చిత్తూరు జిల్లాను కదిలిస్తున్న పెద్దిరెడ్డి భూమి వివాదం
పెద్దిరెడ్డి కేసులలో దూకుడు పెంచిన కూటమి ప్రభుత్వం
ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్
అక్రమాలు అన్నింటిని వెలికి వేయడానికి ప్రణాళిక
పెద్దిరెడ్డికి సహకరించిన అధికారులపై కూడా చర్యలు
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి, పుంగనూరు వైఎస్సార్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూమి అక్రమాల వ్యవహారం కీలక దశకు చేరింది. కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత అత్యంత దూకుడుతో ముందుకు సాగుతున్న ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి సారించడం కేసు మలుపుతిప్పింది. పలమనేరు ప్రాంత పర్యటన సందర్భంగా హెలికాప్టర్ నుంచి స్వయంగా తీసిన దృశ్యాలు, మంగళంపేట అటవీ ప్రాంతంలో భారీ స్థాయిలో జరిగిన ఆక్రమణలు వెలుగులోకి రాగానే, ప్రభుత్వ విభాగాలు అపూర్వ వేగంతో చర్యల వైపు అడుగులు వేశాయి. పెద్దిరెడ్డి కి సంబంధించిన అన్ని కేసులను నిగ్గు తేల్చాలని కోటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి అక్రమాలకు సహకరించిన అధికారులను గురించి కూడా ఆరా తీస్తున్నారు. వారి మీద కూడా చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
మంగళంపేట అటవీ భూముల ఆక్రమణ కేసు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ చలపతిరావు మీడియా సమావేశంలో వెల్లడించిన వివరాలు మరింత సంచలనం రేపాయి. మదర్ రికార్డుల ప్రకారం 1968 గెజిట్‌లో 75.74 ఎకరాల అటవీ భూములకు మాత్రమే పట్టాలు ఉన్నప్పటికీ, అదనంగా 32.63 ఎకరాలను కూడా కంచె వేసి కలుపుకున్నారని అధికారులు తెలిపారు. ఇలాంటి భారీ ఎత్తున అటవీ భూములను చట్ట విరుద్ధంగా స్వాధీనం చేసుకుని ఉద్యాన పంటలు వేసి ఆదాయం పొందడం, బోర్ వెల్‌లు తవ్వడం, అటవీ వనరులను దుర్వినియోగం చేయడం వంటి అంశాలు కేసులో ప్రధాన ఆరోపణలుగా నమోదయ్యాయి. మొత్తం మీద రూ.1.26 కోట్ల విలువైన అటవీ సంపదకు నష్టం కలిగిందని అటవీశాఖ స్పష్టంచేసింది. ఈ ప్రాథమిక విచారణ అనంతరం పులిచెర్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయగా, ఎంపి మిథున్‌రెడ్డిని ఎ1గా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎ2గా, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డిని ఎ3గా, పెద్దిరెడ్డి ఇందిరమ్మను ఎ4గా కేసులో చేర్చారు. అధికారుల మద్దతుతో రికార్డులను తారుమారు చేసిన విషయంలో కూడా అనుమానాలు వ్యక్తమవడంతో, ఈ వ్యవహారంపై ప్రత్యేక విచారణ కమిటీ పనిచేస్తోంది. అయితే ఇది ఒక్క కేసే కాదు. గతంలో పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించిన భూముల మొత్తం చరిత్రను ప్రభుత్వం ఇప్పుడు వెలికితీస్తోంది. జనసేన నేతలు తిరుపతిలో పెద్దిరెడ్డి నివాస భవనం మరియు ఆయనకు సంబంధించిన స్థలాలపై చేసిన ఆందోళనలను కూడా ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తోంది. మదనపల్లె రెవిన్యూ డివిజన్‌లో ఉన్న భారీ ఎకరాల భూములు, వాటిపై ఉన్న అనుమానాస్పద కబ్జాలు, రెవెన్యూ ఫైళ్లు తగులబెట్టిన కేసులో పెద్దిరెడ్డి ప్రమేయం ఉన్నట్టుగా వచ్చిన ఆరోపణలు దర్యాప్తు సంస్థల దృష్టిలో ఉన్నాయి. పెద్దిరెడ్డి కుటుంబం అక్రమంగా స్వాధీనం చేసుకున్న భూములు ఎక్కడున్నాయో, ఎవరు సహకరించారో, ఏ రికార్డులు మార్చారో అన్నింటిని సవివరంగా పరిశీలించాలని చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సంబంధిత కేసుల్లో అధికారుల పాత్ర ఉన్నట్లయితే వారిపైనా చర్యలు తప్పదని స్పష్టం చేశారు. అటవీ భూముల పూర్తి సర్వేని పూర్తి చేసి వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచాలని పవన్ కల్యాణ్ ఆదేశించడంతో, ఈ వ్యవహారంలో పారదర్శకతకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. అదే సమయంలో కేంద్ర సంస్థల దృష్టికి వెళ్లిన లిక్కర్ స్కాంలో కూడా మిథున్‌రెడ్డి ఇప్పటికే నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో పెద్దిరెడ్డి కుటుంబం చుట్టూ చట్టపరమైన ఉచ్చు మరింత బిగుస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చిత్తూరు జిల్లా ప్రజలు, ముఖ్యంగా మంగళంపేట పరిసర గ్రామాల ప్రజలు ఎన్నేళ్లుగా ఈ భూములపై జరుగుతున్న అన్యాయాలను అధికారులకు తెలియజేస్తూ ఉన్నప్పటికీ స్పందన రానప్పటికి ఇప్పుడు ప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి
పెద్దిరెడ్డి కుటుంబంపై భూమి అక్రమాలు, రికార్డు మార్పిడి, అటవీ ఆక్రమణ, లిక్కర్ వ్యవహారాలు… అన్నింటినీ నిగ్గుతేల్చడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ కేసుల దర్యాప్తు ఎలాంటి రాజకీయ భూకంపాలకు దారితీస్తుందో రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిగా గమనిస్తున్నారు.

