22, జులై 2023, శనివారం

నమ్ముకున్న తమ్ముళ్లకు భరోసా ఏది బాబూ ?


                           తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి మహానాడులో మినీ మ్యానిపెస్టో ప్రకటించారు. అందులో మహిళలు, రైతుల, యువతకు  భరోసా కల్పించారు.  ప్రజల భవిష్యత్తుకు గ్యారంటి అంటూ బస్సు యాత్రలు చేయమన్నారు. అయితే జిల్లా TDPలో ఇంతవరకు ముగ్గారికి తప్ప ఎవ్వరికి టిక్కెట్టు ఖరారు కాలేదు. ఒక్కొక్క నియోజక వర్గంలో ఆశావహులు అర డజను వరకు ఉన్నారు. 11 నియోజక వర్గాలల్లో ఎవరికీ టిక్కెట్టు ఇస్తారో తెలియదు. ఫలితంగా బస్సు యాత్రలు మొక్కుబడిగా జరుగుతున్నాయి. ఒక ముక్కలో చెప్పాలంటే, ప్రభుత్వ కార్యక్రమం లాగా, ఫోటోలకూ, నివేదికలకు పలుచోట్ల పరిమితం అవుతున్నారు. ముందు పోటి చేసే అభ్యర్థిని ఖరారు చేయాలని కోరుతున్నారు. అప్పుడు అభ్యర్థి ఖర్చు భరించుకుంటారు. కార్యక్రం వాస్తవంగా జరుగుతుంది. అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలను పరుగులు తీస్తారు. ప్రయోజనం ఉంటుంది. అలాగే పోలింగ్ బూతు స్థాయి కమిటీలు, క్లస్టర్ లు, మండల కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇవి కూడా పేపర్ల మీద కాకుండా, పటిష్టంగా ఏర్పాటు అవుతాయి. అభ్యర్థి వాటితో పక్కగా పనిచేపిస్తారు. నియోజక వర్గానికి ఒక ఇంచార్జిని నియమించి ఆయనపై ఒక పరిశీలకుని పెట్టారు. త్వరలో నియోజక వర్గానికి పదిమందితో ఒక కమిటీ వేయడానికి నిర్ణయించారు. ఈ కమిటీలు వారం వారం నివేదికలు పంపాలి. వాటి ప్రకారం ఇంచార్జిలకు సూచనలు ఇస్తారు. 


                         వీరితో పాటు మండల, పార్లమెంటు, రాష్ట్ర స్థాయిలో వివిధ అనుబంధ కమిటీలు ఉన్నాయి. దీనికి తోడు సోషియల్ మీడియాలో పనిచేసే వారు ఉన్నారు. ఇలా అందరూ కలిస్తే నియోజక వర్గంలో 200 మంది పైగా కార్యకర్తలు బాధ్యత వహిస్తున్నారు. నిత్యం పార్టీ కోసం శ్రమిస్తున్నారు. పార్టీ పిలుపు మేరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎవరికి వారు స్వంతంగా అవసరమైన ఖర్చులు భరిస్తున్నారు. కొన్ని చోట్ల ఇంచార్జిలు ఆన్ని ఖర్చులు పెడుతున్నారు. ఇంత చేస్తున్నా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు భరోసా లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ర్టంలో అతి కొద్ది మందికి తప్ప టిక్కెట్టు హామీ ఇంతవరకు లేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇద్దరు ముగ్గురికి తప్ప ఎవరికీ టిక్కెట్ హామీ లేదంటున్నారు. కుప్పంలో చంద్రబాబు పోటీ చేస్తారు. పలమనేరు లో ఎన్ అమరనాద రెడ్డి, పీలేరులో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి టిక్కెట్టు వస్తుందని అంటున్నారు. 


                    పుంగనూరులో చల్లా రామచంద్రా రెడ్డికే టిక్కెట్టు అని బాబు ప్రకటించి నప్పటికీ గ్యారంటీ లేదంటున్నారు. కొందరు మాజీ మంత్రి అమరనాధ రెడ్డి పేరును ప్రతిపాదిస్తున్నారు.  ప్రత్యామ్నాయంగా గతంలో పోటీ చేసిన అనీషా రెడ్డి పేరు తిరిగి పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. తంబళ్లపల్లె లో శంకర్ యాదవ్ కు గ్యారంటీ లేదని, అక్కడ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి పేరు పరిశీలనలో ఉందని తెలిసింది. మదనపల్లి నియోజక వర్గంలో ఇంచార్జి దొమ్మలపాటి రమేష్ తో పాటు ఇటివల పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే క్ షాజహాన్ పేరు వినిపిస్తోంది. చిత్తూరులో కుల సమీకరణలు ఇంకా తేలలేదని సమాచారం. ఇటీవల  పూతలపట్టు ఇంచార్జిగా నియమితులు అయిన డాక్టర్ మురళీ మోహన్ పై అప్పుడే అసమ్మతి ప్రారంభం అయ్యింది. జి డి నెల్లూరు ఇంచార్జి డాక్టర్ వి ఎం థామస్ కేవలం ఒక వర్గానికే కొమ్ము కాస్తున్నారని అంటున్నారు. ఇటీవల పార్టీలో చేరిన విశ్రాంత ఎస్పీ పి.చిన్నస్వామి పేరు పరిశీలనలో ఉందని తెలిసింది. 


                  నగరిలో ఇంచార్జి గాలి భాను ప్రకాష్  సరిపోరని అంటున్నారు. భాను ఇంటిపోరు ఎక్కువగా ఉంది. తమ్ముడు జగదీష్ కూడా రంగంలో ఉన్నారు. ఇక్కడ అశోక్ రాజు పేరు కూడా తెరమీదకు వచ్చిందని తెలిసింది. సత్యవేడు ఇంచార్జి హెలెన్ పై పలు విమర్శలు వస్తున్న నేపద్యంలో జె డి రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే తలారి ఆదిత్య పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. శ్రీకాళహస్తి టిక్కెట్ ఇంచార్జి బొజ్జల సుధీర్ రెడ్డికి రాక పోవచ్చని భావిస్తున్నారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు పేరు తాజాగా తెర మీదకు వచ్చింది. తిరుపతి నియోజక వర్గంలో ఇంచార్జి సుగుణమ్మ టిక్కెట్టు కు గ్యారంటీ లేదంటున్నారు. ఇక్కడ ఊకా విజయకుమార్, జేబి శ్రీనివాస్, డాక్టర్ కోడూరు బాల సుబ్రమణ్యం టిక్కెట్టు రేసులో ఉన్నారు. 


                      చంద్రగిరి ఇంచార్జి పులివర్తి నాని తనకు లోకేష్ హామీ ఇచ్చారని చెప్పుకుంటున్నారు. అయితే ఈ స్థానం కోసం టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి, రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి మబ్బు దేవ నారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది.  ఇదిలా ఉండగా పొత్తు కుదిరితే జనసేనకు మూడు స్తానాలైనా కేటాయిస్తారని అనుకుంటున్నారు. ఏ ఏ స్థానాలు కేటాయిస్తారో స్పష్టత లేదు. తిరుపతి, చిత్తూరు, మదనపల్లి కేటాయించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. అవి జనసేనకు కేటాయిస్తే అక్కడ పార్టీని నమ్ముకొని, పార్టీ కోసం రేయింబవళ్ళు కష్టపడుతున్న వారి భవిష్యత్తుకు ఎం గ్యారంటి అని తమ్ముళ్ళు ఆందోళన చెందుతున్నారు. మిగిలిన స్థానాల్లో సైతం చంద్రబాబు అంతరంగం అంతుబట్టడం లేదు. ప్రజల భవిష్యత్తుకు గ్యారంటి సరే, మా భవిష్యత్తుకు ఎం గ్యారెంటీ అని టిక్కెట్టు ఆశిస్తున్న తమ్ముళ్ళు అడుగుతున్నారు. చివరి నిమిషం వరకు తేల్చకుండా, నానపెట్టడం చంద్రబాబు నైజం. ఎప్పుడు ఎం నిర్ణయం తీసుకుంటారో తెలియదు. టిక్కెట్టు మీద గంపెడు ఆశలు పెట్టుకున్న తనను కాదని వేరే వారికీ టిక్కెట్టు ఇస్తే తన భవిష్యత్తుకు ఎవరు గ్యారంటీ అని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు నాయకులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *