7, జులై 2023, శుక్రవారం

రసకందాయంలో శ్రీకాళహస్తి టిడిపి రాజకీయాలు !




                             శ్రీకాళహస్తి మాజీ MLA SCV నాయుడు తెదేపాలో చేరడంతో ఆ నియోజకవర్గ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. SCV చేరిక TDP వర్గాల్లో జోష్ నింపుతోంది. బలమైన అండ దొరికిందన్న ధీమాతో కార్యకర్తలు ఉన్నారు. అయితే, నియోజకవర్గ ఇన్ ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డిలో మాత్రం గుబులు లేపుతోంది. రాన్నున్న ఎన్నికల్లో తానే అభ్యర్థి అని ధీమాగా ఉన్న సుధీర్ రెడ్డికి SCV రూపంలో ప్రత్యర్థి తయారయ్యారు. ఇరువురు నేతలలో చంద్రబాబు ఎటు వైపు మొగ్గుతారో, టిక్కెట్టు ఎవరికీ లభిస్తుందో, MLA పీటం మీద ఎవరు ఆశీనులవుతరో  అన్న   సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


                  బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి మరణించే వరకు  నియోజకవర్గ టిడిపిలో ఆయన హవా కొనసాగింది. ఆయన  తర్వాత తనయుడు బొజ్జల సూదీర్ రెడ్డి ఇన్ ఛార్జ్ భాధ్యతలు చేపట్టారు. ప్రధానంగా కోవిడ్ కాలంలో కూడా టిడిపి ఇన్ చార్జ్  బొజ్జల సుధీర్ రెడ్డి నియోజక వర్గంలో అందుబాటులో లేరనే అపవాదు ఎదుర్కొన్నారు.  సుధీర్ రెడ్డి అందుబాటులో వుండరని, వైకాపా నేతల  దౌర్జన్యాలను దీటుగా ఎదుర్కొనే పరిస్థితి లేదని టిడిపి కార్యకర్తలు కూడా మధన పడుతున్నారు. ఈ మధ్య టిడిపికి చెందిన ఒక నేతపై వైసీపీ వాళ్లు దాడి చేశారు. దాడిలో  కారును ధ్వంసం చేసినా, దీటుగా బొజ్జల సుధీర్ రెడ్డి ఎదుర్కోలేదని విమర్శలు ఉన్నాయి. తాజాగా ఒక యస్సీ కార్యకర్త జైలుకు వెళ్లినా, పార్టీ తరపున సహకారం అందించ లేదనే భావన ప్రబలంగా వుంది. అంతేకాదు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డి చురుగ్గా పని చేయ లేదని చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ లో అందరి సమక్షంలో ఆక్షేపించినట్లు సమాచారం. ఈ విషయం ఉమ్మడి జిల్లా టీడీపీలో అప్పట్లోనే చర్చనీయాశమైంది.


                 ఈ పూర్వ రంగంలో 2019 ఎన్నికల సందర్భంగా టిడిపి నుండి వైకాపా చేరిన మాజీ ఎమ్మెల్యే యస్సీవీ నాయుడు తిరిగి టిడిపిలో చేరారు. నియోజకవర్గం లోని కార్యకర్తలు తమకు కొండంత అండగా SCV  ఉంటారని భావించారు.  బొజ్జల సుధీర్ రెడ్డి మాత్రం తొలుత తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ స్థితిలో యస్సీవీ నాయుడు టిడిపిలో చేరితే   ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక సందర్భంగా తనకు పోటీకి వస్తారని భావించి అడ్డుకున్నారు.  చంద్రబాబు నాయుడు సర్దిచెప్పడంతో చివరకు ఒప్పుకోక తప్ప లేదు. అందుకే యస్సీవీ నాయుడు టిడిపిలో చేరే సమయంలో పెద్ద హైడ్రామా చోటు చేసుకుంది. చేరిక ఒక సారి వాయిదా పడింది. తుదకు చంద్రబాబు నాయుడు ఆదేశాలతో సుధీర్ రెడ్డి యస్సీవీ నాయుడు చేరిక సందర్భంగా మంగళగిరి వెళ్లి హాజరైనారు.


                    చంద్రబాబు నాయుడును యస్సీవీ నాయుడు తొలుత కలిసినపుడు నియోజకవర్గంలో సమగ్రంగా సర్వే చేయించి, ఎవరైతే గెలుస్తారో, వారికి టిక్కెట్ ఇవ్వమని కోరారు. అలా ఎవరికి టిక్కెట్టు ఇచ్చినా  తాను పార్టీ కోసం కష్టపడి పనిచేస్తామని చెప్పారు. తనకే ఇవ్వమని కూడా యస్సీవీ నాయుడు చంద్రబాబు నాయుడును కోరలేదు. సుధీర్ రెడ్డిని పార్టీ ఇన్ చార్జ్ గా ప్రకటించినా అభ్యర్థిగా అధికారయుతంగా ప్రకటించ లేదు. ఒక వేళ సుధీర్ రెడ్డినే అభ్యర్థిగా ప్రకటించితే పని చేసేందుకు యస్సీవీ నాయుడు సిద్ధంగా వున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. 


                           అయితే సుధీర్ రెడ్డి మాత్రం  తానే అభ్యర్థినని,  రానున్న ఎన్నికలలో తనను గెలిపించాలని కోరుతున్నారు.  దీనిని ఇటీవల టిడిపిలో చేరిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు యస్సీవీ నాయుడు, మునిరామయ్య అంగీకరించడం లేదు. చంద్రబాబు నాయుడు నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో  బుధవారం యస్సీవీ నాయుడు టిడిపి ఆఫీసుకు తొలి సారి వచ్చినపుడు ఈ వైరుధ్యాలు బహిర్గతమయ్యాయి. కార్యకర్తల సమావేశంలో యస్సీవీ నాయుడు, మునిరామయ్య మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎవరికి టికెట్ ఇస్తే వారి గెలుపుకు కృషి చేస్తామని చెప్పారు. కాని సుధీర్ రెడ్డి, తల్లి బొజ్జల బృందమ్మ మాత్రం సుధీర్ రెడ్డి గెలుపుకు అందరూ పని చేయాలని మాట్లాడారు.  అయితే, ఈ సమావేశంలో మాట్లాడిన  టిడిపి ద్వితీయ శ్రేణి నాయకులు ఒక్కరు కూడా అభ్యర్థి సుధీర్ రెడ్డి అభ్యర్థి అని, ఆయన గెలుపుకు పని చేయాలని అనలేదు.  టిడిపి గెలుపుకు పని చేయాలని మాట్లాడటంతో  బృందమ్మ ఇరకాటంలో పడినట్లు తెలుస్తోంది. బృందమ్మ మాట్లాడుతూ సుధీర్ రెడ్డిని గెలించాలని చెబుతున్నపుడు సమావేశంలో పాల్గొన్న కార్య కర్తలు నుండి ఏమాత్రం స్పందన లేకపోవడం కొసమెరుపు.


                       యస్సీవీ నాయుడు పార్టీలో చేరక ముందే నియోజకవర్గంలోని ముఖ్యమైన నలుగురు నాయకులను చంద్రబాబు నాయుడు పిలిచి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై అరా తీశారు.  వారు  సుధీర్ రెడ్డికి వ్యతిరేకంగా చెప్పారని జిల్లా టీడీపీ వర్గాల ద్వారా తెలిసింది. సుధీర్ రెడ్డి నియోజకవర్గంలో స్థిరంగా వుండక పోవడం, వైకాపా  రౌడీ మూకలను దీటుగా ఎదుర్కొనే అనుచర గణం లేక పోవడంతో ఎక్కువ మంది టిడిపి కార్యకర్తలు సుధీర్ రెడ్డి అంటే సుముఖంగా లేరని చెబుతున్నారు. గతంలో వేరే ఆప్షన్ లేక మిన్నకున్నారు.  యస్సీవీ నాయుడుకు అనుచర బలగం వున్నందున, వైకాపాను దీటుగా ఎదుర్కొనగలరనే భావన నియోజకవర్గంలోని కార్యకర్తల్లో వుంది. 


                  అయితే చంద్రబాబు నాయుడు ఎవరికి టికెట్ ఇస్తారో అనే అంశంపై ద్వితీయ శ్రేణి నాయకులు, సాధారణ కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది. ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. నియోజకవర్గంలోని ఒకరిద్దరు నాయకులు ఈ పాటికే చంద్రబాబు నాయుడును కలసి యస్సీవీ నాయుడు అభ్యర్థి అయితే వైకాపాను దీటుగా ఎదుర్కొన గలరని చెప్పినట్లు సమాచారం. నియోజకవర్గంలో ఇంత వరకు  ఈసురోమని వున్న సాధారణ కార్యకర్తలు మాత్రం యస్సీవీ నాయుడు చేరికను స్వాగతిస్తున్నారు. ఇక వైసీపీ దౌర్జన్యం కొనసాగదనీ, ఒక వేళ ఎదురైనా దీటుగా ఎదుర్కోవచ్చనే ధైర్యం వచ్చినట్లు చెబుతున్నారు.  టిడిపిలో చేరిన యస్సీవీ నాయుడు మాత్రం చంద్రబాబు నాయుడు మాట జవదాట కుండా పని చేసి, ఆయన వద్ద మార్కులు కొట్టేసే వ్యూహన్ని అవలంభిస్తున్నారు.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *