వన్యప్రాణుల భయంతో వణికిపోతున్న ఐరాల మండలం
ఒకవైపు ఏనుగులు బరవైపు చిరుతపులుల దాడులు
మధ్యలో పంటలను నాశనం చేస్తుంటే అడవిపందులు
చీకటి పడితే ఇంటి నుంచి బయటికి రావడానికి భయపడుతున్న ప్రజలు
క్రమంగా తగ్గిపోతున్న పంటల సాగు విస్తీర్ణం
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ
చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని పల్లెలు గత కొన్ని నెలలుగా చిరుతలు, పులులు, ఏనుగులు, అడవి పందులు, కోతుల దాడులతో వణికిపతున్నాయి. వీటి సంఖ్య విపరీతంగా పెరిగి ప్రజల దినచర్యనే మారుస్తున్నాయి. రాత్రిపూట పొలాలకు వెళ్లాలన్న, పశువులను మేపడానికి తీసుకు వెళ్ళాలన్న హడలిపోతున్నారు. ప్రాణాలను అర చేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటు కాలం గడుపుతున్నారు. ఎప్పుడు ఎక్కడ ఏనుగులు దాడి చేస్తాయో, చిరుతపులులు మీద పడతాయోనని భయకంపితులు అవుతున్నారు. మనుషుల ప్రాణాలకు, పశువుల ప్రాణాలకు రక్షణ లేకపోవడంతో భయంతో చితికి పోతున్నారు. కొందరు పశువులను మేపడానికి బయటకు తీసుకెళ్లడానికి భయపడి, ఇళ్ల వద్దనే పోషిస్తున్నారు. మరోవైపు అడవి పందుల, కోతుల బాధ భరించలేక ఎక్కువ మంది రైతులు పంటలు వేయడమే మానుకుంటున్నారు.
ఐరాల మండలం పుత్రమద్ది, వడ్రంపల్లి, నాగంవాండ్లపల్లి గ్రామాల పరిసరాల్లో ఇటీవల జరిగిన వరస సంఘటనలతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. బుధవారం రాత్రి వడ్రంపల్లి పొలంలో రైతు కిషోర్ కుమార్ కు చెందిన దూడపై చిరుతదాడి జరగడం ద్వారా చుట్టుపక్కల గ్రామాలలో ఆందోళన నెలకొంది. బుధవారం రాత్రి పొలం వద్ద కట్టేసిన దూడ శరీరం రక్తసిక్తంగా, గొంతు భాగం కోరుక్కుని ఉండటం వంటి వివరాలు గ్రామస్తులను షాక్ చేయాయి. పుత్రమద్దిలో నెలకొన్న మరో సంఘటనలో, స్థానిక రైతు భాస్కర్ తన పాడి ఆవును రాత్రి సమీప అటవీ ప్రాంతంలో మేయానికి వదిలినప్పటికీ ఆవు ఇంటికి వచ్చి చేరలేదు. ఉదయం వెతికెత్తగా ఆవు తీవ్ర గాయాలతో మృతదేహంగా కనిపించింది. గొంతు భాగం కోరుక్కుని రక్తం తాగి, పొదుగు భాగాన్ని తినడంతో చిరుత పులి దాడిగా అటవీ శాఖ అధికారులు సైతం ధ్రువీకరించారు. గ్రామస్థుల కథనం మేరకు ఆవు మృతదేహానికి సమీపంలో పశువుల మాంసభాగాలు కనిపించాయని, మిగిలిన భాగాన్ని జంతువు అడవిలోకి లాగుకెళ్లినట్టు అనుమానాలు ఉన్నాయి. మరో వైపు ఐరాల సమీపంలోని నాగంవాండ్లపల్లి మామిడి తోటలో జూన్ 4న జరిగిన ఘర్షణలో ఏనుగు గుంపులు వచ్చి రాత్రి నిద్రిస్తున్న రైతు గణపతి యాదవ్ పై దాడి చేసి, కాళ్లతో తొక్కి చంపేశాయి. ఏనుగుల గుంపు తోటలు, లేత మొక్కజొన్న, చెరకు, అరటి వంటి పంటలను కాళ్లతో తొక్కి నాశనం చేస్తున్నాయి. పంటల విషయంలో ఏనుగుల దాడి కారణంగా భారీగా నష్టపోతున్నామని బాధితులు చెబుతున్నారు.
ఇదే సమయంలో అడవి పందుల సంఖ్యలో కూడా వృద్ధి కనిపిస్తోంది. చెరకు, వరి, వేరుశనగ, మిరప, మామిడి వంటి పంటలను రాత్రిపూట పందులు గుంపులు గుంపులుగా వచ్చి నాశనం చేస్తున్నాయి. పందుల గుంపుల సంచారం పెరగడంతో చాలా మంది రైతులు పంటలు వేయడానికి ముందుకు రావడం లేదు. ఇప్పటికే వేసిన పంటలను కాపాడుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. వీటికి తోడు అడవి సమీపంలో ఉన్న పొలాలకు కోతుల బెడద విపరీతంగా ఉంది. ఇవి కూడా గుంపులు గుంపులుగా పంట పొలాల మీద దాడులు చేసి నాశనం చేస్తున్నాయి. టపాకాయలను కాల్చుతూ కోతుల నుండి రక్షణ పొందడానికి రైతులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదైనా సంఘటన జరిగితే వెంటనే అటవీ శాఖ అధికారుల హడావిడి ఎక్కువగా ఉంటుంది. రేంజ్ స్థాయి అధికారిక పర్యటనలు జరిగి, కొన్ని టెక్నికల్ చర్యలు ప్రచారం కోసమే తాత్కాలికంగా చేపట్టినట్లుగా గ్రామస్తులు చెపుతున్నారు. అయితే శాశ్వత పరిష్కారానికి అవసరమైన ఫెన్సింగ్ వంటి చర్యలు చేపట్టడం లేదని తీవ్ర విమర్శలువస్తున్నాయి. పంటలు పండించాలంటే పందుల దాడి, పశువులు మేపాలంటే పులుల భయం, రాత్రి పొలాలకు వెళ్ళాలంటే ఏనుగుల భయం ఇలా మూడు వైపుల ముప్పులో బతుకుతున్నాం. చాలామంది పంటలు వేయడం మానేశారు. పిల్లలు రాత్రి బయటకి కూడా రావడం ఇబ్బందిగా మారిందని పుత్రమద్దికి చెందిన ఒక రైతు ఆవేదన వ్యక్తం చేశారు. వన్యప్రాణుల కారణంగా పశువులను హఠాత్తు కోల్పోవటం ద్వారా రైతులు నష్టపోతున్నారు వారికి అటవీ శాఖ వచ్చి సకాలంలో సరైన నష్టపరిహారం అందడం లేదు. బీమా సొమ్ము కూడా చేతికి రావడం లేదు. రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు. చెరకు, వరి, వేరుశనగ, మామిడి తోటల మీద దాడలు జరిగితే వాటిని పరిగణలోకి తీసుకోవడం లేదు. రైతులకు నష్టపరిహారం చెల్లించటం లేదు. దీంతో రైతులు భారీగా నష్టపోతున్నారు.
వన్యప్రాణుల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో అటవీ శాఖ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ లను ఏర్పాటు చేసి, తగు రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజల నివాస ప్రాంతాలకు పరిసరంగా ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని లేదా తగిన హై-మెష్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏనుగులు, పందులను నియంత్రించడానికి పంటల చుట్టూ బఫర్ జోన్‌ల ఏర్పాటు చేయడం వంటి పరిరక్షణ చర్యలు అమలు చేయాలని మనవి చేస్తున్నారు. పొలాల వద్ద రాత్రి రైతులు గస్తీ నిర్వహించడానికి బలమైన కార్పోరేటెడ్ లైటింగ్, సోనిక్ అలారం వంటి సౌకర్యాలు కలుగజేయాల్సిన అవసరం ఉంది. వన్యప్రాణుల చేత మృతి చెందిన పశువులకు తక్షణ పరిహారం పెంపు, బీమా క్లెయిమ్ ప్రాసెసింగ్ వేగవంతం చేయాలి. గ్రామాల్లో అడవీ జంతువుల ద్వారా కలిగే ప్రమాదాల గురించి పూర్తి అవగాహన కార్యక్రమాలు, పాఠశాల స్థాయిలో భద్రతా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. ఐరాల మండలంలో చిరుతలు, పులులు, ఏనుగులు, అడవి పందులు, కోతుల కారణంగా రైతులు పంటలు వేయాలంటేనే భయపడుతున్నారు. రైతులు తమ పంటలపై పెట్టుబడి తగ్గిస్తున్నారు. పశువులు కోల్పోతున్నారు. భయం భయంగా జీవనాన్ని గడుపుతున్నారు. శాశ్వత పరిష్కారాన్ని రూపొందించి అమలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం, అటవీ శాఖ వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే ప్రజలలో ఆభద్రతాభావము పెరిగే ప్రభావం ఉంది. ఫలితంగా గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి తగ్గి, ఆర్థిక మాంద్యం ఏర్పడే ప్రమాదం ఉంది.

