8, జులై 2023, శనివారం

మారుతున్న జి డి నెల్లూరు టిడిపి రాజకీయ ముఖ చిత్రం !


                                వైసిపికి కంచుకోట అయిన జి డి నెల్లూరు నియోజకవర్గంలో టిడిపి రాజకీయ ముఖచిత్రం మారుతోంది. ఎనిమిది మంది ప్రధాన మంత్రుల వద్ద రక్షణ అధికారిగా పనిచేసిన విశ్రాంత ఎస్పీజీ కమాండెంట్ పి చిన్నస్వామి టిడిపిలో చేరడంతో ఇక్కడి రాజకీయాలు మలుపు తిరిగాయి. స్వామి గంగాధర నెల్లూరు మండలానికి చెందిన వ్యక్తి కావడంతో పలురకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన జి డి నెల్లూరు అసెంబ్లీ లేదా చిత్తూరు పార్లమెంటు టిక్కెట్టు ఆశిస్తున్నారు. ఆ మేరకు తన మనసులో మాట చంద్రబాబు చెవిన వేశారని తెలిసింది. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య దగ్గర ఉండి బాబు వద్ద ఆయనకు పసుపు కండువా కప్పించారు. నియోజక వర్గానికి చెందిన రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు సూరా సుధాకర్ రెడ్డి, బుల్లెట్ రమణ కూడా పక్కన ఉన్నారు. అలాగే వెదురుకుప్పం మండలానికి చెందిన రాష్ట్ర సాంస్కృతిక విభాగం ప్రధాన కార్యదర్శి ఎన్ మునిచంద్రా రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి వెంట ఉన్నారు. దీనితో ఆయన చేరిక ప్రాధాన్యత సంతరించుకున్నది. ఇటీవలనే చెన్నైలో ఆసుపత్రి నడుపుతున్న డాక్టర్ థామస్ ను నియోజక వర్గం ఇంచార్జిగా నియమితులు అయ్యారు.


                      మాజీ సమన్వయ కర్త భీమినేని చిట్టిబాబు నాయుడు దగ్గర ఉండి థామస్ కు పదవిఇప్పించారని ప్రచారంలో ఉంది. పార్టీకి పనిచేస్తున్న  స్థానికులను కాదని థామస్ కు పదవి ఇవ్వడం పట్ల నియోజక వర్గంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. ఆరు మండలాల అధ్యక్షులు తొలుత థామస్ ను వ్యతిరేకించారు. అయితే చంద్రబాబు జోక్యంతో పైకి సర్ధుకున్నట్టు  కనిపిస్తున్నప్పటికీ  అసమ్మతి నివురు కప్పిన నిప్పులా ఉంది. ఒక మండల అధ్యక్షుడు పదవికి, పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. అయితే కొందరి సలహాతో వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన చిన్నస్వామి  రంగ ప్రవేశం అలజడి రేపుతోంది.  చిత్తూరు జిల్లాలో ఉన్న ఒక లోక్ సభ, రెండు అసెంబ్లీ నియోజక వర్గాలలో తమకు ఒకటి కేటాయించాలని ఆ వర్గం నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న 29 అసెంబ్లీ, నాలుగు లోక్ సభ స్థానాలలో సగం స్థానాలు ఈ వర్గానికి ఇస్తానని చంద్రబాబు ప్రకటించారు. దీంతో చిన్నస్వామికి ఎదో ఒక అవకాశం తప్పదన్న వాదన వినిపిస్తున్నది.



                        నియోజక వర్గంలో బలమైన రెడ్డి సామాజిక వర్గం నేతలు కొందరు స్వామికి అండగా ఉన్నారు. అలాగే కమ్మ సామాజిక వర్గంలోని చిట్టిబాబు వ్యతిరేకులు ఆయన మద్దతు ఇస్తున్నారు. దీనితో థామస్ ఆశలపై నీళ్లుచల్లినట్లు అయ్యింది.  ఇదిలా ఉండగా రెడ్డి సామాజిక వర్గం మద్దతు లేకుండా అక్కడ గెలవడం సాధ్యం కాదని రాబిన్ శర్మ బృందం నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. టిడిపి ఏర్పడిన తరువాత జరిగిన 1983 ఎన్నికల్లో పూర్వపు వేపంజేరి నియోజక వర్గంలో టిడిపి అభ్యర్థి తలారి రుద్రయ్య విజయం సాధించారు. తరువాత  1985,1989 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ గుమ్మడి కుతూహలమ్మ విజయం సాధించింది. 1994 లో అప్పటి లోక్ సభ సభ్యుడు మహాసముద్రం జ్ఞానేంద్ర రెడ్డి జోక్యంతో శోభాకు కాంగ్రెస్ టిక్కెట్టు వచ్చింది. దీంతో కుతూహలమ్మ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 15 వేల ఓట్లు తెచ్చుకున్నది. ఈ నేపథ్యంలో టిడిపి అభ్యర్థి ఆర్ గాంధీ స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. అయితే 1999, 2004 లో జరిగిన రెండు ఎన్నికల్లో వేపంజేరి ఎమ్మెల్యేగా, పునర్విభజన తరువాత  2009 లో జి డి నెల్లూరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ టిక్కెట్టుపై  కుతూహకమ్మ గెలుపొందారు. రాష్ట్రం విడిపోయిన తరువాత 2014 ఎన్నికల్లో చంద్రబాబు కుతూహలమ్మను పిలిచి టిక్కెట్టు ఇచ్చారు. అయితే ఆమె వైసిపి అభ్యర్థి కె నారాయణ స్వామి చేతిలో 20 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019 లో ఆమె కుమారుడు డాక్టర్ హరికృష్ణ టిడిపి టిక్కెట్టుపై పోటీ చేసి వైసిపి అభ్యర్ధి నారాయణ స్వామి చేతిలో 45 వేల తేడాతో ఓడి పోయారు. 



               తరువాత జరిగిన రాజకీయ పరిణామాల్లో వారిద్దరూ టిడిపికి గుడ్ బై చెప్పారు. ఐదుసార్లు రెడ్ల మద్దతు ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అయిన, మంత్రిగా పనిచేసిన కుతూహలమ్మ టిడిపిలో ఓడి పోవడంపై రాబిన్ శర్మ బృందం విశ్లేషణ చేసినట్లు సమాచారం. ఇక్కడ బలమైన రెడ్డి సామాజిక వర్గం మద్దతు లేకుండా టిడిపి గెలవడం కష్టమని తెల్సివేసిందని సమాచారం. నియోజక వర్గంలో రెడ్లు 50, వేలు, ఎస్సీలు 65 వేలు, బిసిలు 65 వేలు, కమ్మ సామాజిక వర్గం 20 వేలు ఉన్నారని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో రెడ్డి నేతల మద్దతు ఉన్న వారికి టిక్కెట్టు ఇస్తే మంచిదని చూచించారని తెలిసింది. దీంతో  టిడిపి అభ్యర్థి ఎవరన్నది మళ్ళి మొదటికి వచ్చింది. భేతాళుని కధలా మారింది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *