సత్యవేడు తెదేపా ఇన్ ఛార్జ్ కోసం రూ. 2.5 కోట్ల ముడుపులు ?
ముడుపుల విషయం పోలిట్ బ్యూరోలో చర్చ
రాబిన్ సన్ సర్వేలో వెనుకబడిన ఓ ఇంచార్జి
మరో నియోజకవర్గ ఇంచార్జి విషయంలో రగడ
స్థానిక నాయకులు తప్పుదారి పట్టించారని బాబు ఆగ్రహం
స్థానికులు కాకపోవడంతో చిక్కులు
స్థానిక నాయకుల సహాయనిరకరణ
ఆ మూడు నియోజకవర్గ ఇంఛార్జిలకు మంగళం ?
సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ కోసం 2.5 కోట్ల రూపాయలు ముడుపులుగా కొంతమంది టీడీపీ నేతలకు ముట్టినట్లు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు అందినట్లు విశ్వసనీయంగా తెలిసింది. విషయం తెలిసిన చంద్రబాబు అవాక్కు అయినట్లు తెలిసింది. ఈ విషయమై విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం బాబు తెప్పించుకున్నట్లు సమాచారం. ఈ విషయం నిజమని తేలడంతో పార్టీ పోలిట్ బ్యూరోలో దీని మీద చర్చ జరిగినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో రాష్ట్ర స్థాయి నాయకుల ప్రమేయం కూడా ఉండటంతో చంద్రబాబు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో గంగాధర నెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గ ఇన్ ఛార్జిలో వ్యవహారం కూడా అరతీసినట్లు సమాచారం. ఇందులో కూడా కొందరు తనను తప్పుదారి పట్టించినట్లు బాబుకు నివేదికలు అందాయి. పార్టీలో మొదటి నుండి ఉన్న నాయకీలను కాదని స్థానికులు కానీ కొత్తవారిని ఇన్ ఛార్జ్ లుగా నియమించారు. దీంతో స్థానిక నాయకులు వారికి సహాయనిరకరణ చేస్తున్నారు. దీంతో రానున్న ఎన్నికలలో పార్టీ భారీగా నష్టపోతుందని నివేదికలు అందినట్లు సమాచారం. దీంతో పార్టీ అధినేత దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు సమాచారం.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మూడు రిజర్వుడు నియోజక వర్గాల టిడిపి ఇంచార్జిల నియామకం వివాదాలకు దారితీస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. దీనిపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారని తెలిసింది. కొన్ని విషయాలు పొలిట్ బ్యూరోలో చర్చకు వచ్చినట్టు చిత్తూరు నేత ఒకరు చెప్పారు. సత్యవేడు నియోజకవర్గ తెదేపా ఇన్ ఛార్జ్ కోసం రూ. 2.5 కోట్ల ముడుపులు చేతులు మారినట్టు చంద్రబాబుకు ఫిర్యాదు అందిందని అంటున్నారు. గతంలో అక్కడ ఇంచార్జిగా ఉన్న జేడీ రాజశేఖర్ ను తొలగించి మాజీ ఎమ్మెల్యే హేమలత నియమించారు. వెంటనే ఆమెను కాదని ఆమె కూతురు హెలెన్ కు బాధ్యతలు అప్పగించారు.అయితే ఈ తతంగం వెనుక రెండున్నర కోట్లు చేతులు మారాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాకు చెందిన ఒక రాష్ట్ర నాయకుడు, ఇద్దరు పార్లమెంటు నాయకులతో పాటు రాష్ట్ర అగ్ర నాయకుడు, కార్యక్రమాల కమిటీలోని ఓ కీలక నాయకుడు కలసి ఈ సొమ్ము పంచుకున్నారని వినికిడి. ఈ విషయం ఆలస్యంగా తెలియడంతో చంద్రబాబు ఆరా తీసి కొంత సమాచారం రాబట్టారని తెలిసింది. హెలెన్ పనితీరు సక్రమంగా లేక పోవడంతో చంద్రబాబు జాగ్రత్త పడి తన మనుషుల ద్వారా సమాచారం తెప్పించుకున్నారని సమాచారం. ఈ అక్రమ లావాదేవీల్లో కీలకమైన వ్యక్తుల పాత్ర ఉండటంతో చంద్రబాబు ఆచితూచి అడుగు వేస్తారని ఒక సీనియర్ నాయకుడు చెప్పారు.
వెనకబడ్డ జి డి నెల్లూరు ఇంచార్జి:
కొత్తగా నియమితులైన జి డి నెల్లూరు ఇంచార్జి డాక్టర్ థామస్ రాబిన్ శర్మ సర్వేలో వెనుకబడి ఉన్నారని నియోజక వర్గంలో చర్చ జరుగుతోంది. ఆయన ఎవరిని కలుపుకుని పోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాజీ సమన్వయ కర్త చిట్టిబాబు నాయుడు ప్రభావంతో ఒంటెద్దు పోకడ ప్రదర్శిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆరు మండలాల అధ్యక్షులు ఆయనతో అంటి ముట్టనట్లు ప్రవర్తిస్తున్నారని అంటున్నారు. పాలసముద్రం మండల కమిటీ అధ్యక్షుడు రాజేంద్ర పూర్తిగా కార్యక్రమాలకు దూరమయ్యారని తెలిసింది. రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ఇంతవరకు నియోజక వర్గం ముఖం కూడా చూడలేదు. అధిక శాతం ఓట్లు ఉన్న రెడ్డి సామాజిక వర్గం నాయకులు పార్టీ వైపు రావడానికి ఇష్టపడటం లేదు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొందరు నాయకులు థామస్ ను వ్యతిరేకిస్తున్నారు. ఓటు బ్యాంకు అయిన బిసి నేతలు వర్గాలుగా విడిపోయారు. ఈ నేపథ్యంలో తిరిగి మాజీ మంత్రి డాక్టర్ గుమ్మడి కుతూహలమ్మ కొడుకు హరికృష్ణను ఇంచార్జిగా నియమించడం మంచిదని మెజారిటీ కార్యకర్తల అభిప్రాయంగా చెపుతున్నారు. గతంలో ఇంచార్జిగా ఉన్న హరికృష్ణ తనకు మాట మాత్రంగా కూడా చెప్పకుండా చిట్టిబాబును సమన్వయ కర్తగా నియమించడంతో మనస్తాపం చెంది రాజీనామా చేశారు. కాగా థామస్ నియమకంలోను నియోజక వర్గం నాయకుడు, ఇద్దరు జిల్లా నాయకులు, కార్యక్రమాల కమిటీలో కీలక వ్యక్తి హస్తం ఉందని అంటున్నారు. అందరూ కలసి తప్పుడు రిపోర్టులు ఇచ్చి చంద్రబాబును తప్పుదారి పట్టించారని అంటున్నారు. రాబిన్ శర్మ టీమ్ రిపోర్టు చూసి చంద్రబాబు కొంత అసహనం ప్రదర్శించారని సమాచారం.
వివాదంలో పూతలపట్టు ఇంచార్జి
పూతలపట్టు ఇంచార్జిగా జర్నలిస్టు డాక్టర్ మురళీ మోహన్ నియామక వర్గపోరుకు తెరతీసింది. ఎక్కడో తిరుపతిలో ఉన్న వ్యక్తిని తీసుకు వచ్చి ఇక్కడ ఇంచార్జిగా పెట్టవలసిన అవసరం ఏమొచ్చిందని స్తానిక ఎస్సీ సామాజిక వర్గం నాయకు ప్రశ్నిస్తున్నారు.ఆయన ఏనాడూ పార్టీ కోసం పనిచేయక పోయినప్పటికీ కొందరు కమ్మ సామాజిక వర్గం నాయకుల మాట విని ఇంచార్జిగ పెట్టడం ఎంత వరకు న్యాయమని నిలదీస్తున్నారు. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు పనిచేసిన రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్, పుష్పరాజ్, మునిరత్నం తదితరులను పక్కన పెట్టడం విమర్శలకు తావిస్తోంది. నియోజక వర్గంలో కీలక వ్యక్తి అయిన మాజీ మంత్రి, మాజీ పొలిట్ బ్యూరో సభ్యులు గల్లా అరుణ కుమారిని కనీసం సంప్రదించ లేదని అంటున్నారు. ఇలాంటి చర్యల జీర్నించుకోలేకనే రాష్ట్ర కార్యదర్శి గురజాల సందీప్ చౌదరి పార్టీకి దూరమయ్యారని ఒక నాయకుడు చెప్పారు.
ఈ నేపథ్యంలో మూడు రిజర్వుడు నియోజక వర్గాల ఇంచార్గిలపై చంద్రబాబు సమగ్ర నివేదికలు తెప్పించుకునే పనిలో ఉన్నారని తెలిసింది. సరైన సమయంలో ముగ్గురికీ ఉద్వాసన తప్పదని రాష్ట్ర నాయకుడు ఒకరు చెప్పారు.