జనసేన ముద్దు, బిజెపి వద్దు ?
దీంతో రాష్ట్రంలో పొత్తులు ఒక ఆడుకు ముందుకు, రెండు అడుగులు వెనక్కి పడుతున్నాయి. టిడిపి రాజకీయాలలో అనిశ్చిత స్థితి కొనసాగుతోంది. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకోక పోవడంతో కార్యకర్తల పరిస్తితి అగమ్య గోచరంగా మారిపోయింది. 2014 ఎన్నికలలో లాగే 2024 లో టిడిపి జనసేన, బిజెపితో పొత్తు పెట్టుకుని అధికారంలోకి రావాలని చంద్రబాబు భావించారు. ఆ మేరకు పవన్ కళ్యాణ్ తో మూడు దఫాలు చర్చలు జరిపారు. పవన్ కూడా సానుకూలంగా స్పందించారు. జగన్ మోహన్ రెడ్డిని ఓడించడమే లక్షంగా పనిచేస్తామని చెప్పారు. ప్రతిపక్షాల ఓట్లు చీలనీయమని హామీ ఇచ్చారు. అలాగే ఇటీవల చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బిజెపి అగ్రనేతలను కలిశారు. దీంతో రాష్ట్రంలో మూడు పార్టీల మధ్య పొత్తు ఖాయం అన్న ప్రచారం ఊపందుకుంది. టిడిపి రాష్ట్రంలో మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు ఎమ్మెల్యే కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానం గెలవడంతో సానుకూల పవనాలు ప్రారంభం అయ్యాయి. మూడు పార్టీల మధ్య పొత్తు ఉంటుంది అని ప్రచారం జరగడంతో టిడిపి గాలి మరింత ఉదృతం అయ్యింది.
దీంతో టిడిపి నేతలు అతి విశ్వాసంతో పొత్తల మీద అనవసర వ్యాఖ్యానాలు చేశారు. కొందరు అసలు పొత్తు అవసరం లేదంటున్నారు. అయితే ఎక్కువ మంది జనసేనతో పొత్తు మంచిదే కానీ బిజెపికి దూరంగా ఉండటమే మంచిదని ప్రచారం ప్రారంభించారు. బిజెపితో పొత్తు పెట్టుకుంటే మైనారిటీ ఓట్లు కోల్పోవలసి వస్తుందని కొత్త వాదన లేవదీశారు. దీంతో ఇటీవల ఢిల్లీలో జరిగిన ఎన్డీఎ సమావేశానికి టిడిపికి పిలుపు రాలేదు. బిజెపిని వదిలిపెట్టి టిడిపితో పొత్తు పెట్టుకోవటానికి పవన్ సిద్ధంగా లేరని వార్తలు వస్తున్నాయి. పవన్ చంద్రబాబుతో కలవడానికి కూడా ఇష్టపడటం లేదని సోషియల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. దీంతో టిడిపి గాలి బాగా తగ్గిపోయిందని ఆ పార్టీ రాష్ట్ర నేత ఒకరు చెప్పారు. మూడు పార్టీల పొత్తు లేదంటే టిడిపి మళ్ళీ చిత్తు కాక తప్పదని తెదేపా నేతలు కొందరు లెక్కలు కట్టి చెపుతున్నారు. 2014 ఎన్నికల్లో కలసి పోటీ చేయడం వల్ల టిడిపికి 102, వైసిపికి 67, బిజెపికి 4 స్థానాలు గెలిచారు. స్వతంత్ర అభ్యర్ధి, నవోదయ పార్టీకి ఒకటి చొప్పున వచ్చాయి. ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. ఆ ఎన్నికల్లో 25 లోక్ సభ స్థానాలలో టిడిపికి 15, వైసిపికి 8, బిజెపికి 2 వచ్చాయి. అంటే బిజెపి పొత్తు వల్ల టిడిపికి లాభం కలిగిందని అంటున్నారు.
2019 ఎన్నికల్లో మూడు పార్టీలు విడి విడిగా పోటీ చేయడంతో చిత్తుగా ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో 175 ఎమ్మెల్యే స్థానాలలో వైసిపికి 151,టిడిపికి 23, జనసేనకు 1 స్థానం వచ్చింది. లోక్ సభ స్థానాలలో వైసిపికి 22 రాగా టిడిపికి కేవలం మూడు వచ్చాయి. ఈ నేపథ్యంలో మూడు పార్టీల మధ్య పొత్తు ఉంటేనే విజయం సాధ్యమని ఎక్కువ మంది విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అతి విశ్వాసానికి పోయి టిడిపి ఒంటరిగా పోటీ చేస్తే చిత్తుగా ఓడిపోవలసి ఉంటుందని అంటున్నారు. ఒక వేళ జనసేన బిజెపి కలసి పోటీ చేస్తే 20 స్థానాలు పైగా రావచ్చని, టిడిపికి 40 స్థానాలు దాటవని అంటున్నారు. దీంతో తిరిగి జగన్ అధికారంలోకి వస్తారని టిడిపి సీనియర్ నాయకులు కొందరు అభిప్రాయ పడుతున్నారు.
పొత్తు లేకుంటే టిడిపి చిత్తే
పొత్తులు కుదిరితే 2019 ఎన్నికలలో వైసీపీకి చుక్కలు కనబడటం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. ఎలా అంటే 2019లో వైసీపీకి తెలుగుదేశం, జనసేన, బీజేపీలు ప్రత్యర్థులుగా వేరువేరుగా పోటీ చేశాయి. దీంతో ఓట్ల చీలక వల్లనే వైసీపీ అధికారంలోకి రాగలిగింది. పేరుకు 151 స్థానాలలో విజయం సాధించినా, నిజానికి వాటిలో దాదాపు 80 స్థానాలలో ఆ పార్టీ మెజారిటీ వేయి లోపే.. అంటే ఓట్లు చీలిపోవడం వల్ల వైసీపీ సీట్ల పరంగా భారీగా లాభపడింది. అదే వచ్చే ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తు ఉంటే... 2014 ఫలితాలు పునరావృతమయ్యే అవకాశాలే ఎక్కవ ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకు వారు 2019 ఎన్నికల లెక్కలనే ఆధారాలుగా చూపుతున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి 151 స్థానాలలో విజయం సాధించింది కానీ భారీ మెజారిటీ వచ్చిన స్థానాలు మాత్రం 60లోపే. మిగిలిన స్థానాలలో వైసీపీ విజయం వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోవడం వల్లనేనన్నది వారి విశ్లేషణ. మల్లాది విష్ణు కేవలం పాతిక ఓట్ల తేడాతో విజయం సాధించారు. జనసేన, తెలుగుదేశం పార్టీలు వేరువేరుగా పోటీ చేసిన కారణంతో వైసీపీ వ్యతిరేక ఓటు చీలి తెలుగుదేశం నష్టపోయింది. వచ్చే ఎన్నికలలో పొత్తుల వల్లనే కాకుండా.. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉండటం వల్ల కూడా తెలుగుదేశం ఈ సారి భారీగా లబ్ధి పొందే అవకాశం ఉందని అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు విపక్ష ఓటు చీలకుండా పొత్తులు ఉంటే.. వైసీపీ రెండో సారి అధికారంలోకి రావాలన్న కల సాకారమయ్యే అవకాశాలు అంతంత మాత్రమేనని చెబుతున్నారు.