వర్గపోరుతో తిరుపతి టీడీపీ సతమతం
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసిపితో పోల్చుకుంటే టిడిపి బలహీనంగా ఉంది. ఇందులో భాగంగా కొత్తగా ఏర్పడిన తిరుపతి జిల్లాలో టిడిపి పరిస్థితి అంత బాగా లేదు. దీనికి తోడు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ రధసారధులుగా వున్న ఇన్ చార్జ్ ల విన్యాసాలు చిత్ర విచిత్రంగా వున్నాయి. లాబీ చేసిన కొత్త వారిని పార్టీలోనికి ఆహ్వానించి కలుపుకుపోతూ, పార్టీలో ఉన్న పాత వారితో సఖ్యతగా మెలగి పార్టీని పరిపుష్టి చేయడం లేదు. మున్ముందు తనకెవ్వరూ అడ్డు వుండకూడదని తానే రాజు తానే మంత్రి అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఇటీవల శ్రీకాళహస్తిలో జరిగిన ఎపిసోడ్ ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. ఈ వయస్సులో కూడా చంద్రబాబు నాయుడు పడుతున్న శ్రమ వీరికి కనిపించడం లేదు. రేపు ఎన్నికల్లో టిడిపి గెలుపొందినట్లు గాలిలో కలలు కంటున్నారు. పార్టీ అధికారంలోనికి వచ్చిన తర్వాత తాను గెలిచినా, ఓడినా తమకు అడ్డు ఎవ్వరూ వుండకూడదనే ధోరణి వీరిలో కరుడు కట్టుకొని వుంది.
తిరుపతి జిల్లాలోని ఎక్కువ నియోజకవర్గాల్లో వైసిపికి వున్న మూక బలం టిడిపికి లేదు. అంత వరకైతే ఫర్వాలేదు. కొన్ని నియోజకవర్గాల్లో టిడిపి ఇన్ చార్జ్ లకు పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తల మధ్య పెద్ద అగాధం వుంది. పార్టీ పరిశీలకులు, ఎన్నికల వ్యూహ బృందం సభ్యులు అధినేత చంద్రబాబు నాయుడుకు ఏం సమాచారం ఇస్తున్నారో ఏమో గాని అధిష్టానం వర్గం కూడా దిద్దుబాటు చర్యలు చేపట్టడం లేదు. జిల్లాలో గూడూరు, సత్యవేడు, సూళ్లూరుపేట రిజర్వు నియోజకవర్గాలుగా వున్నాయి. ఇందులో సూళ్లూరుపేటలో ఇద్దరు నేతల మధ్య పోటీ వుండగా, మూడో కృష్ణుడు తెర మీదకు వచ్చినట్లు చెబుతున్నారు. ఈ పంచాయతీ ఇంత వరకు తెగలేదు. వీరిలో నెలవల సుబ్రహ్మణ్యం కాస్తా పట్టు వున్న నేతగా చెబుతున్నారు. సత్యవేడు నియోజకవర్గంలో కొత్త ఇన్ చార్జ్ గా హెలన్ ను ప్రకటించినా, 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడి పోయిన రాజశేఖర్ పోటీగా నియోజకవర్గంలో తిరుగుతున్నారు. అధిష్టాన వర్గం అతన్ని కట్టడి చేసే స్థితిలో లేదు. ఇది ఇన్ చార్జ్ హెలన్ కు ఇబ్బందిగా తయారైంది. ఫలితంగా నియోజకవర్గంలో రెండు వర్గాలుగా ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు చీలిపోయారు. వీరిలో వీరికే ఉప్పు నిప్పుగా వుంటే అధికారంలో వున్న వైసిపి అభ్యర్థిని ఏలా ఓడిస్తారు అన్నది సమాధానం లేని ప్రశ్న.
గతంలో తొట్టంబేడు మండలం సత్యవేడు నియోజకవర్గంలో వుండేది. ఈ మండలానికి చెందిన సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే యస్సీవీ నాయుడుకు అప్పటి నుండి సత్య వేడు నియోజకవర్గంలో మంచి పట్టువుంది. అనుచరగణమూ వుంది. ఆలాంటి నేత పార్టీ లోనికి వస్తానంటే పార్టీ క్షేమం కాంక్షించి వ్యవహరించవలసిన శ్రీకాళహస్తి ఇన్ చార్జ్ తనకు తెలియకుండా చేరేందుకు వీలు లేదని, అదీ విదేశాల నుండి వాయిస్ మెసేజ్ పెట్టారు. ఇక్కడ లాజిక్ ఏమంటే యస్సీవీ నాయుడు పార్టీలో చేరేది అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో.. వాస్తవంలో చంద్రబాబు నాయుడు సుధీర్ రెడ్డికి చెప్పాలి. కాని సుధీర్ రెడ్డి వాయిస్ మెసేజ్ పెట్టగానే చేరిక వాయిదా వేశారంటే ఇది ఎవరి బలహినత? ఈ కోవకు చెందినదే సత్య వేడు నియోజకవర్గంలో రాజ శేఖర్ ఉదంతం కూడా.
ఇక తిరుపతి నియోజకవర్గంలోనూ ఒక పక్క మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మరో వేపు జిల్లా పార్టీ అధ్యక్షుడు నరసింహయాదవ్ పోటీ పడుతున్నారు. ఈ స్థానం జనసేనకు కేటాయిస్తారని ప్రచారంలో వుంది. కాబట్టే ఎటూ తేల్చలేదంటున్నారు. గుడ్డిలో మెల్ల ఏమంటే ఈ నియోజకవర్గంలో నేతల మధ్య పోట్లాట లేదు. కానీ వైసిపి కి దీటుగా వ్యవహరించే సత్తా ఎవరికీ లేదు. నగరి నియోజకవర్గంలో టిడిపి కథ వేరుగా వుంది. ఇన్ చార్జ్ భానుప్రకాష్ కార్యకర్తలతో సఖ్యతగా మెలగడనే ప్రచారంలో పాటు స్వంత ఇంటిపోరు గుండెలు మీద కుంపటిగా వుంది. భానుప్రకాష్ కు వ్యతిరేకంగా అతని సోదరుడు జగదీష్ వేరు కుంపటి పెట్టి రాజకీయం చేస్తున్నారు. అతని వెంబడి ముద్దు కృష్ణమ నాయుడు కుటుంబం మొత్తం కేంద్రీకృతం అయివుంది. ఇక్కడ కూడా పార్టీకి ప్రమాదం పొంచి వుంది. వైసిపి అభ్యర్థిగా మంత్రి రోజా పోటీ చేస్తే వైసిపి గ్రూప్ రాజకీయాలతో టిడిపికి వెసులుబాటు వుంటుంది. కాని మంత్రి రోజాను తప్పించి వైసిపి అభ్యర్థిగా జగదీష్ ను చేసేందుకు ఒక బలమైన నేత ప్రయత్నిస్తున్నట్లు ప్రచారంలో వుంది. ఇదే జరిగితే టిడిపి అభ్యర్థి గెలుపు గురించి ఆలోచన చేయవలసి వుంటుంది.
ఇక శ్రీ కాళహస్తి నియోజకవర్గ ఇన్ చార్జ్ సుధీర్ రెడ్డికి ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తల మధ్య సఖ్యత లేదు. సుధీర్ రెడ్డి వెంబడి వుండే కోటరీ తప్ప ఎక్కువ మంది తీవ్ర అసంతృప్తితో వున్నారనే ప్రచారం బాగా వుంది. ఈ పాటికే ఈ సమాచారం చంద్రబాబు నాయుడుకు చేరిందని కూడా జిల్లా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. సుధీర్ రెడ్డికి అన్నీ బలహీనతలే. నియోజకవర్గంలో ఎక్కువ కాలం వుండదనే ప్రచారం తొలి నుండి వుంది. ఈ అంశం చంద్రబాబు నాయుడుకు బాగా తెలుసని కూడా చెబుతున్నారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా చంద్రబాబు నాయుడు నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో కొన్ని పదుల సంఖ్యలో నేతలు వున్నా సుధీర్ రెడ్డికి క్లాస్ పీకారని టిడిపి నేతలే చెబుతున్నారు.
ఈ మధ్య శ్రీ కాళహస్తి టవున్ కు చెందిన ఒక బాధిత మహిళను సుధీర్ రెడ్డితో నిమిత్తం లేకుండా శ్రీ కాళహస్తికి చెందిన తిరుపతి జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు వద్దుకు తీసుకెళ్లి అయిదు లక్షలు నగదు ఇప్పించింది. ఈ అంశంలో సుధీర్ రెడ్డి ఆ మహిళా నేతను తీవ్ర పదజాలంతో దూషించినట్లు సమాచారం. ఈ ఎపిసోడ్ ను కాస్తా లోకేష్ కు దృష్టికి సదరు మహిళ నేత తీసుకెళ్లినట్లు టిడిపి వర్గాల్లో ప్రచారం వుంది. తన తండ్రి గోపాల కృష్ణా రెడ్డికి చంద్రబాబు నాయుడు మాట ఇచ్చినందున తనకే టిక్కెట్టు వస్తుందని నియోజకవర్గంలో ఎవ్వరినీ లెక్క చేయ వలసిన అవసరం లేదని సుధీర్ రెడ్డి ఇలా వ్యవహరిస్తున్నారని జిల్లా స్థాయి నేత ఒకరు వ్యాఖ్యానించారు. తుదకు చంద్రబాబు నాయుడు నిర్ణయం ఏలా వుంటుందో. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే మొన్న యస్సీవీ నాయుడు పార్టీ ఆఫీసుకు తొలి సారి వెళ్లిన సందర్భంగా శ్రీ కాళహస్తి లో జరిగిన కార్యకర్తల సమావేశంలో సుధీర్ రెడ్డి తల్లి బృందమ్మ తన బిడ్డ ఏదైనా తప్పు చేసి వుంటే తను క్షమాపణ చెబుతానని మాట్లాడినారనే ప్రచారం వుంది. పైగా 2019 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి దాదాపు 38 వేల మెజార్టీతో గెలుపొందిన నేపథ్యంలో రేపు ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో టిడిపికి వచ్చిన ఓట్లకు పైగా నలభై వేలకు మించి సంపాదించ గలిగితేనే గెలుపు ఛాయలకు వెళ్ల గలరు.
.
జిల్లాలో వెంకటగిరి నియోజకవర్గంలో మూడు ముక్కలాట కొనసాగుతోంది. ప్రస్తుతం ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కుమార్తెతో పాటు మాజీ ఎమ్మెల్యే కె. రామ కృష్ణ పార్టీ ఇన్ చార్జ్ తనేనని ముందుకు పోతున్నారు. ఈలోపు మస్తాన్ యాదవ్ రంగంలోనికి దిగి టికెట్ కోసం గట్టిగా కృషి చేస్తున్నారు. కొసమెరుపు ఏమంటే మొన్న లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఆనం రామనారాయణరెడ్డి పైచేయి సంపాదించారు. ఎవరికో ఒకరికి బొట్టు పెట్టడం ఎంత ఆలస్యమైతే ఆ మేరకు అపకారం జరిగే అవకాశాలుంటాయని వెంకటగిరి నియోజకవర్గంలోని కార్యకర్తలు మధన పడుతున్నాను.
ఆఖరుగా చంద్రగిరి నియోజకవర్గం. ఇది చంద్రబాబు నాయుడు స్వంత నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ప్రస్తుత వైసిపి ఎమ్మెల్యే చెవిరెడ్డి బాగా పాతుకు పోయారు. చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన కొందరు నాయకులను భారీగానే బుట్టలో వేసుకొని వున్నారు. 2014 లో అరుణమ్మ టిడిపి అభ్యర్థిగా పోటీ చేసినప్పుడే ఈ నేతలు అరుణమ్మ చేయి ఇచ్చారు. తుదకు అరుణమ్మ వీరిపై ఫిర్యాదు చేసినా, అప్పట్లో ఏలాంటి చర్య తీసుకోక పోవడమే 2019 ఎన్నికల్లో ఆమె పోటీ చేయక పోవడానికి కారణంగా ప్రచారం ఉంది. ఇప్పుడు కూడా చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన పలువురు చెవిరెడ్డి వెంబడి వున్నారు. వుంటారు కూడా. చెవిరెడ్డి సామాజిక వర్గం నుండి ఓట్లు చీల్చగల ఆ సామాజిక వర్గానికి చెందిన నేత టిడిపి అభ్యర్థి అయితేనే కొంత నెట్టుకు రాగలని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్రం మొత్తం మీద ప్రభుత్వ వ్యతిరేక గాలి వుంటే తప్ప చంద్రగిరిలో చెవిరెడ్డిని గాని ఆయన తనయుణ్ణి ఓడించఢం కుదరదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దురదృష్టమేమంటే చంద్ర బాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన నేతలు కొందరు ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన నేతలను దాదాపుకు కూడా రానీయయడం లేదు. ఇది టిడిపికి పెద్ద మైనస్ పాయింట్.
.