17, జులై 2023, సోమవారం

పార్టీ క్యాడర్ లో జోష్ నింపిన జనసేనాని తిరుపతి పర్యటన



                     జనసేనాని తిరుపతి పర్యటన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలలో ఆత్మస్థైర్యాన్ని నింపింది. పార్టీ క్యాడర్ కు ఎం జరిగినా, అధినేత ఉన్నారని భరోసా కల్పించింది. పార్టీ క్యాడర్ మరింత చురుగ్గా పనిచేయడానికి  ఉత్సాహం నింపింది. అధినేత ఆదుకుంటారన్న నమ్మకం, విశ్వాసం పార్టీలో  కలిగింది. మరో వైపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రతిష్టను ఇనుమడింపచేసింది. పవన్ వ్యవహార శైలి ఇతర పార్టీలు, ముఖ్యంగా తెదేపాకు చెంపపెట్టుగా మారింది. అంజూయాదవ్ అకృత్యాలు శ్రీకాళహస్తిలో నిత్యకృత్యాలు. తెదేపా నాయకులు, కార్యకర్తలకు అవమానాలు జరిగినా, ఆ పార్టీ తగిన విధంగా స్పందించలేదని విమర్శలు ఉన్నాయి.

                  సోమవారం తిరుపతి వచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భారీ స్థాయిలో ప్రజలు స్వాగతం పలికారు. తమ పార్టీ కార్యకర్త కొట్టే సాయిపై చేయిచేసుకున్న శ్రీకాళహస్తి సిఐ అంజూ యాదవ్ పై జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డికి ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక విమానంలో వచ్చారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, ఇతర నాయకులతో కలిసి విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. అనంతరం పవన్  ర్యాలీగా తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. 

               సిఐ అంజు యాదవ్‌ పై  ఫిర్యాదు చేశారు. శ్రీకాళహస్తికి చెందిన పార్టీ కార్యకర్త కొట్టె సాయిపై చేయి చేసుకున్న సిఐ పై  కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  ఆయనతో పాటు నాదెండ్ల మనోహర్, జిల్లా నాయకులు డాక్టర్ హరిప్రసాద్, కిరణ్ రాయల్, రాజా రెడ్డి, కొట్టే సాయి తదితరులు ఉన్నారు. అయితే ఈ పర్యటన పవన్ ప్రతిష్టను అనూహ్యంగా పెంచి వేసింది. ఆయన పర్యటన రెండు రోజుల ముందు తెలిసినప్పటికీ వేలాది మంది ప్రజలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలి రావడం రాజకీయ చర్చకు దారి తీసింది. విమానాశ్రయం నుంచి బయలు దేరిన ఆయన భారీ కాన్వాయ్ కి అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పట్టారు. గజమాలలతో సత్కరించారు.

              ఇటీవల లోకేష్ పాదయాత్రకు, ఏడాది క్రితం చంద్ర బాబుకు రోడ్ షోకు వచ్చిన వారి కంటే నాలుగు రెట్లు ఎక్కువ జనం వచ్చారని పరిశీలకులు భావిస్తున్నారు. లోకేష్ పాదయాత్ర సందర్భంగా 20 లక్షలు ఖర్చు చేస్తే 1500 మంది వచ్చారని, పవన్ సభకు రూపాయి ఖర్చు లేకుండా ఆరు వేలకు పైగా జనం రావడం ఆశ్చర్యంగా  ఉందని టిడిపి నేత ఒకరు వ్యాఖ్యానించారు.  ఈ నేపథ్యంలో పవన్ ఒంటరిగా పోటీ చేసినా టిడిపి కంటే ఎక్కువ సీట్లు వస్తాయని కొందరు అభిప్రాయ పడుతున్నారు.  ఒక కార్యకర్తకు అన్యాయం జరిగితే ప్రత్యేక విమానంలో వచ్చి నేను ఉన్నాను అన్న భరోసా కల్పించిన పవన్ తీరును ప్రజలు కొనియాడుతున్నారు. ఇదిలా ఉండగా ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి అంజూ యాదవ్ దురాగతాలపై నోరు మెదపక పోవడం విమర్శలకు తావిస్తున్నది. గతంలో ఆమె టిడిపి కార్య కర్తను కూడా చెంపలు వాయించింది. గత ఏడాది శ్రీకాళహస్తిలో ఒక హోటల్ యజమాని భార్యను నడిరోడ్డుపై పైట లాగి కొట్టింది. ఇటీవల ఒక వీడియో తీస్తూ తొడ తట్టి పగల బడి  నవ్వుతూ వికటాట్టహాసం చేసింది. ఇప్పుడు ఈ వీడియోలు సోషియల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

                   అయినా చంద్రబాబు, లోకేష్, ఇతర నాయకులు ఎవరూ పవన్ లాగా స్పందించక పోవడం విమర్శలకు తావిస్తున్నది. ఒక సామాజిక వర్గం ఓట్లకు కక్కుర్తి పడి టిడిపి దిగజారి వ్యవహరిస్తున్నదని, ఇలాంటి చర్యల వల్ల పార్టీ ప్రతిష్ట దిగజారిందని కొందరు ఆవేదన వ్యక్తంచేశారు. తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు, జోనల్ ఇన్ ఛార్జ్ కూడా అదే సామాజిక వర్గానికి చెందడంతో టీడీపీ స్పందించాల్సిన విధంగా స్పందించలేదనని ఆరోపణలు ఉన్నాయి. నాయకుడు అంటే పవన్ అన్న విధంగా ప్రజలు కొనియాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తిరుపతిలో కానీ, ఉమ్మడి జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా, జనసేన అభ్యర్థులకు భారీ మెజారిటీ తప్పదని పలువురు అంటున్నారు. 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *