చిత్తూరు జిల్లా వణికిస్తున్న ద్విత్వా ప్రభావం
ఒక్కసారిగా 6 నుండి 7 డిగ్రీలు పడిపోయిన ఉష్ణోగ్రతలు
ఈదురు గాలులతో స్తంభించిన జనజీవనం
ఇళ్లకే పరిమితమైన ప్రజలు, వెలవెల పోతున్న బజార్లు
చిత్తూరు, బ్యూరో ఆంధ్రప్రభ.
ద్విత్వా తుఫాన్ ప్రభావం చిత్తూరు జిల్లాలో తీవ్రంగా కనిపిస్తోంది. శనివారం ఉదయం నుండి ఎక్కడక్కడా వర్షాలు పడుతూ, ఆకాశం మేఘావృతమై, చలి గాలులు బలంగా వీచడంతో వాతావరణం పూర్తిగా మారిపోయింది. రెండు రోజులుగా సూర్యకాంతి భూమి మీద పడకపోవడంతో చలి మరింత పెరిగి, జిల్లావాసులు వణుకుతున్నారు. సాధారణంగా నవంబర్‌లో చిత్తూరులో 28–29°సెంటిగ్రేడ్ వరకు ఉండే ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా 22° సెంటిగడ్ కు పడిపోయాయి. జిల్లా వ్ప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గడంతో ఈదురు, చలిగాలులు వీస్తున్నాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు మరింత తగ్గి 19–20°సెంటీగ్రేడ్ కు పడిపోయి, గాలులు బలంగా వీచడంతో ఇంట్లోనూ చలి బాగా అనిపిస్తోంది.
వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించినట్లుగా ద్విత్వా తుఫాన్ ప్రభావం కారణంగా చిత్తూరు, పలమనేరు, మదనపల్లె, నగరి ప్రాంతాల్లో భారీవాన నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. అదే భయంతో ప్రజలు ఉదయం నుంచే బయటికి రావడానికి వెనుకంజ వేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలని వైద్యులు, అధికారులు సూచించడం ప్రజలు మరింత జాగ్రత్తగా ఉంటున్నారు. ప్రతి ఇంట్లోనూ చలి నివారణ చర్యలు మొదలయ్యాయి. ఉతికిన బట్టలు ఆరకపోవడంతో, ఇళ్లన్నీ తడిగా ఉండటంతో చలి తీవ్రత రెట్టింపు అయింది. చిత్తూరు పట్టణంలో సాధారణంగా వారాంతాల్లో కనిపించే రద్దీ ఈరోజు పూర్తిగా కనిపించలేదు. కొత్త బస్టాండ్ రోడ్ నుంచి పున్నెమ్మ గుడి వరకు, అరటిపండ్ల మార్కెట్లో, కోర్టు నుంచి గాంధీ రోడ్డు విగ్రహం వరకు, బజారు వీధి, చర్చి వీధి ఎక్కడ చూసినా జనసంచారం చాలా తక్కువ కనిపించింది. దుకాణాలు తెరసినా, కస్టమర్లు లేక అమ్మకాలు పడిపోయాయి. ఈ రోజే అమ్మకాలు పడిపోయాయి, రేపు భారీ వర్షాలు అని అంటున్నారు. ఈ నేపథ్యంలో మా వ్యాపారం ఏం అవుతుందో భయంగా ఉంది అని దుకాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పండ్లు, కూరగాయలు తెచ్చుకున్న చిన్న వ్యాపారుల పరిస్థితి మరింత క్లిష్టం అయ్యింది. గాలి, చలివానతో రోడ్డుపై ఒక గంట కూడా నిలబడలేని పరిస్థితి. వానలో తడిచిన సరుకు అమ్మకానికి కూడా పనికి రాకపోవడంతో వారు నష్టపోతున్నట్టు తెలిపారు.
గ్రామాల్లో పరిస్థితి మరింత విభిన్నంగా ఉంది. వరుసగా పడుతున్న వానలు వ్యవసాయ పనులను పూర్తిగా అడ్డుకున్నాయి. కొంతమంది రైతులు కోత దశకు చేరుకున్న కూరగాయల పంటలతో ఆందోళన చెందుతున్నారు. కూర కాయలు, ఆకుకూరలు, జామ వంటి పండ్లు, పూల పంటలు నష్టపోయే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ముఖ్యంగా పలమనేరు నుండి కుప్పం వరకు కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు విరివిగా పండిస్తారు. ఈ చలి, వానల ప్రభావం రైతులను ఆందోళనకు గురిచేసింది. చిన్న తప్పు జరిగితే పంట మొత్తం నేలకేసి పోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా చలిగాలులు మరింత బలంగా వీచడం ప్రజలను బయటికి రానీయడం లేదు. ఉదయం నుంచే గ్రామాల్లో చాలామంది దుప్పట్లు, స్వెటర్లు వేసుకుని ఇంట్లోనే ఉండిపోతున్నారు. బస్సుల రాకపోకలు కూడా నెమ్మదించడంతో ప్రయాణీకులు ఇబ్బంది పడ్డారు. కొన్ని ఆర్టీసీ బస్సులు ఆలస్యంగా బయలుదేరగా, కొన్నింటిని ప్రయాణికులు లేకపోవడంతో నిలిపివేశారు. బలమైన గాలి, వానలతో విద్యుత్ అంతరాయం కొన్ని ప్రాంతాల్లో కనిపించింది. పలుచోట్ల విద్యుత్ సిబ్బంది వెంటనే చర్యలు తీసుకున్నప్పటికీ, కొన్ని గ్రామాల్లో విద్యుత్ సాయంత్రం వరకూ రాలేదు.
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తక్కువ ప్రాంతాలు, బీడుప్రాంతాలు, వాగు, వంకల పక్కన ఉన్న గ్రామాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అధికారులు గ్రామస్థాయిలో సిబ్బందిని అప్రమత్తం చేశారు. అవసరమైతే తుఫాన్ హెచ్చరికలు జారీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని కలెక్టరేట్ వర్గాలు వెల్లడించాయి. మునిసిపల్ సిబ్బందిని కూడా చెరువులతో కూడిన ప్రాంతాల్లో నిఘా పెట్టాలని ఆదేశించారు. నగరంలోని ముఖ్యమైన జంక్షన్‌ల వద్ద ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు డ్యూటీలో ఉన్నారు. చలిగాలులు, వర్షాలు, ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడం వల్ల జిల్లాలోని జీవన శైలి పూర్తిగా మారిపోయింది. పాఠశాల విద్యార్థులు ఉదయం స్కూళ్లకు రావడంలో ఇబ్బంది పడుతున్నారు. కొన్ని స్కూళ్లు మొదటి గంటను రద్దు చేశాయి. ఆటో డ్రైవర్లు, కూలీలు పనిచేయడానికి బయటికి రావడంలో సంకోచిస్తున్నారు. ఆఫీసులకు వెళ్లే సిబ్బంది రైన్‌కోట్లు, స్వెటర్లు, దుప్పట్లు వేసుకుని ప్రయాణం చేస్తున్నారు.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, ఈ పరిస్థితి మరో రెండు రోజులు కొనసాగవచ్చని చెబుతోంది. ద్విత్వా తుఫాన్ తీర ప్రాంతాలకు దగ్గరగా ఉన్నప్పటికీ, దాని ప్రభావం చిత్తూరు జిల్లా మీద కూడా స్పష్టంగా కనిపిస్తుందని నిపుణులు తెలిపారు. గాలుల వేగం పెరిగే అవకాశం కూడా ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అత్యవసర పనులు తప్ప బయటికి రాకూడదని, వర్షాలు, గాలుల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తున్నారు. ద్విత్వా ప్రభావం తగ్గే వరకూ చిత్తూరు జిల్లా చలిగాలులతో విలవిల్లాడే అవకాశం కనిపిస్తున్నప్పుడు, ప్రజలు ఒక్కరితో ఒకరు జాగ్రత్తలను పంచుకుంటూ, తమ ఇళ్లలో రక్షణ చర్యలు తీసుకుంటూ వాతావరణం చల్లబడిన దాకా ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది.

