నేటి నుండి రైతన్న మీకోసం సర్వే
313 రైతు సేవ కేంద్రాలలో ప్రారంభం
కల్టివేటర్ యాప్ లో రైతుల అభిప్రాయాలు నమోదు
ఫార్మర్ యాప్ తో రైతుకు చేరువగా సాంకేతికత
ఇంటింటికి వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు
*చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.*
చిత్తూరు జిల్లాలో సోమవారం నుండి 29 తేదీ వరకూ రైతన్న నీకోసం ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. అలాగే డిసెంబరు 3 తేదీన కూడా నిర్వహించనున్నారు. జిల్లాలోని 313 రైతు సేవ కేంద్రాలలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు రోజుకు 50 ఇళ్లకు వెళ్లి ప్రభుత్వం రైతుల కోసం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తారు. మామిడి పంటకు మద్దతు ధర, అన్నదాత సుఖీభవ, ప్రధానమంత్రి కిసాన్ యోజన, సబ్సిడీ మీద వ్యవసాయ ఉపకరణాలు, సబ్సిడీ విత్తనాల పంపిణీ, డ్రిప్ ఇరిగేషన్ తదితర అంశాలను రైతులకు వివరిస్తారు. వారి అభిప్రాయాలను నమోదు చేసి ప్రభుత్వానికి ప్రత్యేక యాప్ ద్వారా ప్రభుత్వానికి నివేదిస్తారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొంటారు. ఇందులో భాగంగా వ్యవసాయంలో పంచసూత్రాలు అమలు ద్వారా రైతులకు కలిగే మేలుపై వారి ఇళ్లకు వెళ్లి ప్రజాప్రతినిధులు, అధికారులు వివరించనున్నారు. ఈ నెల 24 నుంచి 29వ తేదీ వరకు ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. డిసెంబర్ 3న రైతు సేవా కేంద్రాల పరిధిలో వర్క్‌షాపులు నిర్వహిస్తారు.
ఈ విషయమై వ్యవసాయ, అనుబంధ రంగాలు, మార్కెటింగ్ శాఖ అధికారులు, సిబ్బంది సహా 10 వేల మందితో సీఎం చంద్రబాబు ఇటీవల టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచసూత్రాలపై రైతులకు అవగాహన కల్పించే అంశంపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో నిర్వహించాల్సిన కార్యక్రమాలకు సంబంధించి షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. 17 నెలలుగా రైతులు, వ్యవసాయాన్ని ముందుకు తీసుకువెళుతున్న తీరును, అన్నదాతా సుఖీభవ-పీఎం కిసాన్ పథకం కింద దాదాపు 46.50 లక్షల మంది రైతులకు రెండు విడతల్లో రూ.14 వేలు చొప్పున జమ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. బిందు సేద్యానికి అధిక ప్రాధాన్యమిస్తున్నమని, వారంలో ఒకరోజు పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని చేపడుతున్నమని చెప్పారు. రైతులకు మరింత మేలు చేకూర్చేలా పంచసూత్రాలు ప్రకటించామన్నారు. నీటిభద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్దతు అనే పంచసూత్రాల విధానాన్ని చేపట్టామని, వీటిపై రైతులకే కాకుండా వారి కుటుంబసభ్యులకు కూడా అవగాహన కల్పించాలని కోరారు. పాడి రైతులు, పౌల్ట్రీ, గొర్రెల పెంపకందారులు, ఆక్వా, ఉద్యాన, సెరికల్చర్ రైతులకూ అవగాహన కల్పించాలని, రైతు సేవా కేంద్రాల్లో ఉండే సిబ్బంది ముందుండి దీన్ని చేపట్టాలని చంద్రబాబు ఆదేశించారు. శాస్త్రీయ వ్యవసాయంతోనే రైతుకు గిట్టుబాటు అవుతుంది. దీని కోసం ఆధునిక పద్ధతుల ద్వారా పంటలకు మరింత విలువ జోడించేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఇంటింటికీ వెళ్లి వివరించాలన్నారు. ప్రకృతి సేద్యాన్ని మరింతగా ప్రోత్సహిస్తున్నామని, దీని వల్ల భూసార రక్షణతోపాటు ఆరోగ్యం కూడా బాగుంటుందన్నారు. ఇప్పటికే ఆయా ఉత్పత్తులకు సర్టిఫికేషన్‌తోపాటు ట్రేసబిలిటీ కల్పిస్తున్నామని, రైతు బజార్లలోనూ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలను మరింత ప్రోత్సహించాలని ఆదేశించారు. ప్రైవేటు దుకాణాల కంటే గ్రోమోర్ కేంద్రాల్లో ఎరువుల ధర తక్కువగా ఉన్న విషయాన్ని రైతులకు వివరించాలన్నారు. రైతులు ఏ పంటలు వేశారు? వారికి ఎలాంటి సాయం అవసరమనే విషయాన్ని నేరుగా తెలుసుకొని, సాగులో పురుగుమందుల వినియోగం వల్ల కలిగే నష్టాలను రైతులకు వివరించాలని చెప్పారు. తక్కువ వినియోగం వల్ల లాభాలు, సేంద్రీయ విధానం ద్వారా పండించిన ఉత్పత్తులకు విదేశాల్లో ఏ స్థాయిలో డిమాండ్ ఉందనేది వివరించాలని, సమర్థ నీటి నిర్వహణ, భూసార పరీక్షలు, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం ఇస్తున్న మద్దతు వంటి విషయాలను రైతులకు చెప్పాలని సీఎం దిశానిర్దేశం చేశారు.
రైతన్నా - మీ కోసం కార్యక్రమంలో వ్యవసాయ అనుబంధ రంగ అధికారులు ప్రతి ఒక్కరు పాల్గొనాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ ఆదేశించారు. శనివారం సాయంత్రం సమయంలో క్యాంప్ కార్యాలయం నుండి టెలి కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులకు దిశా దిశ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు కావాలని స్పష్టం చేశారు. ఆర్ ఎస్ కే పరిధిలోని ప్రతీ రైతు ఇంటికీ ముఖ్యమంత్రి లేఖను అందించటంతో పాటు నిర్దేశించిన పంచ సూత్రాలను కూడా వివరించి చెప్పాలని పేర్కొన్నారు. వ్యవసాయం, ఉద్యాన, ఆక్వా కల్చర్ లో అత్యుత్తమ సాగు విధానాలు పాటించేలా చైతన్యం కలిగించాలని నిర్దేశించారు. నీటి భద్రత లో భాగంగా భూగర్భజలాలు, రిజర్వాయర్లు, చెరువుల్లోని నీటి నిల్వల వివరాలతో పాటు సమర్థ నీటి నిర్వహణ వల్ల కలిగే లాభాలను రైతులకు వివరించాలన్నారు. డిమాండ్ డ్రివెన్ అగ్రికల్చర్ లో భాగంగా వాణిజ్య, అంతర ప్రత్యామ్నాయ పంటలు, ప్రకృతి సేద్యం గురించి చెప్పాలన్నారు. అగ్రిటెక్ లో భాగంగా వ్యవసాయ యాంత్రీకరణ, డ్రోన్ వినియోగం, శాటిలైట్ టెక్నాలజీ లాంటి అంశాలు ఉండాలని సూచించారు. రైతుల పండించిన పంటలకు మద్ధతు ధరలు, పీఎం కిసాన్, ఇన్ పుట్ సబ్సీడీ, రైతు బజార్లు మార్కెటింగ్ వివరాలు ఇవ్వాలన్నారు. వ్యవసాయ శాఖ తయారు చేసిన ఫార్మర్ యాప్ ను ప్రతీ రైతుకూ చేరువ చేయాలని సూచించారు. యాప్ ద్వారా వ్యవసాయ భూమి, పంట సాగు వివరాలు, వాతావరణ సలహాలు, తెగుళ్లకు సంబంధించిన హెచ్చరికలు, మార్కెట్ ధరలు, భూసార పరీక్షలు, మార్కెట్ ఇంటెలిజెన్స్ లాంటి వివరాలను అందించాలన్నారు. రియల్ టైమ్ లో సమాచారం అందితేనే రైతులకు ప్రయోజనం ఉంటుందని అన్నారు. క్షేత్రస్థాయిలో అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్, అక్వా కల్చర్ అసిస్టెంట్లు రైతన్నా- మీకోసం కార్యక్రమాన్ని రైతుల వద్దకు తీసుకెళ్లటంలో వారంతా ముఖ్యపాత్ర పోషించాలని అన్నారు.

