలోని రైతులు తెలిపారు. పులి దాడిగా నిర్ధారించుకున్న దేవేందర్ రెడ్డి అడవి శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని పరిశీలించారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. గత నెల రోజులలో ఐరాల, తవణంపల్లి మండలాల్లో చిరుత దాడికి గురైన మూడో ఆవు మృతి చెందింది. గతంలో పుత్రమద్ది, వడ్రంపల్లి గ్రామాల్లో దూడలు, ఆవులు చిరుతలకు బలైన విషయం ఇప్పటికీ ప్రజల మనస్సుల్లో భయాన్ని పెంచుతోంది.
పుత్రమద్దిలో రైతు భాస్కర్ ఆవును చిరుత చంపి తిన్న ఘటన, వడ్రంపల్లిలో రైతు కిషోర్ కుమార్ దూడపై చిరుత దాడి, వెంగంపల్లిలో ఆవు దూడను చంపి తినడంతో
గ్రామాల్లో భయానికి కారణమయ్యాయి. పగటిపూట కూడా రైతులు పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. పంటలు వేసేందుకు కూడా ముందుకు రావడంలేదని గ్రామస్తులు వాపోతున్నారు. అటవీ శాఖ అధికారులు ఒక్కో ఘటన జరిగిన తర్వాత మాత్రమే వచ్చి వెళ్లి నామమాత్రంగా చర్యలు తీసుకుంటున్నారని మండల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

