అటకెక్కిన అంబేద్కర్ విగ్రహం నిప్పు కేసు
కేసుల్లో కనిపించని పురోగతి
నిందితులను గుర్తించడంలో పోలీసుల వైపల్యం
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
అక్టోబర్ మూడవ తేదీ రాత్రి అంబేద్కర్ విగ్రహానికి ఎవరో నిప్పు పెట్టారన్న ప్రచారం సంచలనంగా మారింది. వైసిపి, టిడిపి నేతలు ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలన్న దురుద్దేశ్యంతో మాజీ డిప్యూటీ సిఎం నారాయణ స్వామి అనుచరులు విగ్రహానికి నిప్పు పెట్టారని టిడిపి నేతలు ఆరోపించారు. అయితే దీని వెనక టిడిపికి చెందిన సతీష్ నాయుడు, కిషన్ చంద్ హస్తం ఉందని నారాయణ స్వామి, స్థానిక వైసిపి సర్పంచ్ గోవిందయ్య ప్రత్యరోపణ చేశారు. రాష్ట్ర హోం మంత్రి అనిత, ఎంపి దగ్గుమల్ల ప్రసాద్ రావు, ఎమ్మెల్యేలు డాక్టర్ డాక్టర్ వి ఎం థామస్, డాక్టర్ కె మురళీ మోహన్, గురజాల జగన్ మోహన్ నాయుడు తదితరులు సంఘటనా స్థలం సందర్శించారు. అయితే అంబేద్కర్ విగ్రహానికి ఎవరూ నేరుగా నిప్పు పెట్టలేదని పోలీసుల దర్యాపులో తేలింది. పక్కనున్న ఒక మహిళ షెడ్డుకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారని, అక్కడి నుంచి ఎగిరి పడిన కొబ్బరి ఆకుల వల్ల విగ్రహం కొంత కాలిందని తేల్చారు. అయితే సర్పంచ్ గోవిందయ్య మత, కుల విద్వేషాలు రెచ్చగొట్టడానికి కుట్ర చేసి దుష్ప్రచారం చేశారని భావించి కేసు పెట్టి రిమాండ్ కు పంపారు.
కాగా కొద్ది రోజుల తరువాత వెదురుకుప్పం పోలీసు స్టేషన్ కానిస్టేబుల్ గంగయ్య దేవళంపేటకు చెందిన యువకుడు అరుణ్ ను అక్రమంగా అరెస్టు చేసి టిడిపి నేతల ప్రేరణతో తానే విగ్రహానికి నిప్పు పెట్టినట్టు ఒప్పుకోవాలని వేధించాడు. అయితే ఆ సమయంలో అతను తిరుపతిలో ఉన్నట్టు కుటుంబ సభ్యులు ఆధారాలు చూపడంతో వదిలేశాడు. మరుసటి రోజు చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రిలో చేరిన అరుణ్ అసలు విషయం బయట పెట్టాడు. తనను కానిస్టేబుల్ గొలుసులతో కిటికీకి కట్టి కొట్టాడని ఆరోపించారు. అతని ఆరోపణల వీడియోలు వైరల్ కావడంతో టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి దీనిపై లోతైన దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ స్పందించి కానిస్టేబుల్ గంగయ్యను సస్పెండ్ చేశారు. అయితే తరువాత దీనిపై దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదని తెలిసింది. గోవిందయ్య మాత్రం బెయిలు రానందున జైళ్లో ఉన్నారని తెలిసింది. నిందితుడు గోవిందయ్య , కానిస్టేబుల్ గంగయ్యను విచారించి దీని వెనక ఉన్న కుట్ర కోణం వెలికి తీయాలని పలువురు కోరుతున్నారు.

