15, జులై 2023, శనివారం

జిల్లాలో బోణి కొట్టడానికి జనసేన వ్యూహం

  

       ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనసేన నెమ్మదిగా పుంజుకుంటోంది. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర విజయవంతం కావడంతో జిల్లా నేతల్లో కూడా ఉత్సాహం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో 
కొందరు నేతలు చాలా చురుగ్గా పార్టీ కోసం పనిచేస్తున్నారు. అధికార పక్షంపై విచుకుపడుతున్నారు. 

       తిరుపతి, శ్రీకాళహస్తి, జి డి నెల్లూరు నియోజక వర్గాలలో టిడిపి కంటే ఎక్కువ పోరాట పటిమ చూపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉంటే కనీసం మూడు స్థానాలైనా దక్కించుకోవాలని పట్టుదలగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఓట్లు, సామాజిక వర్గాల బలం తదితర అంశాలు లెక్కలు కట్టి సీట్లు అడగాలని చూస్తున్నారు. ఆమేరకు తిరుపతి, చిత్తూరు, శ్రీకాళహస్తి, జి డి నెల్లూరు, మదనపల్లి, పుంగనూరు స్థానాలపై దృష్టి పెట్టారు. గత ఎన్నికల్లో జిల్లాలో అందరికంటే పుంగనూరు అభ్యర్థి రామచంద్ర యాదవ్ ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నారు. ఆ ఎన్నికల్లో అయనకు 16,452 ఓట్లు వచ్చాయి. అయితే ఎన్నికల తరువాత ఆయన పార్టీ వీడి బిజెపిలో చేరారు. ఇప్పుడు స్వంత పార్టీ పెట్టే యోచనలో ఉన్నారు. కాబట్టి ఆ స్థానంలో సందిగ్ధత నెలకొన్నది. మదనపల్లి నియోజక వర్గంలో పోటీ చేసిన జనసేన అభ్యర్ధి గంగారపు స్వాతికి 14,601 ఓట్లు వచ్చాయి. ఈ సారి ఆమె భర్త గంగారపు రామదాసు చౌదరి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆ మేరకు కార్యక్రమాలు చేపట్టి చురుగ్గా నిర్వహిస్తున్నారు. 

            ఇక తిరుపతి నియోజక వర్గం తమదే అన్న ధీమా  జనసేన నేతల్లో కనిపిస్తున్నది. ఇక్కడ బలిజ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నాయి. 2009 ఎన్నికల్లో  పీఆర్పీ అధినేత చిరంజీవి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డిపై15,930 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన చదలవాడ కృష్ణ మూర్తికి 12,315 ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ పోటీ చేస్తే గెలుపు తథ్యమని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు. దీనితో నియోజక వర్గం ఇంచార్జి కిరణ్ రాయల్, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ హరిప్రసాద్ టిక్కెట్టు రేసులో ఉన్నారు. 

            శ్రీకాళహస్తిలో తిరిగి పోటీ చేయాలని నగరం వినుత ఆసక్తితో ఉన్నారు. గత ఎన్నికల్లో ఆమెకు 5,274 ఓట్లు వచ్చాయి. ఎన్నికల అనంతరం ఆమె నియోజక వర్గంలో కష్టపడి పార్టీ కోసం పనిచేస్తున్నారు. జి డి నెల్లూరు ఇంచార్జి డాక్టర్ పొన్న యుగంధర్ పోటీకి సిద్ధపడుతున్నారు. ఇక్కడ టిడిపి నేతలు వర్గ పోరుతో సతమతం అవుతున్నారు. అయితే యుగంధర్ అడుగడుగునా ఉప ముఖ్య మంత్రి నారాయణ స్వామిపై పోరాటం చేస్తున్నారు. చిత్తూరులో జనసేన తగిన అభ్యర్థిని బరిలోకి దింపాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇక్కడ టిడిపి చాలా బలహీనంగా ఉంది. ఇప్పటి వరకు ఇక్కడ  చంద్రబాబు ఇంచార్జిని కూడా నియమించలేదు. దీనితో   మాజీ ఎమ్మెల్యే, మరో మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల పేర్లు జనసేన పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. ఇదిలా ఉండగా జిల్లాలో ఎన్ని స్థానాలు పోటీ చేసినప్పటికీ కుల సమానత పాటించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. బలిజ సామాజిక  ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ ఒక రెడ్డికి అయినా టిక్కెట్టు ఇవ్వాలని, భావిస్తున్నారు. అలాగే ఎస్సీ, కమ్మ, బిసి సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం కల్పించాలని ఆలోచిస్తున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *