19, జులై 2023, బుధవారం

టీడీపీ కోసం పవన్ రాయబారం

 

         రానున్న ఎన్నికల్లో  జగన్ ను ఎలాగైనా ఓడించాలన్నది  చంద్రబాబు, పవన్ ఆలోచన. ఇందుకు విపక్షాల ఓట్లు చీలకుండా చూడాలన్నది  పవన్ ఆకాంక్ష. బీజేపీతో ఓట్ల పరంగా ప్రయోజనం లేకపోయినా, ఎలక్షన్ మేనేజ్ మెంట్ లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తోడుగా ఉండాలని భావిస్తున్నారు. బీజేపీ ఏ పరిస్థితుల్లోనూ జగన్ కు అనుకూలంగా ఉండకూడదనేది చంద్రబాబు, పవన్ లక్ష్యం. ఈ వ్యూహం అమలు చేయడానికి పవన్ ఢిల్లీలో శ్రీకృష్ణుడి అవతారం ఎత్తారు. టీడీపీ, బీజేపీల మధ్య తెగిపోయిన పాత బంధాలను పునరుద్ధరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇద్దరికి మైత్రి కుదార్చాలని గట్టి కృషి చేస్తున్నారు. ఎలాగైనా తిరిగి NDA లో TDP చేరితే తమ లక్ష్యం, కృషి నెరవేరుతుందని భావిస్తున్నారు. అప్పుడే జగన్ ను గద్దె దించడం సులువు అనే భావన ఉంది.

                అందులో భాగంగానే బీజేపీకి మిత్రపక్షంగా కొనసాగుతూనే టీడీపీతోనూ కలిసేందుకు బీజేపీ నేతలతో పవన్ మంతనాలు చేసారు. కొంత మేర సఫలం అయినట్లు కనిపించినా..ఫలితం మాత్రం రాలేదు. ఇప్పుడు పవన్ కు బీజేపీకి మరింత దగ్గరయ్యి తన మిత్రుడు చంద్రబాబును దగ్గర చేయదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలనేది చంద్రబాబు...పవన్ ఆలోచన. ఈ దిశగానే ప్రయత్నాలు జరిగాయి. వారాహి యాత్రలో పవన్ ఎక్కడా పొత్తుల గురించి ప్రస్తావన చేయకపోయినా టీడీపీతో కలిసి వెళ్లటం ఖాయమనే ప్రచారం సాగుతోంది. ఈ సమయంలో బీజేపీ పాత్ర ఏంటనేది స్పష్టత రావటం లేదు. ఎన్డీఏ మిత్రపక్షాలతో ప్రధాని మోదీ భేటి అయ్యారు. పాత మిత్రులకు బీజేపీ నుంచి ఆహ్వానాలు అందాయి. టీడీపీకి పిలుపు లేదు. జనసేనతో మాత్రమే తమకు పొత్తు ఉంటుందని బీజేపీ స్ఫష్టం చేస్తోంది. బీజేపీ, టీడీపీని కలిపేందుకు పవన్ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికైతే సఫలం అయినట్లు కనిపించటం లేదు.

           అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి  జనసేనాని పవన్ కొత్త బాధ్యతల్లో కనిపిస్తున్నారు. సీఎం జగన్ లక్ష్యంగా రాజకీయం చేస్తున్న పవన్ కల్యాణ్ ఇప్పుడు టీడీపీని బీజేపీకి దగ్గర చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే ఈ దిశగా అడుగులు వేసినా ఫలితం కనిపించ లేదు. బీజేపీతో పొత్తు కొనసాగిస్తున్న పవన్ అటు టీడీపీతో బంధం పైన ఎక్కవ ఆసక్తితో కనిపిస్తున్నారు. ఈ సమయంలో ఎన్డీఏ భేటీలో పాల్గొన్న జనసేనాని ఆ తరువాత ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. మూడు పార్టీల పొత్తు దిశగా గతంలోనే పవన్ వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా బాధ్యత తీసుకుంటానని ప్రకటించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయనే విశ్వసం వ్యక్తం చేసారు. బీజేపీ, టీడీపీ మధ్య సయోధ్య దిశగా ప్రయత్నాలు చేసారు. ఆ తరువాత హోం మంత్రి అమిత్ షా, జేపీ నడ్డాతో ఢిల్లీలో చంద్రబాబు భేటీతో ఇక పొత్తు ఖాయమనే ప్రచారం సాగింది.

             కానీ, కీలకమైన ఎన్డీఏ మీటింగ్ కు బీజేపీ నాయకత్వం టీడీపీని ఆహ్వానించ లేదు. జనసేనాని పవన్ ను ఆహ్వానించి తమ ఉద్దేశం ఏంటనేది స్పష్టం చేసింది. కానీ, పవన్ మాత్రం టీడీపీని తమతో కలుపుకొని వెళ్లాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే ఎన్డీఏ సమావేశానికి హాజరైన తన వంతు ప్రయత్నాలు కొనసాగించాలని నిర్ణయించారు. తాజాగా ఢిల్లీలోనూ తన పొత్తు ఆలోచనలను స్పష్టం చేసారు. పవన్ ప్రయత్నాలు ఫలించేనా బీజేపీ-టీడీపీ మధ్య  సీట్ల సర్దుబాటు సమస్యలు ఉన్నాయని పవన్ అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చటానికి మరోసారి మోదీకి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు. ఒక వైపు మోదీ నాయకత్వానికి మద్దతుగా నిలుస్తున్న పవన్ అటు చంద్రబాబును తమతో కలుపుకొనే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు


              ఎన్డీఏ సమావేశంలోనూ పవన్ ప్రధాని మోదీ నాయకత్వానికి మద్దతు ప్రకటించారు. మోదీ నాయకత్వంలో దేశం మరింత బలోపేతం కావాలని..అందుకు సంపూర్ణ మద్దతు ఇస్తామని పవన్ సమావేశంలో హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని బయటా చెప్పారు. దేశ పరిస్థితులపైనే సమావేశంలో చర్చ జరిగిందని, రాష్ట్ర పరిధిలోని అంశాలు చర్చించలేదన్నారు. ఏపీ నుంచి ఎన్డీఏలోకి కొత్త పార్టీలను చేర్చుకొనే అంశం చర్చకు రాలేదని పవన్ స్పష్టం చేసారు. అయితే, ఎన్డీఏ ఏర్పాటై 25 ఏళ్లు పూర్తయింది. నాడు ఎన్డీఏలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు అలాంటి చంద్రబాబుకు ఎన్డీఏలోకి రీ ఎంట్రీ కోసం పవన్ ప్రయత్నం చేయటం..ఇప్పుడు  బీజేపీ పిలుపు కోసం టీడీపీ అంతగా ఎదురుచూడటం  రాజకీయ వర్గాలలో ఆశక్తికర చర్చకు దారితీసింది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *