చింతల, నల్లారిలో గెలుపు ఎవరిది ?
గెలుపు కోసం కిశోర్ పోరాటం
హ్యాట్రిక్ కోసం చింతల ఆరాటం
కిశోర్ గెలువకుండా పెద్దిరెడ్డి వ్యూహం
పీలేరు రాజకీయం రసవత్తరం
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పీలేరు నియోజక వర్గంలో ఈ సారి పైచేయి ఎవరిదన్న చర్చ ఆశక్తికరంగా మారింది. మాజీ ముఖ్య మంత్రులైన నారా చంద్రబాబు నాయుడు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబాలను ఓడించాలన్న లక్ష్యంతో మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఉన్నారు. కుప్పంలో బాబును ఓడించడానికి జోరుగా పావులు కదుపుతున్నారు. తన పాత నియోజక వర్గం పీలేరులో కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డిని ఓడించాలని కంకణం కట్టుకున్నారు. నల్లారి కుటుంబం అసెంబ్లీ మెట్లు ఎక్కకూడదని కృతనిశ్చయంతో ఉన్నారు. ఇరు కుటుంబాల మధ్య ఉన్న రాజకీయ వైరం అలాంటిది. కిరణ్ కుమార్ రెడ్డి 2009లో పీలేరులో గెలిచి ముఖ్య మంత్రిగా అవకాశం పొందారు. ఆయన ఇప్పుడు బిజెపిలో ఉన్నారు. పీలేరులో ఆయన తమ్ముడు కిషోర్ టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తారు. ఈ నేపథ్యంలో ఆయనను ఎలాగైనా ఓడించాలని పెద్దిరెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. అవసరం అయితే తన తమ్ముడు భాస్కర్ రెడ్డి తనయుడు సుధీర్ రెడ్డిని వైసిపి అభ్యర్థిగా రంగంలోకి దింపుతారాన్న ప్రచారం కూడా జరుగుతున్నది. అయితే మంచి పేరున్న చింతల రామచంద్రా రెడ్డినే పోటీ పెట్టి గెలిపిస్తారని కొందరు అంటున్నారు.
కిషోర్ పై విజయం సాధించ దానికి అవసరమైన అన్ని అస్త్రాలను సమకూర్చుకుంటున్నారు. అందుకే మాజీ ఎమ్మెల్యే జి వి శ్రీనాధ రెడ్డిని కూడా పట్టుబట్టి పార్టీలో చేర్పించారు. 2009లో పిఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసి మూడవ స్థానంలో నిలిచిన చింతల తరువాత జరిగిన రెండు ఎన్నికల్లో కిషోర్ కుమార్ రెడ్డిపై విజయం సాధించారు. 2014 లో జె ఎస్ పి అభ్యర్థిగా పోటీ చేసిన కిషోర్ పై 15,313 ఓట్ల ఆధిక్యం సాధించారు. 2019 లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన ఆయనపై 7,874 ఓట్ల మెజారిటీ తెచ్చుకున్నారు. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. అయితే ఈసారి తన గెలుపు నల్లేరు మీద నడకలా ఉంటుందని కిషోర్ కుమార్ రెడ్డి ధీమాగా ఉన్నారు. ఆయన తండ్రి అమరనాద రెడ్డి మంత్రిగా పనిచేశారు. అన్న కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. 40 సంవత్సరాల నుంచి వారి కుటుంబం రాజకీయాలలో ఉన్నందున అయనకు బలమైన వర్గం మద్దతు ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో టిడిపి గాలి వీస్తున్నందున గెలుపు సులభమని భావిస్తున్నారు.
నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి కుటుంబానికి రద్దు అయిన వాయల్పాడు నియోజకవర్గంలో గట్టి పట్టు ఉంది. కిశోర్ తండ్రి నల్లారి అమర్నాథ రెడ్డి 1972, 1978, 1985 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున MLAగా గెలుపొందారు. కిశోర్ అన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 1989, 1999, 2004 ఎన్నికలలో విజయం సాధించారు. అమరనాధ రెడ్డి మంత్రిగా పనిచేయగా, కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, జిల్లా రాజకీయాలు అన్ని కిశోర్ కుమార్ రెడ్డి కనుసన్నల్లో నడిచాయి. కిశోర్ ను అప్పుడు షాడో CM అని కూడా వ్యవహరించారు. రాష్ట్ర విభజన తరువాత కిశోర్ తెదేపాలో చేరి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు. రెండు సార్లు చింతల చేతిలో ఓడిపోయిన కిశోర్ ఈ పర్యాయం ఎలాగైనా గెలిచి, అసెంబ్లీలో అడుగుపెట్టాలని పావులు కదుపుతున్నారు.
చింతల రామచంద్రా రెడ్డి తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఆయనది కూడా రాజకీయ కుటుంబమే. తండ్రి చింతల సురేంద్ర రెడ్డి ఇండిపెండెంట్ MLAగా 1983 లో వాయల్పాడు నియోజకవర్గం నుండి గెలుపొందారు. రామచంద్రా రెడ్డి తెదేపా అభ్యర్థిగా 1994 లో విజయం సాధించారు. చింతల TDP జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. సౌమ్యుడు అయిన చింతలకు నియోజకవర్గంలో మంచి పరిచయాలు ఉన్నాయి. YCP ఆవిర్భావం తర్వాత YCPలో చేరి పీలేరు నియోజకవర్గం నుండి వరుసగా రెండు సార్లు MLAగా ఎన్నికయ్యారు. మూడవ సారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని గట్టి పట్టుదలతో ఉన్నారు.
ఇటీవల జరిగిన లోకేష్ పాదయాత్రకు విశేషంగా జనం వచ్చారు. అన్ని నియోజక వర్గాల కంటే పీలేరులో ఎక్కువ జనం భారీగా రావడం ప్రజల్లో ఉన్న ఆదరణకు చిహ్నంగా చెపుతున్నారు. నియోజక వర్గంలో అన్ని వర్గాలలో తనకు పట్టు ఉందని కిషోర్ భావిస్తున్నారు. పుంగనూరులో పెద్దిరెడ్డిని కట్టడి చేయడానికి వ్యూహం రూపొందించారు. అందుకే రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబానికి చెందిన చల్లా రామచంద్రా రెడ్డిని పుంగనూరు ఇంచార్జిగా నియమించడంతో కిషోర్ కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో పీలేరులో పోటీ నువ్వా నేనా అన్నట్టు ఢీ అంటే ఢీ కొట్టేలా ఉన్నాయి. నల్లారి అసెంబ్లీ మెట్లు ఎక్కుతారా ? చింతల హ్యాట్రిక్ కొడుతరా? అన్నది వేచి చూడాల్సిందే.