5, జులై 2023, బుధవారం

చంద్రబాబు సొంత జిల్లాలో పార్టీకి ఏమయ్యింది ?


      

                 తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో పార్టీ నిర్మాణం, పార్టీ పటిష్టత ఉండాల్సిన స్థాయిలో లేదు. జిల్లాలో రోజురోజుకు పార్టీ పరిస్థితి దమనీయంగా తయారవుతోంది, బలహీనపడుతోంది. ఇతర పార్టీలకు TDP నాయకులు వలస పోతున్నారు. ఆ నాయకులే తిరిగి పార్టీకి తలనొప్పిగా తయారవుతున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు కూడా చాలామంది పార్టీకి దూరమవుతున్నారు. ఇతర పార్టీలలో అవకాశాలు లేక కొందరు తెలుగుదేశం పార్టీలో ఉండగా, అవకాశం దొరికిన వాళ్ళు పార్టీ మారుతున్నారు. అక్కడ చక్రం తిప్పుతున్నారు. చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన  చంద్రగిరిలో  తెలుగుదేశం పార్టీ 30 సంవత్సరాలుగా  వరుసగా  ఓటమిపాలయ్యిందంటే జిల్లాలో ఆ పార్టీ పరిస్థితి అంచనా వేయవచ్చు.


               ఉమ్మడి చిత్తూరు జిల్లా   చంద్రగిరి మండలం నారావారిపల్లి  చెందిన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉంటున్నారు. ఈ నియోజకవర్గంలో గత 30 సంవత్సరాలుగా TDP విజయం సాధించలేదు. చంద్రబాబు నాయుడు చంద్రగిరి కాకుండా కుప్పం నియోజకవర్గం నుండి వరుసగా పోటీ చేస్తున్నారు. జిల్లాలో  14 స్థానాలు ఉండగా గత ఎన్నికలలో 13 స్థానాల్లో  వైసిపి పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. చంద్రబాబు నాయుడు ఒక్కరే టిడిపి నుండి గెలుపొందారు. నాయకుడు సొంత జిల్లాలో తెలుగుదేశం పార్టీ దుస్థితికి ఈ ఎన్నికలు దర్పణం పడుతున్నాయి. ఇలా సొంత నియోజక వర్గం కాకుండా, ఇతర ప్రాంతాల నుండి గెలిచి రాజకియయం చేసిన ముఖ్యమంత్రులు ఉండకపోవచ్చు. ఎవరైనా ఇంట గెలిచి రచ్చ గెలువాలి అనుకుంటారు. చంద్రబాబు ఇందుకు బిన్నంగా రాజకీయం చేస్తున్నారు. 


                   గతంలో కాంగ్రెస్ పార్టీలో  మంత్రులుగా పనిచేసి పార్టీలో చేరిన వారిని సైతం గెలిపించుకోలేని దుస్థితి పార్టీలో నెలకొంది. మాజీమంత్రులు  గల్లా అరుణ కుమారి, గుమ్మడి కుతూహలమ్మ  తెలుగుదేశం పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో 4 సార్లు గెలుపొందిన  అరుణ కుమారి TDP తరపున చంద్రగిరి నుండి పోటి చేసి ఓడిపోయారు. అలాగే 5 సార్లు కాంగ్రెస్ పార్టీ నుండి పోటి చేసి గెలుపొందిన  గుమ్మడి  కుతూహలమ్మ గంగాధర నెల్లూరు నియోజక వర్గం నుండి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. దీంతో అరుణ కుమారి ప్రస్తుతం రాజకీయాలకు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పోటీ చేయడానికి కూడా ఆసక్తి చూపడం లేదు. గుమ్మడికుతూహలమ్మ స్వర్గస్తులయ్యారు. ఆమె కుమారుడు హరికృష్ణ గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గత ఎన్నికలలో ఓడిపోయారు. ప్రస్తుతం హరికృష్ణ కూడా పార్టీకి రాజీనామా చేశారు.


                     గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన పలువురు పార్టీకి అంటి ముట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు. కొందరు పార్టీలో లేరు. ఇంకొందరు వేరే పార్టీలో చేరారు. చిత్తూరు నుండి పోటీ చేసిన ఏఎస్ మనోహర్, బాలాజీ నాయుడు ఏ పార్టీలో  ఉన్నారో  కూడా తెలియదు. పూతలపట్టు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన లలిత  కుమారి పార్టీకి, కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అలాగే పలమనేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సుభాష్ చంద్రబోస్ కూడా పార్టీకి దూరమయ్యారు. పుంగనూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వెంకటరమణ రాజు YCPలో చేరారు. అలాగే తంబళ్ళపల్లి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి అమ్మ కుమారుడు ప్రవీణ్ కుమార్ TDP తరపున MLAగా గెలుపొందారు. ప్రస్తుతం  YCPలో కొనసాగుతున్నారు. 


                    తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా పని చేసిన వారిలో పలువురికి ఆ పదవి కలిసి రాలేదని చెప్పాలి. వారికీ ఆ పదవి కలిసి రాలేదు అనడం కంటే, అధ్యక్షులకు ఆ పదవి కలిసి రాలేదు. పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు కొందరు పార్టీకి దూరంగా ఉంటుండగా మరికొంతమంది ఇతర పార్టీలలో చేరారు. కమ్మ సామాజిక వర్గ నాయకులు మాత్రం పార్టీలోనే ఉంటున్నారు. ఇదివరకు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన రమేష్ చంద్ర ప్రసాద్, LB ప్రభాకర్  ప్రస్తుతం రాజకీయ సన్యాసం తీసుకున్నారు. అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన జీవి శ్రీనాథ్ రెడ్డి,  చింతల రామచంద్రారెడ్డిలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చింతల MLA అయ్యారు. టిడిపి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన అమర్నాథ్ రెడ్డి కూడా వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరారు. గౌనివారి శ్రీనివాసులు, దొరబాబు మాత్రం పార్టీలోనే కొనసాగుతున్నారు. 


                           పార్టీ ద్వారా  పదవులు పొందిన వారు, పార్టీ  పరంగా లబ్ధి పొందిన వారు కూడా పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీకి అండగా నిలవడం లేదు. చిత్తూరుకు చెందిన DK ఆదికేశవులు తెలుగుదేశం పార్టీ తరఫున MPగా, TTD చైర్మన్ గా పనిచేశారు. పార్టీ అధికారంలో లేనప్పుడు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో మొదటినుంచి అండదండగా ఉంటున్న స్వర్గీయ బొజ్జల గోపాల కృష్ణారెడ్డి, గాలి ముద్దుకృష్ణమనాయుడు కూడా పార్టీ అధికారంలో ఉన్నా,  మంత్రి పదవులు ఇవ్వకుండా  కొంతకాలం  దూరం పెట్టారు.


                      ఇలా వలసలు పెరగడంతో క్రమంగా తెలుగుదేశం పార్టీ బలహీనమవుతుంది. తెలుగుదేశం పార్టీలో రాజకీయం నేర్చుకుని వేరే పార్టీలో చేరిన నాయకులు తిరిగి తెలుగుదేశం పార్టీకే మేకులా తయారవుతున్నారు. వారే తీవ్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ పైన పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద విరుచక పడుతున్నారు. గతంలో తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేసిన సినీనటి రోజా ప్రస్తుతం వైసీపీలో చేరి మంత్రిగా కొనసాగుతున్నారు. చంద్రబాబు నాయుడును విమర్శించడంలో ఆమె అంది వేసిన చేయి. ముందు వరుసలో ఉంటారు. తెలుగుదేశం పార్టీలో ఉండిన ప్రస్తుత చిత్తూరు ఎమ్మెల్యే నివాసులు మంగళవారం జరిగిన ముఖ్యమంత్రి సభలో నారా చంద్రబాబు నాయుడు మీద తీవ్ర స్థాయిలో విరచుక పడ్డారు. చంద్రబాబు నాయుడు ఈ జిల్లాకు పట్టిన శని అని అభివర్ణించారు. 


                 ఇలా నేతలు వేరే పార్టీలోకి  వెళ్లకుండా కట్టడి చేసే యంత్రాంగం, బలమైన నాయకత్వాన్ని జిల్లాలో ఎదగానియలేదు. జిల్లా అధ్యక్షులైన, ఎమ్మెల్యేలైన, మంత్రులైన మొత్తం వ్యవహారం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా జరగాలి. ఆయనదే తుది నిర్ణయం. జిల్లా పార్టీ అధ్యక్షులకు, శాసనసభ్యులకు, మంత్రులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం లేదు. అంతా తానే వ్యవహరిస్తూ చంద్రబాబు నాయుడు జిల్లాలో రాజకీయం చేస్తున్నారు. ఫలితంగా సొంత సామాజిక వర్గంలోనే కొంతమంది కోవర్టులు తయారవుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. వీరు పార్టీకి నష్టం చేస్తూ వేరే పార్టీకి పరోక్షంగా మేలు చేసే విధంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇటీవల జరిగిన పూతలపట్టు, గంగాధర నెల్లూరు ఇన్చార్జ్ ల నియామకంలో కూడా ఇలాంటి వారి పాత్ర ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా లేని, పార్టీ వ్యవహారాలు తెలియని వారిని పార్టీ ఇన్చార్జిలుగా నియమించడంతో నమ్ముకున్న వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రతిపక్ష పార్టీతో చేతులు కలిపి తనకు అన్యాయం చేసిన పార్టీకి కీడు చేయడానికి పార్టీలో ఉంటూనే ఎత్తుగడలు వేస్తున్నారు. ఇలా జిల్లాలో తెలుగుదేశం పార్టీ రోజురోజుకు బలహీనపడుతోంది. చంద్రబాబు ప్రాతినిద్యం వహిస్తున్న కుప్పంలో కూడా పార్టీ పరిస్థితి బాగా లేదు. మండల పరిషత్, మున్సిపాలిటీ ఎన్నికలలో  వైసీపీ విజయకేతనం ఎగురవేసింది.  రానున్న ఎన్నికలలో  చంద్రబాబు నాయుడును ఓడిస్తామని ధీమాతో వైసీపీ నాయకులు పనిచేస్తున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *