21, నవంబర్ 2025, శుక్రవారం

జిల్లాలో పార్టీ పటిష్టతకు చంద్రబాబు వ్యూహం

 
వివిధ వర్గాల ద్వారా సమాచారం తెప్పించుకున్న చంద్రబాబు
తిరుపతిలో రెండు రోజులు మకాం పెట్టిన వర్ల రామయ్య 
జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో సంప్రదింపులు 
విభేదాలను రూపుమాపి ఐక్యతకు సన్నాహాలు
స్థానిక ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ప్రణాళిక


చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ

ముఖ్యమంత్రి టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో పట్టుకోసం ప్రయత్నాలు ప్రారంభించినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. కొత్త జిల్లాలు ఏర్పడినా, ఉమ్మడి చిత్తూరు జిల్లాను ఒక యూనిట్ గా చంద్రబాబు భావిస్తున్నారు. ఒకవైపు నామినేటెడ్ పదవుల విషయంలో పార్టీ కేడర్ లో అసంతృప్తి వ్యక్తం అవుతుంది. మరోవైపు నియోజకవర్గ ఇన్చార్జి లకు స్థానిక నాయకుల మధ్య విభేదాలు బహిర్గతం అవుతున్నాయి. అసంతృప్తులు ఉన్న బహిర్గతము కాకుండా అధిష్టానం చర్యలు తీసుకుంటుంది. శాసనసభ్యుల మీద కూడా కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. వీటన్నిటిని సరిదిద్దడానికి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక వ్యూహరచన చేస్తున్నట్లు తెలిసింది. పార్టీ సీనియర్ నేత తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల చైర్మన్ వర్ల రామయ్య ఇటీవల రెండు రోజులపాటు తిరుపతిలో మకాం పెట్టారు. ఉమ్మడి జిల్లాలోని పార్టీ పరిస్థితి మీద అధ్యయనం చేసినట్లు సమాచారం. కొంతమంది ముఖ్య నాయకులతో మాట్లాడారు. జిల్లా పర్యటన తర్వాత వర్ల రామయ్య పార్టీ అధినేతకు జిల్లా పరిస్థితి గురించి వివరించనున్నట్లు సమాచారం. రాబిన్ శర్మ ప్రతినిధులు, ప్రోగ్రాం కమిటీ ప్రతినిధుల ద్వారా జిల్లాకు సంబంధించిన సమాచారాన్ని తెప్పించుకున్నట్లు తెలిసింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పార్టీ క్యాడర్ ను పటిష్టం చేయడానికి చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.


అలాగే ఇక్కడి వ్యవహారాలలో తల దూర్చడానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, సంస్థాగత ఎన్నికల నిర్వహణా కమిటీ చైర్మన్ వర్ల రామయ్య సంకోచిస్తుంటారు. మంత్రుల పరిస్థితి అలాగే ఉందని సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు.ఇక్కడి పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు తమ సమస్యలను నేరుగా చంద్రబాబుకే విన్నవిస్తుంటారు. ఉమ్మడి జిల్లాకు మంత్రి పదవి దక్కలేదు. మంత్రి పదవిని ఆశించిన పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి, పీలేరు శాసనసభ్యులు కిషోర్ కుమార్ రెడ్డి తమ తమ నియోజకవర్గాలకు పరిమితమయ్యారు. జిల్లాస్థాయి సమావేశాలకు సైతం హాజరుకావడం లేదు. చిత్తూరు జిల్లా ఇంచార్జి మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా పార్టీ విషయాలను పట్టించుకోవడం లేదు. కొన్ని చోట్ల నాయకులు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. కొన్ని చోట్ల అసంతృప్తి, వర్గపోరు కట్టలు తెంచుకుంటోంది. గొడవలు, ఘర్షణలు తప్పడం లేదు. అన్ని వ్యవహారాలు చంద్రబాబే చూడాల్సి రావడంతో కొన్ని చోట్ల నాయకులు, కార్యకర్తలు కట్టు తప్పుతున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజక వర్గంలో టిడిపిలో వర్గ పోరు నెలకొన్నది. ఇటీవల ఒక సందర్భాలలో రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొనడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. సత్యవేడు  ఎమ్మెల్యే ఆదిమూలం బహిష్కరణకు గురయ్యారు. ఇక్కడ శంకర్ రెడ్డిని సమన్వయ కర్తగా నియమించారు. దీనితో ఆదిమూలం, శంకర్ రెడ్డి వర్గాల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం ఒక సమావేశంలో రెండు వర్గాలు కొట్టుకునే స్థాయికి వెళ్లారు. తంబళ్లపల్లె నియోజక వర్గం పరిస్థితి అలాగే ఉంది. కల్తీ మద్యం వ్యవహారంతో సంబంధం ఉందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న  జయచంద్రా రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించారు. ఇటీవల జరిగిన ఒక సమావేశంలో వర్గపోరు ముదిరి గొడవలు జరగడంతో పార్టీ పరిశీలకుడు మల్లిఖార్జున నాయుడు గాయపడి చికిత్స తీసుకోవాల్సి వచ్చింది.  ఇక గంగాధర నెల్లూరు నియోజక వర్గంలో వర్గపోరు రావణ కాష్టం లాగా రగులుతూనే ఉంది. గత ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ అధిస్థానం అనుమతి లేకుండా నాలుగు మండల కమిటీల అధ్యక్షులతో పాటు మిగిలిన రెండు చోట్ల తన అనుచరుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అధిష్టాన వర్గం పెనుమూరు, గంగాధర నెల్లూరు, ఎస్ ఆర్ పురం, కార్వేటినగరం మండలాలకు మాత్రమే అధ్యక్షులను ప్రకటించింది. అయితే ఎమ్మెల్యే పాలసముద్రం, వెదురుకుప్పం మండలాలకు స్వయంగా అధ్యక్షులను నియమించుకున్నారు. ఆరు మండలాల్లో ఒక రెడ్డికి కూడా అవకాశం కల్పించక పోవడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై కొందరు అధిష్టానం వర్గానికి ఫిర్యాదు చేశారు. చిత్తూరు నియోజక వర్గంలో ఒక వర్గం నేతలు నివురుకప్పిన నిప్పులా ఉన్నారు. చంద్రగిరి నియోజక వర్గంలో సీనియర్ నేతలు చంద్రబాబుతో తొలి నుంచి కలసి పని చేస్తున్న కుమార్ రాజా రెడ్డి, శివకోటి రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కాగా నామినేటెడ్ పదవులు రాకపోవడంతో  పలువురు నాయకులలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్ సి వి నాయుడు, చిత్తూరు మాజీ ఎమ్మెల్యేలు సి కె బాబు, ఏ ఎస్ మనోహర్, మాజీ ఎమ్మెల్సీలు దొరబాబు, గౌనివారి శ్రీనివాసులు పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధులు డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి, డాక్టర్ సప్తగిరి ప్రసాద్, సురేంద్ర కుమార్ నిరాశతో ఉన్నారు. తిరుపతి జిల్లాకు చెందిన రాష్ట్ర నాయకులు సూరా సుధాకర్ రెడ్డి, డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం, బుల్లెట్ రమణ, మబ్బు దేవనారాయణ రెడ్డి, రెడ్డివారి గురువా రెడ్డి తదితరులు పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. తిరుపతి టిడిపిలో మూడు వర్గాలు ఏర్పడ్డాయి. ఇంచార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ వర్గం, పార్టీ నియోజక వర్గం ఇంచార్జి సుగుణమ్మ వర్గాల మధ్య నిశ్శబ్ద పోరు జరుగుతోంది. ఇద్దరితో పడని మూడో వర్గం తటస్థంగా ఉంది. ఈ నేపథ్యంలో పార్టీలోని నాయకులు, కార్యకర్తలను ఏకతాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. స్థానికంగా ఉన్న విభేదాలను పరిష్కరించి స్థానిక సంస్థల ఎనకలలో విజయ డంకా మోగించడానికి పక్కా వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా వర్ల రామయ్య తిరుపతి పర్యటన కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. వివిధ వర్గాల నుంచి తెప్పించుకున్న సమాచారం ఆధారంగా పార్టీని తిరిగి గాడిలో పెట్టడానికి త్వరలోనే చంద్రబాబు రంగంలో దిగుతున్నట్లు సమాచారం.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *