10, నవంబర్ 2025, సోమవారం

చిత్తూరు జిల్లాలో వర్షాకాలం రాగానే ఉప్పొంగే జలపాతాలు

వృథాగా తమిళనాడుకి చేరుతున్న నీరు

కైగల్లు జలపాతం వద్ద పనులు శంకుస్థాపనలకే పరిమితం 

గంగన్న శిరస్సు జలపాతం వద్ద జలాశయం ప్రతిపాదనలకే పరిమితం 

కళ్యాణ్ రేవు జలపాతానికి పడని అడ్డుకట్ట

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో.

రాయలసీమకు వరదలా వస్తున్న నీరు వృథా అవుతుండడం ప్రజల్లో ఆవేదనకు దారి తీసింది. వర్షాకాలం రాగానే చిత్తూరు జిల్లా అడవుల్లో అద్భుతంగా ప్రవహించే కైగల్, గంగన్న శిరస్సు, కళ్యాణ్ రేవు వంటి జలపాతాలు ప్రకృతి సోయగాలకు ప్రతీకలుగా మారతాయి. అయితే, ఈ జలపాతాల నుంచి ఉప్పొంగే జలాలు పంటల పొలాలను తడిపే బదులు సరిహద్దులు దాటి తమిళనాడులోకి ప్రవహిస్తున్నాయి. కైగల్ జలపాతం నీళ్లను సద్వినియోగం చేసుకోవడానికి 2019లో 16 కోట్ల రూపాయలు అంచనాతో పనులకు శంకుస్థాపన చేశారు. తర్వాత ప్రభుత్వం మారడంతో పనుల ప్రారంభం కాలేదు. గంగన్న శిరస్సు జలపాతం వద్ద రూ. 37 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించాలన్న జలాశయం ప్రతిపాదనలకే పరిమితమైంది. కళ్యాణ్ రేపు జలపాతానికి అడ్డుకట్ట వేస్తే పలమనేరు పట్టణ తాగునీటి అవసరాలను తీర్చవచ్చునని ప్రజలు భావిస్తున్నారు. 


ప్రస్తుతం గంగన్న శిరస్సు జలపాతం ద్వారా సుమారు 50 ఎంసీఎఫ్‌టీ, కైగల్ ద్వారా 45 ఎంసీఎఫ్‌టీ, కళ్యాణ్ రేవు ద్వారా 40 ఎంసీఎఫ్‌టీ నీరు వృథాగా తమిళనాడుకి చేరుతోందని అంచనా. ఈ నీటిని కట్టడి చేసి రాయలసీమ కరువును శాశ్వతంగా తొలగించాలనే అభిప్రాయం ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. పలమనేరు పట్టణానికి చెందిన స్వచ్ఛంద సంస్థ  అధినేత ఒకరు మాట్లాడుతూ ఈ నీరు వృథా కాకుండా కట్టడి చేస్తే రాయలసీమ రైతు బాగుపడతారని అభిప్రాయపడ్డారు. రైతు బాగుంటే దేశం బాగుంటుంది అంటూ హృదయాన్ని హత్తుకునే సందేశం ఇచ్చారు. ప్రభుత్వాలు వస్తూ పోతున్నా, సమస్య మాత్రం అదే స్థాయిలో కొనసాగుతోందని విచారం వ్యక్తం చేశారు. జిల్లాలో కుప్పం, శాంతిపురం, వీకోట, బైరెడ్డిపల్లి, పలమనేరు ప్రాంతాల్లో వర్షం పడితే కైగల్, గంగన్న శిరస్సు, కళ్యాణ్ రేవు జలపాతాలు విరుచుకుపడతాయి. పాలేరు సరస్సు, గిడిగులు జలపాతాలు కూడా నీటితో కళకళలాడతాయి. ఈ జలాలను సద్వినియోగం చేస్తే కుప్పం నుండి బంగారుపాళ్యం వరకు కరువు అనే పదమే ఉండదని స్థానికులు పేర్కొన్నారు.


కైగల్ జలపాతంను దుమ్ముకురాళ్ల జలపాతం అని కూడా అంటారు ఇది బైరెడ్డిపల్లి మండలం టైగర్లు గ్రామంలో ఉంది 46 నుంచి ఇక్కడ నీళ్లు దూకుతుంటాయి. ఈ జలపాతం నీటిని వినియోగించేందుకు ప్రభుత్వం 2019లో 16.01 కోట్ల రూపాయలు మంజూరు చేసి శంకుస్థాపన చేసినా, ఆరునెలల్లో పూర్తవ్వాల్సిన పనులు ఆరేళ్లయినా ముందుకు సాగలేదు. ప్రభుత్వం మారడంతో వైసీపీ పాలనలో ప్రాజెక్టు పూర్తిగా నిర్లక్ష్యం పాలైందని ప్రజలు విమర్శిస్తున్నారు. అంచనా వ్యయం 22.65 కోట్లకు పెరిగినా పనులు పునఃప్రారంభం కాలేదు.

ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ ఒకరు మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతులు లభించగానే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. కానీ, స్థానికుల అభిప్రాయం ప్రకారం ఇవన్నీ కేవలం మాటల్లోనే మిగిలిపోతున్నాయన్నారు. అలాగే గంగన్న శిరస్సు జలపాతం పలమనేరు మండలం మండికోటూరు అడవి ప్రాంతంలో ఉంది ఇక్కడ 600 అడుగుల నుంచి  నీళ్లు దూకుతుంటాయి. ఈ జలపాతం నీళ్లు కూడా వృధాగా పోతున్నాయి. కూటమి ప్రభుత్వం ఈ జలపాతాన్ని రూ.37 కోట్లతో జలాశయంగా మార్చే ప్రతిపాదనను రూపొందించినప్పటికీ, అది ఇప్పటికీ ఫైళ్లలోనే ఉంది. కైగల్ వద్ద రూ.23 కోట్లతో చెక్‌డ్యామ్ నిర్మాణ ప్రతిపాదన కూడా పరిశీలనలోనే నిలిచిపోయింది. పలమనేరు అడవుల్లో తమిళనాడు సరిహద్దుకు ఆనుకొని ఉన్న కళ్యాణ్ రేవు జలపాతం అద్భుత దృశ్యం. దీనిని కళ్యాణ రావు జలపాతం అని కూడా అంటారు. అక్కడికి వెళ్లే మార్గం సరిగా లేకపోవడంతో అది కేవలం పర్యాటక ఆకర్షణగానే పరిమితమైపోతోంది. ప్రజలు చెబుతున్నట్లుగా ఈ జలపాతాల ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తే పలమనేరు పట్టణానికి తాగునీటి సమస్య పూర్తిగా తీరిపోతుంది. కైగల్ జలాలతో లక్ష ఎకరాల భూమి సస్యశ్యామలంగా మారవచ్చు. ఈ జలపాతాలు కేవలం చూడటానికి మాత్రమే కాదు, జీవనాధారంగా మారే సామర్థ్యం ఉన్న ప్రకృతి వరాలు. సరైన ప్రణాళికతో కట్టడులు నిర్మిస్తే రాయలసీమ కరువు చరిత్రలో ఒక పుటగా మిగిలిపోతుందని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు.



అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *