శ్రీకాళహస్తి ఘటనపై చంద్రబాబు సీరియస్
సరైన విధంగా స్పందించలేదని అసంతృప్తి
పవన్ పట్ల ఈర్ష పడుతున్న టిడిపి నేతలు
అంజూయాదవ్ కు టిడిపి మద్దతు ?
మండి పడుతున్న జనసేన
శ్రీకాళహస్తి సంఘటనపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సి ఐ అంజూయాదవ్ టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలను కొట్టినా, అవమాన పరచినా టీడీపీ సరైన విధంగా స్పందించలేదని అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడు నరసింహ యాదవ్, పార్లమెంటు ఇన్ ఛార్జ్ బీదా రవిచంద్ర యాదవ్ అదే సామాజిక వర్గానికి చెందిన వారు. కావున అంజూయాదవ్ ఎం చేసినా కిమ్మననలేదు. ఖండన కూడా లేదు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ సంఘటనను బాగా ఉపయోగించుకున్నారు. పవన్ కు పరపతి బాగా పెరిగింది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో చేసింది ఎంలేదు. ఆ కులం ఓట్లకు కక్కుర్తి పడి సి ఐ కి అండగా నిలచారన్న అపవాదు మూట కట్టుకుంది. ఈ విషయం పార్టీ అధినేత చంద్రబాబు పార్లమెంటు ఇన్ ఛార్జ్ బీద రవిచంద్రతో మంగళవారం రాత్రి చర్చించినట్లు సమాచారం. ఈ విషయంలో ఎందుకు స్పందించలేదని నిలతీసినట్లు తెలిసింది. ఒక వర్గం ఓట్ల కోసం చూస్తే మరో వర్గం ఓట్లు దూరం అవుతాయని అన్నట్లు సమాచారం. అన్యాయం జరిగినపుడు తగిన విధంగా స్పందించాలని అన్నట్లు తెలిసింది. నష్ట నివారణ చర్యల పట్ల దృష్టిని సారించాలని చెప్పినట్లు బోగట్టా.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటనను టిడిపి కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారు. ప్రజల్లో పవన్ పట్ల వ్యక్తమైన అనూహ్య స్పందన చూసి టిడిపి నేతల్లో ఈర్ష్య బయట పడుతోంది. తాము లక్షలు ఖర్చు పెట్టినా రాని జనం పవన్ వెంట పరుగులు తీయడం చూసి తట్టుకో లేక పోతున్నారు. పైగా తమ ఓటు బ్యాంకు అయిన యాదవ సామాజిక వర్గానికి చెందిన శ్రీకాళహస్తి సిఐ అంజూ యాదవ్ పై పవన్ ఎస్పీకి ఫిర్యాదు చేసినందున కోపం ప్రదర్శిస్తున్నారు. గతంలో అంజూ యాదవ్ టిడిపి కార్యకర్తల పైన చేయి చేసుకున్న సమయంలో కూడా టిడిపి నేతలు నోరు మెదపలేదు. హోటల్ యజమాని హరినాయుడు భార్య ధనలక్ష్మి పై అర్ధరాత్రి దౌర్జన్యం చేసినప్పుడు పట్టించుకోలేదు. అయితే పవన్ ఆమెపై విమర్శలు చేయడంతో ఒక్క సారిగా టిడిపి నేతలు ఉలిక్కి పడ్డారు. దీని వల్ల ఎన్నికల్లో తమకు నష్టం కలుగుతుందని టిడిపి నేతలు భావిస్తున్నారు.
టిడిపికి ప్రధానంగా కమ్మ, యాదవ సామాజిక వర్గాలే బలం అన్నది ఆ పార్టీ నాయకుల నమ్మకం. అందుకే టిడిపిలో ఉన్న కొంత మంది యాదవ సామాజిక వర్గం నేతలు బిసి సంఘాల ముసుగులో పవన్ పై విమర్శలు గుప్పించారు. అయితే జనసేన కార్యకర్తలు కూడా యాదవ నేతలపై వ్యంగ్య బాణాలు విసిరారు. పుంగనూరు రామచంద్ర యాదవ్ ఇంటిపై దాడి చేసినప్పుడు ఎక్కడ ఉన్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు. దీంతో తిరుపతి టిడిపిలో ఉన్న బలిజ సామాజిక వర్గం నేతలు చంద్రబాబు, ఇక్కడి యాదవ నేతలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. సిఐ అంజూ యాదవ్ ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రవర్తనను ఓట్ల దృష్టితో సహించడం ఎంతవరకు న్యాయం అంటూ ప్రశ్నిస్తున్నారు.
పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్, రెండు పార్లమెంటు నియోజక వర్గాల పరిశీలకుడు బీదా రవిచంద్ర కుల తత్వంతో వ్యవహరిస్తున్నారని బలిజ సామాజిక వర్గం నేతలు విమర్శిస్తున్నారు. రెండు పార్టీల మధ్య ఎన్నికల పొత్తు కుదిరినా రెండు సామాజిక వర్గాల మధ్య వైరం కొనసాగే అవకాశాలు ఉన్నాయని కొందరు టిడిపి కార్యకర్తలు అంటున్నారు.