ప్రజల్లో వ్యతిరేకతను ఎదుర్కొంటున్న YCP MLAలు
చిత్తూరు జిల్లాలోని కొందరు YCP MLAలు ప్రజల్లో, పార్టీ పరంగా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఈ వ్యతిరేకత రానున్న ఎన్నికలల్లో ఎక్కడ పార్టీ మీద పడుతుందోనని పార్టీ పెద్దలు ఆందోళన చెందుతున్నారు. వ్యతిరేకత కారణంగా ఎక్కడ టిక్కెటుకు ఎసరు వస్తుందోనని MLAలు భయపడుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ జిల్లాలోని వైసీపీ MLAల మీద ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గడప గడప..కు వెళ్తున్న ఎమ్మెల్యేలను సమస్యలపై స్థానికులు నిలదీస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా ఐప్యాక్ బృందం సర్వే నిర్వహించింది. జనంలో అసంతృప్తి ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు 40 మంది ఉన్నట్లు జాబితా సిద్ధం చేసినట్లు వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ పార్టీ నేతల అంచనా ప్రకారం.. ఆ 40 మందిలో జిల్లాకు సంబంధించి చిత్తూరు, పలమనేరు ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, వెంకటేగౌడ, MS బాబు ఉన్నట్లు సమాచారం.
చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుపై భూఆక్రమణల ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. కొన్ని ఆక్రమణల్లో ఆయన పేరు బయట పడితే, మరికొన్నిచోట ఆయన అనుచరులు.. వైసీపీ రెండో స్థాయి నాయకుల పేర్లు ఉంటున్నాయి. కొన్ని అంశాల్లో గడప గడపలోనూ ఆయనకు ప్రజల నుంచి నిలదీతలు ఎదురయ్యాయి. ఏ శాఖలో ఏ స్థాయి అధికారి పోస్టింగ్ తీసుకోవాలనుకున్నా ఎమ్మెల్యేకు తెలియకుండా జరగడం లేదు. కార్పొరేషన్ సహా ఇతర కార్యాలయాల్లో ప్రధాన పనులు జరగాలంటే ఆ ఫైల్ ఎమ్మెల్యే వద్దకు వెళ్లి రావాల్సిందేననే ఆరోపణలు ఉన్నాయి. ఇక సొంత పార్టీలోనూ ఆయనకు ఇబ్బందులు ఉన్నట్లు చెబుతారు. దీనికితోడు ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి నగదును విరివిగా ఖర్చు పెడుతున్నారు. ఈసారి చిత్తూరు టికెట్టు ఆయనకేనంటూ అతడి అనుచరులు విస్తృతంగా చెబుతున్నారు. చిత్తూరు మాజీ MLA గోపీనాథ్ కుమారుడు భుపేష్ కూడా ఈ సారి టిక్కెట్టును ఆశిస్తున్నారు.
ఇక పలమనేరు నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ ఎమ్మెల్యే వెంకటేగౌడకు బలమైన వ్యతిరేక వర్గాలున్నాయి. ఎమ్మెల్యేగా గెలిచిన ప్రారంభంలో పలమనేరు సమీపంలోని ఓ క్వారీని ఈయన స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో ఎక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్నా ఎమ్మెల్యేను ప్రసన్నం చేసుకోవాల్సిందేనన్న విమర్శలున్నాయి. ప్రజల నుంచీ వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఇక, నియోజకవర్గానికి చెందిన జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్యేకి మధ్య నిత్యం ప్రొటోకాల్ రగడ నడుస్తూనే ఉంది. ఇలా, పార్టీలోనే నెలకొన్న తీవ్ర వ్యతిరేకత కూడా ఈయనకు ప్రతికూలంగా మారిందన్న ప్రచారం జరుగుతోంది.
జీడీనెల్లూరులో డిప్యూటీ సీఎం నారాయణస్వామికి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జ్ఞానేంద్ర రెడ్డికి పచ్చగడ్డి వేస్తె భగ్గుమనే పరిస్థితి నెలకోంది. దీంతో YCP నాయకులు, కార్యకర్తలు రెండు పర్గాలుగా చిలిపోయారు. ఒకరి మీద మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. రానున్న ఎన్నికలల్లో నారాయణస్వామిని ఓడించడానికి పార్టీలోని ఒక వర్గం ఇప్పటి నుండి పావులు కదుపుతోంది. వేరే అభ్యర్థిని రంగంలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నారాయణస్వామి ఈ సారి తన కుమార్తెను ఎన్నికల బరిలోకి దిన్చావచ్చానే ఉహాగానాలు ఉన్నాయి.
నగరిలో రోజాకు నియోజకవర్గాల్లో వర్గపోరు తప్పడం లేదు. బలమైన వ్యతిరేక వర్గాలు తయారయ్యాయి. ఈసారి వారికి టిక్కెట్లు ఇస్తే పనిచేయమని, వారి వ్యతిరేక వర్గ నాయకులు పలువురు బహిరంగంగా చెప్పేస్తున్నారు. శ్రీశైల దేవస్థానం చైర్మన్ చక్రపాణి రెడ్డి, ఈడిగ కార్పొరేషన్ కేజే శాంతి, రాష్ట్ర వైసీపీ ట్రేడ్ యూనియన్ నాయకుడు కేజే కుమార్‌లు మంత్రి రోజా వ్యతిరేకవర్గంగా ఉన్నారు. వైఎస్ జయంతి వేడుకలను కూడా విడిగా నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి నగరి బస్టాండులోని వైఎస్ విగ్రహం వరకు ర్యాలీగా వచ్చి, విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని పక్కనపెట్టే నాయకులకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.
పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎ్‌సబాబుకు గడప గడపకు కార్యక్రమాల్లో నిత్యం నిలదీతలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ పధకాల కింద తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించాలని అనడం వివాదం రేపింది. బంగారుపాల్యం మండలంలో ఒక గ్రామానికి MLA రాకుడదని బ్యానర్లు కట్టారు. ఐరాల ZPTC సభ్యురాలికి జిల్లా పరిషత్ వైస్ చైర్ పర్సన్ పదవి ఇప్పిస్తానని, 7.5 కోట్లు తీసుకున్నారని ఆమె పేరుతో ఉన్న లేఖ వివాదానికి కేంద్ర భిందువు అయ్యింది. నెల రోజుల కిందట ఐరాల మండల YCP నాయకులు కొందరు MLAకు వ్యతిరేకంగా ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఇలాంటి నేపథ్యంలో ఎన్నికల సమయానికి ఐప్యాక్ ఇచ్చే జాబితాలో ఎవరెవరి పేర్లు ఉంటాయోననే ఆందోళన ఎమ్మెల్యేల్లో వ్యక్తం అవుతోంది.