నేటి నుండి గ్రంధాలయ వారోత్సవాలు
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
ఒకప్పుడు విజ్ఞాన దీపాలుగా, జ్ఞానాన్ని పంచే కేంద్రాలుగా పేరు గాంచిన ప్రభుత్వ గ్రంథాలయాలు నేడు నిధుల కొరతతో అల్లాడిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యికి పైగా ఉన్న ఈ ప్రజా గ్రంథాలయాల్లో చాలావాటిలో కనీసం వార్తాపత్రికలు వేయించడానికి కూడా ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో, వాటి మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. గ్రంథాలయాలు మౌలిక సదుపాయాలు లేక, పుస్తకాల కొరతతో రోజురోజుకీ వెలవెలబోతున్నాయి. విజ్ఞాన భాండాగారాలైన గ్రంథాలయాలనుగత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని పాఠకులు, ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కొత్త గ్రంథాలయ భవనాల నిర్మాణం గానీ, ఉన్న వాటికి మరమ్మతులు గానీ ప్రభుత్వం చేయడం లేదు. సిబ్బంది జీతాలు, అభివృద్ధి పనులకు అవసరమైన నిధులను స్థానిక సంస్థల పన్ను ఆదాయంతోనే చూసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం వల్ల, గ్రంథాలయాల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది.
జిల్లా కేంద్రమైన చిత్తూరులో జిల్లా గ్రంధాలయ సంస్థకు సొంత భవనం కూడా లేదు. ఇదివరకు ఎన్జీవో హోం పక్కన ఉన్న జిల్లా గ్రంథాలయ సంస్థ భవనాన్ని రోడ్డు వెడల్పు చేయడానికి కూల్చివేశారు. గత రెండు సంవత్సరాలుగా జిల్లా గ్రంథాలయం సంస్థ అద్దె భవనంలో చిత్తూరు మిట్టూరులోని రాఘవ థియేటర్ ఎదురుగా మిద్దె పైన నడుస్తోంది. గ్రంథాలయం మిద్దపైన ఉండడంతో వికలాంగులు, వృద్ధులు గ్రంథాలయానికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు. దీంతో చిత్తూరు పట్టణంలో పాత గ్రంథాలయ సంస్థ స్థలంలోని కొత్తగా గ్రంధాలయాన్ని భవనాన్ని నిర్మించడానికి మూడు కోట్ల రూపాయలతో విశాలంగా జిల్లా గ్రంధాలయ నిర్మాణం జరుగుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 71 గ్రంథాలయాలు ఉన్నాయి. ఇందులో 54 గ్రంథాలయాలకు సొంత భవనాలు ఉన్నాయి. 12 గ్రంథాలయాలు అద్దెలేని ఉచిత భవనాల్లో నడుస్తున్నాయి. ఐదు గ్రంథాలయాలకు అద్దె కడుతున్నారు. జిల్లా గ్రంధాలయాలకు స్థానిక సంస్థల సెస్ ముఖ్యమైన ఆదాయం. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు సెస్ వసూలు చేసే పన్నులలో 8 శాతం జిల్లా గ్రంథలయాలకు అందజేయాలి. పలువురు గ్రంధలయ సెస్ ను వసూలు చేయడానికి ముందుకు రావడం లేదు. మరికొన్ని స్థానిక సంస్థలు వసూలు చేసినా, జిల్లా గ్రంథాలయ సంస్థకు చెల్లించడం లేదు. చిత్తూరు జిల్లాలో 32 కోట్ల రూపాయలు జిల్లా గ్రంధాలయ సంస్థకు స్థానిక సంస్థలు బకాయిలుగా ఉన్నాయి. తిరుపతి మున్సిపాలిటీ మాత్రమే 28 కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉంది. ఈ విషయమై జిల్లా గ్రంథాలయ అధికారులు పలుమార్లు ఉత్తర ప్రత్యుత్తరాలు జరపగా, కొంత మొత్తం మాత్రం చెల్లించారు. అలాగే స్థానిక సంస్థలు కూడా నాలుగు కోట్ల రూపాయలకు పైగా గ్రంధాలయసేస్ బకాయిలుగా ఉన్నాయి. సగటున ప్రతి సంవత్సరం ఐదు కోట్ల రూపాయలు గ్రంథాలయ సెస్ గా వసూలు కావాల్సి ఉంది. వీటి మీద ప్రభుత్వం కానీ, జిల్లా అధికారులు కానీ ప్రత్యేకమైన శ్రద్ధ చూపకపోవడంతో గ్రంథాలయ సెస్ఎక్కడికక్కడే పేరుకు పోతుంది. ఫలితంగా గ్రంథాలయాల అభివృద్ధి కుంటుపడుతోంది. కొత్త పుస్తకాలు కూడా కొనడానికి కుదరడం లేదు. 2007 సంవత్సరం నుంచి గ్రంథాలయాలకు కొత్త పుస్తకాలను కొనలేదు. 2021 వ సంవత్సరం మాత్రం కొత్త పుస్తకాల కొనుగోలుకు కోటి రూపాయలన్న ప్రభుత్వం విడుదల చేసింది. తర్వాత ఇప్పటివరకు కొత్త పుస్తకాలు ఊసే లేదు. 23 సంవత్సరాలుగా కొత్త పుస్తకాలను కొనుగోలు చేయకపోవడంతో ఉన్న పాత పుస్తకాలతోనే సర్దుబాటు చేయాల్సి వస్తుంది. గ్రంథాలయాలకు దినపత్రికలు, వార పత్రికలు, మాస పత్రికల బిల్లులను చెల్లించడం కూడా కష్టమైపోతుంది. జిల్లాలోని 71 గ్రంథాలయాలకు 116 మంది ఉద్యోగులను ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే 70 పైగా గ్రంథాలయ ఉద్యోగుల పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. చిత్తూరు, మదనపల్లి, తిరుపతిలో మాత్రమే గ్రంధాలయాలకు ఇంటర్నెట్ సౌకర్యం ఉంది. జిల్లాలో ఈనెల 14వ తారీఖు నుండి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభమవుతాయి. 14వ తారీఖున గ్రంథాలయ వారోత్సవాలను బాలల దినోత్సవం రోజున ప్రారంభిస్తారు. 15వ తేదీన పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేసి, మాదక ద్రవ్యాల పై అవగాహన కల్పించి, పుస్తక పఠనం ప్రాధాన్యతను వివరిస్తారు. 16వ తేదీన గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖులను స్మరించుకుంటారు. 17వ తేదీన కవి సమ్మేళనం జరగనుంది. 18 వ తేదీన సాహిత్య సదస్సు నిర్వహించనున్నారు. 19వ బాలికలకు డాన్స్ పోటీలను నిర్వహిస్తారు. 20వ తేదీ న విద్యార్థులకు డిజిటల్ గ్రంథాలయాలపై అవగాహన సాముహిక పఠనం గురించి తెలియజేస్తూ వారోత్సవాలను ముగించనున్నారు.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులు అవసరమైన పుస్తకాలు, పత్రికలు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల పాత పుస్తకాలు మాత్రమే ఉండగా, కొత్తవాటి కొనుగోలు నిధుల కొరత కారణంగా నెలల తరబడి వాయిదా పడుతోంది. పాఠకులు నేలపై కూర్చొని చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది. వీటిలో చాలా గ్రంథాలయాలకు కనీసం పత్రికలు వేయించడానికి కూడా ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు. గ్రంథాలయాల్లో పూర్తి స్థాయిలో వార్తాపత్రికలు, పక్ష, మాస పత్రికలు అందుబాటులో లేకపోవడంతో పాఠకులు నిరాశ చెందుతున్నారు. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర గ్రంథాలయం లేకపోవడం వల్ల మొత్తం వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. ప్రస్తుతం పౌర గ్రంథాలయాల కార్యాలయం మంగళగిరిలోని ఒక చిన్న శాఖా గ్రంథాలయంలో తాత్కాలికంగా నడుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టులను ప్రభుత్వం ఇప్పటివరకు భర్తీ చేయకపోవడం వల్ల, ఒక్కో లైబ్రేరియన్‌కి రెండు మూడు గ్రంథాలయాలను నడపాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంటి పన్నులో 8 శాతం గ్రంథాలయ సెస్ రూపంలో గ్రంథాలయాలకు చేరాల్సి ఉంది. కానీ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, స్థానిక సంస్థలు ఈ నిధులను జిల్లా గ్రంథాలయ సంస్థలకు చెల్లించకుండా మొండికేస్తున్నాయి. నిధుల కొరత, సిబ్బంది కొరతలతో గ్రంథాలయాలు మూతపడే పరిస్థితి ఏర్పడింది. కొన్ని చోట్ల లైబ్రేరియన్ల స్థానంలో స్వీపర్లు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారన్న వాస్తవం ఆందోళన కలిగిస్తోంది. సిబ్బంది జీతాలు ఆలస్యమవుతున్నాయి. పాఠకుల రాక తగ్గిపోవడంతో గ్రంథాలయాల ఆత్మ తగ్గిపోతోందని లైబ్రేరియన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం నుంచి ఈ నెల 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో గ్రంథాలయాలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించి, నిధులు కేటాయించాలని పాఠకులు, నిరుద్యోగులు, ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. పుస్తకాలతో నిండి ఉండాల్సిన దేవాలయాలు నేడు తాళం వేసిన గదుల్లా మారిపోయాయి. జ్ఞానం కోసం వచ్చే విద్యార్థులకు కనీస సదుపాయాలు లేకపోవడం రాష్ట్రానికి మచ్చ అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యికి పైగా ప్రభుత్వ గ్రంథాలయాలు నిధుల కొరతలో కూరుకుపోయాయి. లైబ్రరీ సెస్ రూపంలో వసూలు చేసిన నిధులు స్థానిక సంస్థలు ఇవ్వకపోవడం తీవ్ర సమస్యగా మారింది. ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయకపోవడంతో సిబ్బంది కొరత ఏర్పడింది. పుస్తకాలు, పత్రికలు అందుబాటులో లేక నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. గ్రంథాలయాల వారోత్సవాల సందర్భంగా ప్రభుత్వం దృష్టి సారించాలని పాఠకుల విజ్ఞప్తి చేస్తున్నారు.
జిల్లా కేంద్రంలో అద్దె భవనంలో గ్రంధాలయ సంస్థ
పేరుకు పోయిన రూ. 32 కోట్ల బకాయిలు
బకాయిలను చెల్లించని స్థానిక సంస్థలు
62 మంది ఉద్యోగుల పోస్టులు ఖాళి
23 సంవత్సరాలుగా కొత్త పుస్తకాల ఊసే లేదు
సమస్యల వలయంలోనే వారోత్సవాలు
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
విజ్ఞాన భాండాగారాలుగా చెప్పుకునే గ్రంథాలయాలునిధుల లేమితో నీరసిస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలు వీటి గురించి పట్టించుకోకపోవడంతో గ్రంథాలయాల నిర్వహణ గాడితప్పుతోంది. పక్కా భవనాలు లేక.. పాఠకులకు మౌలిక సౌకర్యాలు కల్పించలేక.. పుస్తకాలూ పూర్తిస్థాయిలో అందించలేక.. గ్రంథాలయాల అధికారులు సతమతం అవుతున్నారు. గ్రంథాలయాలను అభివృద్ధి చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి కరువైంది. వీటిని రాజకీయ పునరావాస కేంద్రలుగానే చూస్తోంది. చైర్మన్, సభ్యులను ప్రకటిస్తున్న ప్రభుత్వం గ్రంథాలయాల అభివృద్దికి పైసలు విదిలించడం లేదు. గ్రంథాలయాలకు ప్రధాన ఆదాయ వనరు అయిన స్థానిక సంస్థల సెస్సును ఆ సంస్థలు గ్రంథాలయాలకు చెల్లించడం లేదు. దీంతో గ్రంథాలయాల అభివృద్ధి పూర్తిగా పడకేసింది.
పో రై గంగ 1 అద్దె భవనంలోని చిత్తూరు గ్రంధాలయ సంస్థ
గంగ 2 గ్రంధాలయ వారోత్సవాల సందర్భంగా రచయిత్రి డా. రామలక్ష్మికి సన్మానం