15, నవంబర్ 2025, శనివారం

చక్రవర్తుల బియ్యం – ఆరోగ్యానికి వరం

నిషిద్ధ బియ్యం కాలాబాటి 
అల్లుడు బియ్యం మాప్పిళ్లై సాంబ 

 చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.


చక్రవర్తుల బియ్యం అనేది నల్ల బియ్యాన్ని (బ్లాక్ రైస్) సూచిస్తుంది, దీనిని పూర్వ కాలంలో చక్రవర్తులు, వారి కుటుంబ సభ్యులు మాత్రమే తినేవారని నమ్ముతారు. అందుకే దీనికి చక్రవర్తుల బియ్యం అని పేరు వచ్చింది. నల్ల బియ్యంలో, ముఖ్యంగా ఆంథోసైనిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉండటం వల్ల దీనికి నలుపు రంగు వస్తుంది. నల్ల బియ్యం, ముఖ్యంగా చైనాలో, పూర్వ కాలంలో చక్రవర్తులకు మాత్రమే పరిమితం చేయబడింది. ఈ కారణంగానే దీనిని నిషిద్ధ బియ్యం లేదా చక్రవర్తుల బియ్యం అని అంటారు.  తెల్ల బియ్యంతో పోలిస్తే నల్ల బియ్యంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. దీనిలో ఉండే ఆంథోసైనిన్ అనే వర్ణద్రవ్యం వల్ల దీనికి నలుపు రంగు వస్తుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.  ఒకప్పుడు చక్రవర్తులకు మాత్రమే పరిమితమైన ఈ బియ్యం, ఇప్పుడు మార్కెట్లో సులభంగా లభిస్తుంది. ప్రతి ఒక్కరూ తినగలిగే ఒక సూపర్ ఫుడ్ గా మారింది. దీనిని  నల్ల బియ్యాన్ని, తమిళంలో కరుప్పు కవుని లేదా కాలాబాటి బియ్యం అని కూడా పిలుస్తారు. అలాంటి ఒక అరుదైన దేశీయ వరి వంగడాలను చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన అభ్యుదయ రైతు చందూల్ కుమార్ రెడ్డి పండించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. 




ప్రాచీన భారతీయ ఆహార సంస్కృతిలో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న దేశీయ వరి రకాలలో కాలాబాటి అనే కళావతి,  మాప్పిళ్లై సాంబ బియ్యాలు మళ్లీ రైతుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు, పూర్వకాల చరిత్ర, సహజ సాగు విధానాలు కారణంగా ఈ రెండు పంటలు రాష్ట్రంలోని కొంతమంది సేంద్రియ రైతుల తోటల్లో తిరిగి మొలకెత్తుతున్నాయి. ఈశాన్య భారతదేశంలో పండే కాలాబాటి నలుపు రంగు బియ్యం దక్షిణ భారతదేశంలోని పల్లవులు, చోళులు వంటి రాజవంశీయుల ఆహారంగా ప్రఖ్యాతి పొందింది. సామాన్య ప్రజలకు దీని వినియోగం నిషేధితమైందని చరిత్ర చెబుతోంది. అందుకే దీన్ని ఫర్బిడెన్ రైస్ లేదా నిషిద్ధ బియ్యం అని పిలుస్తారు. చైనాలోనూ ఇప్పటికీ ఈ పేరుతోనే ప్రసిద్ధి చెందింది. ఈ బియ్యంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో పాటు లో గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండడం దీని ప్రత్యేకత. ఇది మధుమేహం, రక్తపోటు ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. యాంతోసైనిన్ అనే ఔషధ గుణం ఉండటంతో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ఎదుర్కొనే శక్తినిస్తుంది. అలాగే విటమిన్ బి6, బి12 సమృద్ధిగా ఉండడం వల్ల ఇది శాకాహారులకు పౌష్టికమైన ఆహారం. చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ తీసుకోవచ్చు. కాలాబాటి ప్రధానంగా ఖరీఫ్ సీజన్ పంట. వర్షాకాలంలో ఐదు అడుగుల ఎత్తు వరకు పెరిగి సుమారు 150 రోజుల పంటకాలంలో 15 నుంచి 18 క్వింటాళ్ల వరకు దిగుబడి ఇస్తుంది. మెట్టభూమి, మద్యస్థ భూముల్లో బాగా పండుతుంది. లోతట్టు ప్రాంతాల్లో పండిస్తే పంట ఒరిగిపోతుంది కాబట్టి తగదు. పూర్తిగా సహజ ఎరువులతోనే సాగు చేయాలి. పశువుల ఎరువు, జీవామృతం ఉపయోగించడం సరిపోతుంది. ఎలాంటి రసాయన ఎరువులు అవసరం లేదు. తమిళనాడులో ఒకప్పుడు విస్తృతంగా సాగుచేసిన మాప్పిళ్లై సాంబ అనే అల్లుడు బియ్యంకు ప్రాచీన కాలం నుంచే ప్రత్యేకత ఉంది. కొత్తగా వివాహమైన వధూవరులకు ఈ బియ్యాన్ని తినిపిస్తే పుట్టబోయే పిల్లలు బలంగా, ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం ఉండేది. పల్లవులు, చోళుల కాలంలో దేవాలయాల నిర్మాణంలో పనిచేసిన కూలీలకు ఈ బియ్యాన్ని వండి పెట్టేవారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.ఈ బియ్యంలో లైకోపిన్, బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీర్యపుష్టి, దాతుపుష్టి, కండపుష్టిని పెంచే గుణాలు ఉన్నందున లైంగిక సామర్థ్యాన్ని పెంచే సహజ ఔషధ ఆహారంగా భావిస్తారు. మధుమేహం నియంత్రణకు, రక్త శుద్ధికి, సంతానలేమి నివారణకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.ఈ పంట కూడా ఫొటోసెంథసిస్ వెరైటీ కాబట్టి వర్షాకాలం (ఆగస్టు–సెప్టెంబర్)లోనే బాగా పండుతుంది. 210 రోజుల పంటకాలం కలిగి, ఆరు నుంచి ఎనిమిది అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. మెట్టభూముల్లో సాగుకు అనుకూలం. నాట్లు వేసే సమయంలో మొక్కల మధ్య కనీసం ఒకటిన్నర నుండి రెండు అడుగుల దూరం ఉండేలా చూడాలి. ఎకరాకు నాలుగు నుంచి ఆరు టన్నుల వరకు వరిగడ్డి వస్తుంది. ధాన్యం దిగుబడి సగటున 15 నుండి 20 క్వింటాళ్లు. ప్రస్తుతం రసాయన రహిత వ్యవసాయానికి ప్రాధాన్యం పెరుగుతుండటంతో రైతులు ఈ సాంప్రదాయ బియ్యాల వైపు మళ్లుతున్నారు. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో కొంతమంది రైతులు సేంద్రియ పద్ధతిలో ఈ రకాల పంటలను పండిస్తూ మంచి ఫలితాలు పొందుతున్నారు. కాలాబాటి, మాప్పిళ్లై సాంబ వంటి సాంప్రదాయ వరి రకాల పెంపకం ద్వారా ఆరోగ్యకరమైన ఆహారం అందించడమే కాకుండా మన పూర్వీకుల వారసత్వాన్ని కాపాడవచ్చని  సేంద్రియ వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *