టిడిపి కోటలో బిసిలకు చోటేది బాబు !?
టిడిపిని బిసిల పార్టీ అంటుంటారు. బడుగు బలహీన వర్గాల ఆత్మ గౌరవం నుండి TDP పుట్టింది అంటారు. BCలు అంటే బలహీన వర్గాలు కాదు, పార్టీకి బ్యాక్ బోన్ అని అంటారు. అంటే.. బలహీన వర్గాలను పార్టీకి వెన్నెముకగా అభివర్ణిస్తుంటారు. బలహీన వర్గాల అభ్యున్నతే, పార్టీ ధ్యేయం అంటారు. బలహీన వర్గాలకు రాజ్యాధికారం సిద్ధించినపుడే నిజమైన ప్రజాస్వామ్యం అంటారు. పార్టీ నిర్మాణం అయ్యింది బడుగుల పునాదుల మీద అంటారు. BCల ఆత్మ గౌరవాన్ని కాపాడడానికే పార్టీ పురుడు పోసుకుంది అంటారు. పార్టీలో పదవులు తీసుకోవడానికి BCలు ముందు ఉండాలి అంటారు. పార్టీ పదవులు మాత్రం ఇస్తారు. పార్టీకి వెట్టి చాకిరీ చేపించుకుంటారు. ఆందోళనలు, బంద్ లు, రాస్తారోకోలు, ధర్నాలు జరిగితే ముందు ఉండేది బలహీన వర్గాలు. పోలిసుల చేత దెబ్బలు, తన్నులు తినేది BCలు. కేసులు పెట్టించుకోనేది BCలు. జండాలు మోసేది కూడా BCలే.
ఎన్నికలు వచ్చే సరికి టిక్కెట్లు మొత్తం OCలకే. అదేమంటే .. కుల బలం లేదంటారు. ధన బలం లేదంటారు. టిక్కెట్టు ఇచ్చినా, ఓడిపోతారు అంటారు. ఓడిపోయే వారికీ టిక్కెట్టు ఎలా ఇస్తాం అంటారు. చివరకు ప్రచార భాధ్యతలు భుజం మీద మోపుతారు. అభ్యర్థిని గెలిపిమ్చుకొని వస్తే, తగిన ప్రాధాన్యత ఇస్తామంటారు. ఇలా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బిసిలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం లేదన్న విమర్శులు వినిపిస్తున్నాయి. జిల్లాలోని 14 నియోజక వర్గాలలో కేవలం ఒకే ఒక స్థానంతో సరి పెడుతున్నారు. 2014 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ బిసిలకు తగిన గుర్తింపు ఇవ్వలేదని లెక్కలు కట్టి చెపుతున్నారు. జిల్లాలో బిసి వర్గానికి చెందిన గౌనివారి శ్రీనివాసులు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. అయితే కమ్మ సామాజిక వర్గానికి చెందిన గాలి ముద్దుకృష్ణమ నాయుడు, దొరబాబు ఇద్దరిని ఎమ్మెల్సీలుగా చేశారు.
జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత బిసి వర్గానికి చెందిన భరత్, డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం ఇద్దరికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో జగన్ బిసి వర్గానికి చెందిన చంద్రమౌళికి కుప్పం, వెంకటేగౌడకు పలమనేరు టిక్కెట్లు ఇచ్చారు. చంద్ర బాబు మాత్రం కేవలం శంకర్ యాదవ్ ఒకరికి తంబళ్లపల్లె టిక్కెట్ ఇచ్చి సరిపెట్టుకున్నారు. ఆ ఎన్నికల్లో మూడు రిజర్వుడు నియోజక వర్గాలు పోను నలుగురు కమ్మ, నలుగురు రెడ్లు, ఇద్దరు బలిజ సామాజిక వర్గం వారికి చంద్ర బాబు టిక్కెట్లు ఇచ్చారు. దీనితో బీసీల్లో చాలా మంది వైసిపికి ఓట్లు వేయడం వల్ల చంద్రబాబు తప్ప మిగిలిన స్థానాలలో వైసిపి అభ్యర్ధులు విజయం సాధించారు. ఈసారి అయిన బిసిలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతున్నారు.
శ్రీకాళహస్తిలో రెడ్లు, కమ్మ వారికంటే అధికంగా ఉన్న వన్నెకుల క్షత్రియులకు టిక్కెట్టు ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ వర్గానికి చెందిన రాష్ట్ర కార్యదర్శి రెడ్డివారి గురావా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముని రామయ్య టిక్కెట్టు ఆశిస్తున్నారు. కుప్పంలో ఈ వర్గం ఓటర్లు 35 వేలకు పైగా ఉన్నాయని అంటున్నారు. కాబట్టి శ్రీకాళహస్తిలో ఆ వర్గం వ్యక్తికి టిక్కెట్టు ఇస్తే చంద్రబాబుకు కూడా మంచిదని విశ్లేషిస్తున్నారు. తిరుపతిలో బలిజ సామాజిక వర్గం తరువాత అధికంగా ఉన్న యాదవ సామాజిక వర్గం వారికి టిక్కెట్ ఇవ్వాలన్న డిమాండ్ టిడిపి కార్యకర్తల్లో వినిపిస్తున్నది. జగన్ తిరుపతి మేయర్ గా యాదవ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ శిరీష యాదవ్ కు అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ టిడిపి టిక్కెట్ ఆశిస్తున్నారు. తిరుపతి వీలుకాక పోతే పక్కనే ఉన్న చంద్రగిరి అయినా యాదవ వర్గానికి కేటాయించాలని కొందరు కోరుతున్నారు.
నగరిలో కమ్మ సామాజిక వర్గం కంటే, బిసిలు అయిన రాజుల ఓట్లు అధికంగా ఉన్నాయి. కాబట్టి అక్కడ ఆ వర్గం లేదా మొదలియార్, కైకల సామాజిక వర్గం వారికి టిక్కెట్టు ఇస్తే గెలుపు సాధ్యం అంటున్నారు. ఈ నేపథ్యంలో సిద్దార్థ విద్యా సంస్థల అధినేత అశోక్ రాజు, రాష్ట్ర కార్యదర్శి పాకా రాజా టికెట్టు ఆశిస్తున్నారు. చిత్తూరులో కూడా తమిళ బిసిలు అధికంగా ఉన్నారని, వారిలో ఒకరికి టిక్కెట్టు ఇవ్వాలని కోరుతున్నారు. గతంలో బిసి వర్గానికి ( గాండ్ల) చెందిన ఆర్ గోపీనాథ్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. తంబళ్లపల్లెలో తిరిగి శంకర్ యాదవ్ కు టిక్కెట్టు ఇచ్చే అవకాశం ఉన్నందున కనీసం మరో రెండు స్థానాలైనా బిసిలకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. బస్సు కండక్టర్ గా ఉన్న బిసి సామాజిక వర్గానికి చెందిన బగ్గిడి గోపాల్ ను 1983లో NTR పుంగనూరులో పోటీ పెట్టి ఎమ్మెల్యేగా గెలిపించారు. అయితే చంద్రబాబు పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాత జిల్లాలో బిసిలకు ప్రాతినిధ్యం తగ్గిందని అంటున్నారు.
బీసీలను కోట చుట్టూ కాపలా దారులుగా పెట్టుకోవడం మాని కోటలోకి ప్రవేశం కల్పించాలని కోరుతున్నారు. జిల్లాలో కమ్మ సామాజిక వర్గానికి తగ్గించి, బిసిలకు ఎక్కువ స్థానాలు ఇచ్చినపుడే ఆ వర్గాలలో టిడిపి పట్ల విశ్వాసం పెరుగుతుందని అంటున్నారు. MPTC, ZPTC లతో పాటు MLAలలో కూడా తగిన న్యాయం చేసినప్పుడే BCలకు సామాజిక న్యాయం జరుగుతుందని, పార్టీ మీద నమ్మకం కలుగుతుందని అభిప్రాయపడుతున్నారు.

