పార్లమెంటరీ అధ్యక్షుని నియామకం ఎప్పుడో..
శాసనసభ్యుల మధ్య కుదరని ఏకాభిప్రాయం
అధ్యక్ష పదవికి శాసనసభ్యులు విముఖత
కుల సమీకరణాలపై అధిష్టానం దృష్టి
అధ్యక్ష రేసులో బలిజ, దళిత నేతలు
కొత్త జిల్లాల ఏర్పాటు వరకు వేచిచూసే అవకాశం
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
సహజంగా మే నెల చివరిలో మహానాడు ముగిసిన పదిహేను రోజులు లేదా నెల లోపల మండల, రాష్ట్ర, జాతీయ కమిటీలు ఏర్పాటు చేయడం అనవాయితీ. అయితే ఈ సారి ఇప్పటి వరకు కమిటీల ఏర్పాటు జరగలేదు. కర్ణుడి చావుకు అనేక కారణాలు అన్నట్టు కమిటీలు ఏర్పాటుకాక పోవడానికి పలు కారణాలు ఉన్నాయి అంటున్నారు. కొందరు ఎమ్మెల్యేలు ఏక పక్షంగా బూత్, క్లస్టర్, మండల కమిటీలకు పేర్లు ఇచ్చారు. పరిశీలకులు సమావేశాలు పెట్టి ఇద్దరు ముగ్గురి పేర్లు ప్రతిపాదించినా, ఎమ్మెల్యేలు తాము సూచించిన వారికే పదవులు ఇవ్వాలని పట్టుపడుతున్నారు. చాలా చోట్ల ఎమ్మెల్యే చూచించన పేర్లలో కొందరికి ఐవీఆర్ఎస్ సర్వేలో ప్రతికూల ఫలితాలు వచ్చాయి. కొన్ని చోట్ల ఒక్కొక్క పేరుకే ఐవీఆర్ఎస్ సర్వే చేయగా మెజారిటీ కార్యకర్తలు రిజెక్ట్ చేశారు. దీనితో అధిష్టానం సందిగ్ధంలో పడింది. కొన్ని నియోజక వర్గాలలో వర్గ పోరు తీవ్రం కావడంతో అవరోధం ఏర్పడినట్టు సమాచారం. కొన్ని కోట్ల కుల, వర్గ సమీకరణలు కుదరకపోవడంతో నిర్ణయం ఆలస్యం అవుతోంది. కాగా పార్లమెంటు కమిటీ ఏర్పాటులోను కొన్ని సమస్యలు తలెత్తినట్టు తెలిసింది. ఇప్పటి వరకు పార్లమెంటు నియోజక వర్గం జిల్లా పరిధి ఒకే విధంగా ఉండేది. నాలుగైదు జిల్లాలలో ఒకటి రెండు నియోజక వర్గాలలో తేడాలు ఉండేవి. చిత్తూరు పార్లమెంట్ నియోజక వర్గానికి చెందిన చంద్రగిరి తిరుపతి జిల్లాలో ఉంది. రాజంపేట పార్లమెంటు నియోజక వర్గంలోని పుంగనూరు చిత్తూరులో కలిపారు. అయితే ప్రభుత్వం తల పెట్టిన కొత్త జిల్లాల ఏర్పాటు జరిగితే పుంగనూరు మదనపల్లె జిల్లాలో, చంద్రగిరితో పాటునగరి తిరుపతి జిల్లాలో కలుస్తాయి. ప్రస్తుతం పార్లమెంటు ( జిల్లా) అధ్యక్ష పదవి కోసం ఇద్దరి పేర్లు ఐవీఆర్ఎస్ సర్వే చేశారు. అందులో సి అర్ రాజన్ (చంద్రగిరి), షణ్ముఘ రెడ్డి ( నగరి) తిరుపతి జిల్లాలో చేరనున్నాయి. ఈ నేపద్యంలో వారిలో ఒకరికి పదవి ఇస్తే విధుల నిర్వహణ కష్టం అవుతుంది. రాష్ట్రంలో దాదాపు సగం జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నది. బలిజ, దళిత నేతలు పార్లమెంటరీ అధ్యక్ష పదవికి ఆసక్తి చూపుతున్న, జిల్లాలోని శాసనసభ్యులు ఎవరు వారిని ప్రతిపాదించలేదు. జిల్లాలోని శాసనసభ్యులు ఎవరు పార్లమెంటరీ అధ్యక్ష పదవిని స్వీకరించడానికి సుముఖంగా లేరు. ఒకే సామాజిక వర్గానికి చెందిన ముగ్గురి పేర్లు శాసనసభ్యులు ప్రతిపాదించారు. ఆ సామాజిక వర్గానికి చెందిన శాసనసభ్యులకే గత ఎన్నికలలో టికెట్లు లభించాయి. మళ్లీ అదే సామాజిక వర్గానికి పార్లమెంటరీ అధ్యక్ష పదవి ఎలా కట్టబెడతారన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. శాసనసభ్యులు ప్రతిపాదించిన అభ్యర్థులలో ఒక అభ్యర్థి గత ఎన్నికల నుంచి అంత క్రియాశీలకంగా కనిపించడం లేదు. శాసనసభ టిక్కెట్లన్నీ కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వడంతో పార్లమెంటరీ అధ్యక్ష పదవి బలిజ సామాజిక వర్గానికి ఇవ్వాలని ఒక వర్గం పట్టుపడుతోంది. ప్రస్తుతం బీసీ అభ్యర్థి పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నందున, ఇప్పటివరకు అవకాశం ఇవ్వని దళిత సామాజిక వర్గానికి ఒకసారి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఎవరికి అధ్యక్ష పదవి కట్టబెట్టిన జిల్లాను, శాసనసభ్యులను ఏకతాటి మీద తీసుకొచ్చి అవకాశాలు కనిపించడం లేదు.
దీనివల్ల చంద్రబాబు పునరాలోచనలో పడినట్టు సమాచారం. వీటి వల్ల రాష్ట్ర, జాతీయ కమిటీల ఏర్పాటు ఆలస్యం అవుతోందని తెలిసింది. అయితే రాష్ట్ర, జాతీయ కమిటీలను వారంలో ఏర్పాటు చేసి మిగిలిన కమిటీలను డిసెంబర్ మొదటి వారం లోపల పూర్తి చేయడానికి కసరత్తు జరుగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.

