జూనియర్ NTRకు BJP గాలం ?
రాష్ట్ర BJP భాధ్యతలు పురంధేశ్వరికి అప్పగిస్తే జూనియర్ ఎన్టీఆర్‌ను దగ్గర చేసుకోవచ్చని బాజాపా కేంద్ర పెద్దల వ్యూహంగా తెలుస్తుంది. పార్టీకి సినీ గ్లామర్ కూడా కలిసొస్తుందని లెక్కలేసుకున్నట్టు సమాచారం. టీడీపీ కార్యక్రమాలకు, చంద్రబాబు నాయుడుకు దూరంగా ఉన్న జూ. ఎన్టీఆర్‌ను తమవైపు తిప్పుకునే పనిలో బీజేపీ ఉన్నట్లు తాజా పరిణామాల బట్టి తెలుస్తోంది. సినీ రంగంలో, రాజకీయ రంగంలో NTRకు జూనియర్ NTR వారసుడని సినీ అభిమానుల్లో, రాజకీయ అభిమానులు బలంగా భావిస్తున్నారు. ఈ మేరకు తెలుగు ప్రజలు, అభిమానులు జూ.ఎన్టీఆర్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దీనిని BJPకి అనుకూలంగా మర్చుకోవదనికే, పురంధేశ్వరికి బీజేపీ పగ్గాలు అప్పగించినట్లు సమాచారం. RRR సినిమా సందర్భంగా.. స్వయంగా జూ. ఎన్టీఆర్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా కలిసి సన్మానించారు. ఈ నేపథ్యంలో జూ. ఎన్టీఆర్‌కు మేనత్త అయిన పురంధేశ్వరి ద్వారా బీజేపీ అధిష్ఠానం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నాటికి తారక్‌ను పార్టీ సానుభూతి పరుడిగా మార్చి తద్వారా వచ్చే ఎన్నికల్లో గణనీయంగా లబ్ధిపొందాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది.
తెలుగు దేశం పార్టీకి నిజమైన వారసుడు జూనియర్ NTR అని పలువురు నమ్ముతున్నారు. NTR రూపం, హావ భావాలు, వాక్పటిమ NTRను గుర్తుకు తెస్తుందని అంటుంటారు. TDPకి మళ్ళి పూర్వ వైభవం రావాలంటే జూనియర్ NTR పార్టీలో క్రియాశీలకంగా ఉండాలని ఆశిస్తున్నారు. జూనియర్ మాత్రం పార్టీ కార్యక్రమాలకు అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కుప్పం నుండి ప్రారంభం అయినా నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభానికి నారా, నందమూరి కుటుంబ సభ్యులు అందరూ హాజరైనా, జూనియర్ మాత్రం రాలేదు. లోకేష్ భవిషత్తు దృష్ట్యా జూనియర్ ను పార్టీ పరంగా పక్కన పెట్టారనే ప్రచారం ఉంది. పార్టీకి తన తండ్రికి కూడా సరైన న్యాయం జరగలేదని జూనియర్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే పార్టీలో జరుగుతున్న పరిణామాలను జూనియర్ మౌనంగా పరిశీలిస్తున్నట్లు చెపుతారు. ఈ నేపధ్యంలో జూనియర్ ను మెల్లిగా తమ పార్టీ వైపు తిప్పుకోవడానికి BJP వ్యూహత్మకంగా పురందేశ్వరి ద్వారా పావులు కదపడానికి సిద్దం అయినట్లు తెలుస్తుంది.
తెలుగుదేశం నాయకత్వాన్ని కట్టడి చేసేందుకు కూడా పురంధేశ్వరి నియామకం దోహదపడుతుందని బాజాపా నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తుంది. మొన్నటివరకూ చంద్రబాబు నాయకత్వాన్ని పురంధేశ్వరి వ్యతిరేకిస్తూ వచ్చారు. కానీ ఇటీవల చంద్రబాబు కుటుంబంతో దగ్గరయ్యారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేస్తారని ప్రచారం సాగింది. వాటన్నింటినీ బ్రేక్ చేస్తూ బీజేపీ అగ్రనాయకత్వం ఏకంగా రాష్ట్ర పగ్గాలనే అప్పగించింది. పొత్తు ఉన్నా, లేకపోయినా టీడీపీకి ధీటైన నాయకత్వాన్ని తయారుచేయాలన్న ఉద్దేశ్యంతోనే బీజేపీ హైకమాండ్ ఒక వ్యూహం ప్రకారం నడుచుకున్నట్టు పురంధేశ్వరి నియామకంతో తేటతెల్లమైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలోని అసంతృప్తిగా ఉన్న కమ్మ నాయకులను ఆమె బీజేపీ గూటికి తెచ్చే అవకాశముందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రాజకీయాలపై ఆశక్తి ఉండి, అవకాశం లేని కమ్మ తటస్థ నాయకులను సైతం ఆకర్షించే చరిష్మ పురంధేశ్వరి సొంతం. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వంతో పనిచేసిన అనుభవం ఉంది. రాష్ట్ర విభజన తరువాత టీడీపీ, వైసీపీలో అవకాశాలు లేని చాలామంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉండిపోయారు. అటువంటి వారు పురంధేశ్వరి చొరవతో బీజేపీలోకి వచ్చేందుకు సుముఖత చూపుతారని భావిస్తున్నారు.
ఆర్థికంగా బలమైన సామాజిక వర్గానికి చెందిన పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలైతే.. కేంద్ర మంత్రిగా పని చేసిన అనుభవం కూడా బాగా ఉపయోగపడుతుందని భావించి హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో బీజేపీ ప్రధాన ప్రత్యర్థి పార్టీల్లో ఒకటైన టీడీపీకి చంద్రబాబు అధ్యక్షులుగా ఉన్నారు. సీఎం జగన్ మరో బలమైన సామాజికవర్గ నేతగా ఉన్నారు. జనసేనాని పవన్ కల్యాణ్‌తో పొత్తు కూడా ఉంది. ఈ క్రమంలో కాపు సామాజికవర్గం కూడా బీజేపీకి అనుకూలంగా మారుతుందనే ప్రణాళికలో కేంద్ర పెద్దలు ఉన్నట్లు ప్రస్తుత మార్పు కనిపిస్తోంది. పురందేశ్వరి ఎంపిక వెనుక పక్కా వ్యూహం ఉందని స్పష్టమవుతోంది. టీడీపీకి ప్రధాన ఓట్ బ్యాంక్‌గా ఉన్న ఒక ప్రధాన సామాజిక వర్గంపైన ప్రభావం చూపటంతో పాటుగా.. ఆ వర్గ ఓట్లను బీజేపీ వైపు ఆకర్షించేందుకు పురందేశ్వరికి బాధ్యతలు ఇచ్చారనే వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే టీడీపీకి మూలమైన నందమూరి కుటుంబంతో పాటుగా.. ఆ కుటుంబసభ్యులకి మద్దతిచ్చే ఓట్ల పైన బీజేపీ గురి పెట్టినట్లు స్పష్టం అవుతోంది.