జాతీయ విద్యా దినోత్సవం నేడు
దేశ తొలి విద్యామంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
ప్రతి సంవత్సరం నవంబర్ 11న దేశమంతటా జాతీయ విద్యా దినోత్సవంను ఘనంగా జరుపుకుంటారు. భారతదేశ తొలి విద్యామంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు, దార్శనికుడు, విద్యావేత్త అయిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. విద్యా రంగంలో ఆధునిక భారతదేశానికి బలమైన పునాది వేసిన ఆజాద్, విద్యను జాతీయ పురోగతికి కీలక సాధనంగా భావించారు. ఆయన చూపిన మార్గంలోనే దేశం నేటి విద్యా విధానాలు రూపొందించుకుంటోంది. 1888 నవంబర్ 11న మౌలానా ఆజాద్ జన్మించారు. బలమైన ఇస్లామిక్ విద్యా నేపథ్యంతో పాటు చిన్న వయసులోనే అరబిక్, పర్షియన్, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషలపై ప్రావీణ్యం సంపాదించారు. పాఠశాల విద్యతో పాటు చరిత్ర, తత్వశాస్త్రం, సాహిత్యం, విజ్ఞానం వంటి విభిన్న రంగాలపై ఆసక్తి కనబరిచారు. చిన్న వయసులోనే స్వీయపఠనం ద్వారా విస్తృత జ్ఞానం సంపాదించారు. పత్రికా వ్యాసాల ద్వారా జాతీయవాదాన్ని వ్యాప్తి చేయడం ప్రారంభించారు. ఆయన వ్యాసాలు భారత రాజకీయాలపై లోతైన అవగాహన, స్వాతంత్ర్యంపై దృఢమైన అభిప్రాయాలను ప్రతిబింబించేవి.
పన్నెండేళ్ల వయసులోనే జాతీయవాద ఆలోచనలతో ఆకర్షితుడైన మౌలానా ఆజాద్ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. ఆయన ప్రసంగాలు, రచనలు ప్రజల్లో చైతన్యాన్ని రేపాయి. మహాత్మా గాంధీకి ఆయన నమ్మిన అనుచరుడు. సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా ఉద్యమాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆజాద్ మాటల్లో, అహింసా మార్గమే స్వాతంత్ర్యం సాధించే శక్తి అని చెప్పారు. ఆయన ఉపన్యాసాలు ప్రజల్లో స్వాతంత్ర్య పట్ల నిబద్ధతను పెంచాయి. మతం పేరుతో దేశం విభజించకూడదని ఆయన గట్టి విశ్వాసం కలిగి ఉన్నారు. ఐక్యత, సహజీవనం, మతసామరస్యం ఇవన్నీ ఆయన ఆలోచనల్లో ముఖ్యమైన అంశాలు. స్వాతంత్ర్యం తర్వాత భారతదేశ భవిష్యత్తు విద్యపై ఆధారపడుతుందని మౌలానా ఆజాద్ విశ్వసించారు. అందుకే ఆయన స్వతంత్ర భారతదేశ తొలి విద్యామంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన ఆలోచనల వల్లే భారత విద్యా వ్యవస్థకు దిశ నిర్ధారణ జరిగింది. ఆజాద్ విద్యను మానవ సమానత్వానికి మార్గంగా చూశారు. ప్రతి బిడ్డకు ఉచిత, తప్పనిసరి ప్రాథమిక విద్య అందించాలనే నిబద్ధతతో ఆయన విద్యా విధానాలను రూపొందించారు. విద్య ద్వారా సమాజం మారుతుందని ఆయన నమ్మకం.
మౌలానా ఆజాద్ నాయకత్వంలోనే అనేక ప్రముఖ విద్యాసంస్థలు స్థాపించబడ్డాయి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఉన్నత విద్యను పర్యవేక్షించడానికి ఏర్పాటైంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ భారత ఇంజనీరింగ్ విద్యకు కొత్త దశను ప్రారంభించాయి. సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, సాహిత్య అకాడమీ, నేషనల్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ వంటి సంస్థలు ఆయన స్ఫూర్తితో ఏర్పడ్డాయి. ఆయన దృష్టిలో విద్య కేవలం ఉద్యోగం కోసం కాదు; అది జ్ఞానం, ఆలోచన, సృజనాత్మకతకు పునాది. విద్య ద్వారా సమాజంలో సమానత్వం, పురోగతి సాధ్యమని ఆయన ఎప్పుడూ నొక్కి చెప్పారు. మౌలానా ఆజాద్ దార్శనికతలో ఐక్యత ప్రధానమైన అంశం. మతం, భాష, ప్రాంతం అనే తేడాలు దేశాభివృద్ధికి అడ్డంకులు కావని ఆయన స్పష్టం చేశారు. ఆయన ప్రసిద్ధ వ్యాఖ్య విద్య మనసును విముక్తి చేస్తుంది; సమాజాన్ని సమానంగా చూస్తుంది; దేశాన్ని బలపరుస్తుంది. ఆయన విశ్వాసం ప్రకారం, విద్య అనేది దేశాన్ని కాపాడే శక్తి. ప్రతి పౌరుడు విద్యావంతుడైతేనే దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన నమ్మారు.
మౌలానా ఆజాద్ సేవలను దేశం గుర్తించింది. ఆయనకు 1992లో మరణానంతరం భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించింది. విద్యా సంస్కరణలలో, స్వాతంత్ర్య ఉద్యమంలో, సామాజిక మార్పులో ఆయన కృషి అపూర్వం.ఆయన ఆలోచనలు నేటికీ భారత విద్యా విధానాల పునాదిగా నిలుస్తున్నాయి. విద్య ద్వారా సామాజిక సమానత్వం సాధ్యమని ఆయన భావన, నేటి విద్యా హక్కు చట్టం లో ప్రతిఫలించింది. 2008లో కేంద్ర ప్రభుత్వం నవంబర్ 11న మౌలానా ఆజాద్ జన్మదినాన్ని జాతీయ విద్యా దినోత్సవంగా ప్రకటించింది. మొదటి కార్యక్రమం అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించారు. మౌలానా ఆజాద్ విశ్వాసం ప్రకారం విద్య సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించాలి. కులం, మతం, లింగం, భాష అనే తేడాలు లేకుండా ప్రతి పిల్లవాడికి విద్య అందాలి. ప్రతి బిడ్డకు విద్య ఒక హక్కు, అది ఒక వరం కాదు అన్నది అయన భావన. ఆ భావన ఆధారంగానే భారత రాజ్యాంగం విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించింది.
గంగ 1 మౌలానా అబుల్ కలాం ఆజాద్

