చిత్తూరు జిల్లాలో కుదేలు అవుతున్న ప్రజారోగ్యం
పీహెచ్‌సీలలో పరికరాలు, సిబ్బందిలేక నానా ఇబ్బంది
పీహెచ్‌సీల పరిస్థితి అత్యంత దయనీయం
డాక్టర్లు ఉండరు, అత్యసర మందులు అందవు
నిర్మాణాలు నత్తనడక, ప్రతిపాదనలు ఫైళ్లలోనే
ఆరోగ్యరంగానికి తక్షణ ఆపరేషన్అ వసరం
*చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.*
చిత్తూరు జిల్లా ప్రజారోగ్య రంగం ప్రస్తుతం తీవ్రమైన ఒత్తిడిలో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే లక్షలాది మంది ప్రజలకు మొదటి మెట్టు కాగా ఉండాల్సిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రస్తుతం తగిన భవనాలు, డాక్టర్లు, సిబ్బంది, అత్యవసర పరికరాలు, అంబులెన్స్ వాహనాలు లేక నామమాత్రంగా పనిచేస్తున్నాయి. జిల్లా మొత్తం మీద 50 పీహెచ్‌సీలు ఉన్నా, అందులో కేవలం 20 మాత్రమే 24 గంటల సేవలు అందించగలిగే స్థితిలో ఉన్నాయి. మిగతా 30 కేంద్రాల్లో రాత్రి వేళల్లో ఒక్క వైద్యుడు కూడా అందుబాటులో లేని సందర్భాలు తరచూ చోటుచేసుకుంటున్నాయి.
జిల్లాలోని 613 సబ్ సెంటర్లు కూడా సిబ్బంది కొరతతో సతమతమవుతున్నాయి. ఏఎన్ఎంలు, ఆరోగ్య కార్యకర్తలు లేకపోవడం వల్ల అనేక సబ్ సెంటర్లు కార్యకలాపాలు జరుగుతున్నట్టు మాత్రమే కనిపిస్తాయి. గ్రామీణ జనాభా కోసం మొదటి హెల్త్ పాయింట్‌గా ఉండాల్సిన ఈ కేంద్రాల్లో రోగులు చికిత్సకంటే ‘సమీక్ష’కు మాత్రమే వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో ఏడుకు పైగా సామాజిక ఆరోగ్య కేంద్రాలు, మూడు ఏరియా ఆసుపత్రులు, ఒక జిల్లా ఆసుపత్రి, వైద్య కళాశాలలో మూడు నవజాత శిశు సంరక్షణ కేంద్రాలు, పట్టణాల్లో 14 అర్బన్ హెల్త్ సెంటర్లు, రెండు రక్త నిధి కేంద్రాలు ఉండగా, సదుపాయాల కొరత, భవనాల దుస్థితి, సిబ్బంది లోటు మొత్తం జిల్లాను అలసటకు గురిచేస్తున్నాయి.
ఇక జిల్లా వైద్య ఆరోగ్య శాఖా ప్రధాన కార్యాలయం కూడా తక్షణ మరమ్మత్తులు కోరుకునే పరిస్థితిలో ఉంది. భవనం పాడైపోవడం, లిఫ్ట్ పనిచేయకపోవడం, ఆఫీసుకు అవసరమైన ఫర్నిచర్, కంప్యూటర్లు, ఏసీలు సరిపోకపోవడం శాఖ పనితీరును ప్రభావితం చేస్తున్నాయి. ఫీల్డ్ స్థాయికి మందులు, మెటీరియల్స్ తరలించడానికి వాహనాలు లేని పరిస్థితి వల్ల ప్రతీ నెల పంపిణీ కార్యక్రమాలు ఆలస్యం అవుతున్నాయి. జిల్లాలోని అనేక కేంద్రాలు కొత్త భవనాల కోసం ఎదురు చూస్తుండగా, కొన్నింటి నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. కాజూరు పట్టణ ఆరోగ్య కేంద్రం శిథిలావస్థలో ఉండి కొత్త భవనం కోసం సంవత్సరాలుగా వేచి చూస్తోంది. కుప్పం నియోజకవర్గంలోని గుడికొత్త పీహెచ్‌సీకి భవనం కోసం ప్రభుత్వ ఆమోదం రావడం లేదు. తమతమూరు పట్టణ ఆరోగ్య కేంద్రం, పుంగనూరు లబ్ధిగా, పూతలపట్టు గాజులపల్లి వంటి కేంద్రాలకు కూడా ప్రభుత్వం నుండి నిర్మాణ నిధులు ఇంకా అందలేదు. నగిరి నియోజకవర్గంలోని కార్వేటినగరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ భవన నిర్మాణం చాలాకాలంగా సాగుతూనే ఉంది. ఉన్న భవనం బలహీనంగా మారడంతో రోగులు, సిబ్బంది ప్రతిరోజూ భయంతో పనిచేయాల్సి వస్తోంది. పెనుమూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ భవనం కూడా నిర్మాణ దశలోనే ఉండి పనులు నత్తనడకగా సాగుతున్నాయి. ఒక దశలో పనులు పూర్తయ్యేవి అన్న ఆశ కలిగించినప్పటికీ, ఇప్పుడు అక్కడి నిర్మాణం కూడా దాదాపు ఆగిపోయినట్లే కనిపిస్తోంది. గుడిపాల పీహెచ్‌సీని 30 పడకల కమ్యూనిటీ హెల్త్ ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయాలని పంపిన ప్రతిపాదనలు ఇప్పటికీ ఆమోదం పొందలేదు. ఇదే పరిస్థితి విజయపురం పీహెచ్‌సీ విషయంలోనూ ఉంది. 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌గా మలచాలని ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలు ఇంకా ఫైళ్లలోనే చిక్కుకుని ఉన్నాయి. ఈవన్నీ కలిపి చూస్తే, జిల్లాలోని గ్రామీణ ఆరోగ్య సదుపాయాల అభివృద్ధి పనులు చాలా ప్రాంతాల్లో పేపర్ వర్క్ స్థాయిలోనే ఆగిపోయాయి.
జిల్లాలో అత్యంత ఆందోళనకర విషయం, అత్యవసర మందుల కొరత. అనేక పీహెచ్‌సీల్లో సీజనల్ వ్యాధులు పీడిస్తే కూడా పారాసెటమాల్, యాంటీ బయాటిక్స్, జ్వరం మందులు, ఇన్‌ఫెక్షన్ చికిత్స కోసం అవసరమైన డ్రిప్‌లు అందుబాటులో లేని సందర్భాలు తరచూ దర్శనమిస్తున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ల్యాబ్ టెస్టింగ్ సదుపాయాలు కూడా చాలా చోట్ల లేకపోవడంతో, రోగులు చిన్నపాటి పరీక్షలకైనా ప్రైవేట్ ల్యాబ్‌ల దగ్గరకు వెళ్లాల్సిన పరిస్థితి. పరికరాల కొరత కూడా తీవ్రంగా ఉంది. మలేరియా, డెంగ్యూ పరీక్షలు చేయడానికి అవసరమైన కిట్‌లు, రక్తపోటు, షుగర్ పరికరాలు, శిశు విభాగానికి అవసరమైన ఫోటోథెరపీ యూనిట్లు, న్యూబోర్న్ రెసుసిటేషన్ పరికరాలు చాలా పీహెచ్‌సీల్లో లేవు. ఈ పరిస్థితుల్లో పీరీఫెరల్ హెల్త్ సిబ్బంది చేతులెత్తేశారు. జిల్లాలో పీహెచ్‌సీలకు ఒక్క చోటా సొంత అంబులెన్స్ లేకపోవడం ప్రజలకు పెద్ద ఇబ్బంది. రాత్రివేళ అత్యవసర పరిస్థితి వస్తే రోగిని తరలించడం ఒక పెద్ద సమస్య. ప్రైవేట్ వాహనాలు లేదా ఆటో రిక్షాలు తీసుకుని వెళ్లే పరిస్థితి అనేక ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతోంది.
సిబ్బంది ఖాళీలు. వైద్యులు, సిబ్బంది, నర్సులు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు ఏ విభాగం చూసినా ఖాళీలు ఎక్కువ. కొన్నిచోట్ల ఒక వైద్యుడు మొత్తం మండలాన్ని చూసే పరిస్థితి కూడా ఏర్పడుతోంది. ఒత్తిడిలో పనిచేస్తున్న సిబ్బంది తమవంతు సేవ చేస్తున్నప్పటికీ, అవసరాలకు ఇది చాలా తక్కువ. ఈ సమస్యలు ఇలా ఒకదానికొకటి పైగా పేరుకుపోవడంతో, మొత్తం జిల్లాలో ప్రజారోగ్య వ్యవస్థ శ్వాస తీసుకునే స్థితి కోల్పోయే పరిస్థితి వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో చికిత్స సేవల కోసం ప్రభుత్వంపై ఆధారపడే పేద కుటుంబాలకు ఇది పెద్ద భారంగా మారుతోంది. ప్రైవేట్ ఆసుపత్రుల వైపు వెళ్లే అవకాశం కూడా చాలామందికి ఉండదు. భవనాలు, సిబ్బంది, మందులు, పరికరాలు అన్నీ తక్షణమే అందుబాటులోకి తేవాలని చిత్తూరు జిల్లా ఆరోగ్య శాఖలోని ఈ పరిస్థితిని చూసిన ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఆరోగ్య సంఘాలు అంటున్నారు. జిల్లో ప్రజారోగ్యం తిరిగి గాడిన పడాలంటే సమగ్ర ప్రణాళిక, తక్షణ నిధులు, నిర్మాణాల వేగవంతం, ఖాళీ పోస్టుల భర్తీ అత్యవసరం. లేకపోతే ప్రజల ఆరోగ్యం ప్రమాదంలోనే ఉంటుంది.

