18, జూన్ 2026, గురువారం

కుప్పకూలిన తోతాపురి...

కుప్పకూలిన తోతాపురి... 

కళ్లముందే కుళ్లిపోతున్న మామిడి!

చిత్తూరు రైతును కుదేలు చేస్తున్న ధరల పతనం

రూ.7 నుంచి రూ.4కు పడిపోయిన ధర... 

రాంపుల్లో కిలో రూ.3కే కొనుగోలు

ఫ్యాక్టరీల వద్ద రోజుల తరబడి ట్రాక్టర్ల బారులు... తోటల్లోనే రాలిపోతున్న కాయలు

ప్రభుత్వం, ఫ్యాక్టరీల మధ్య నలిగిపోతున్న 30 వేల మంది రైతులు

ఆందోళనకు సిద్ధమవుతున్న మామిడి రైతులు

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)

ఒకప్పుడు రైతుకు బంగారు పంటగా పేరొందిన తోతాపురి మామిడి ఈ ఏడాది రైతుల కంట కన్నీరు తెప్పిస్తోంది. పండిన కాయలకు కొనుగోలుదారులు లేకపోవడం, ఉన్న కొనుగోలుదారులు అతి తక్కువ ధరలు చెప్పడం, గుజ్జు పరిశ్రమలు పూర్తి స్థాయిలో కొనుగోళ్లు చేయకపోవడంతో చిత్తూరు జిల్లా మామిడి రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారు. వేలాది ఎకరాల్లో పండిన మామిడి తోటల్లోనే రాలిపోతుండగా, ఇప్పటికే కోత కోసిన కాయలు ఫ్యాక్టరీల వద్ద రోజుల తరబడి ట్రాక్టర్లలోనే నిలిచిపోతున్నాయి. ఈ సీజన్ ప్రారంభంలో తోతాపురి రకం మామిడికి కిలోకు రూ.7.50 వరకు ధర లభించింది. అయితే వారం రోజులు తిరగకముందే ధర రూ.6కు పడిపోయింది. తాజాగా మంగళవారం నుంచి మరో రూపాయి తగ్గి కిలో రూ.5కు చేరుకుంది. గురువారం నాటికి నాలుగు రూపాయలకు చేరింది. అధికారికంగా ఐదు రూపాయలు ప్రకటిస్తున్నప్పటికీ రాంపుల్లో వర్తకులు కిలో రూ.3 నుంచి రూ.4 మధ్య మాత్రమే కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకపోవడం పట్ల జిల్లాలోని మామిరెడ్డి రైతులు తీవ్ర అసంతతో ఉన్నారు. ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతున్నారు. శుక్రవారం నాడు దామలచెరువులో రైతు గర్జన సభను నిర్వహించనున్నట్లు జిల్లా రైతు సంఘం నాయకులు తెలిపారు.

చిత్తూరు జిల్లాలోని మామిడి గుజ్జు పరిశ్రమలు తోతాపురి కొనుగోళ్ల విషయంలో ఆశించిన స్థాయిలో స్పందించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో మొత్తం 31 జ్యూస్, గుజ్జు పరిశ్రమలు ఉండగా అందులో 28 మాత్రమే ప్రారంభమయ్యాయి. వాటిలో కూడా కేవలం 14 పరిశ్రమలు మాత్రమే తోతాపురి మామిడిని కొనుగోలు చేస్తున్నాయి. అవి కూడా పూర్తి సామర్థ్యంతో కాకుండా సగం కంటే తక్కువ స్థాయిలో పనిచేస్తున్నాయి. గతంలో రోజుకు 500 ట్రాక్టర్ల వరకు మామిడి అన్లోడ్ చేసుకునే పరిశ్రమలు ప్రస్తుతం 200 ట్రాక్టర్లను కూడా తీసుకోవడం లేదని రైతులు చెబుతున్నారు. గంగాధర నెల్లూరు మండలంలోని జైన్ ఫ్యాక్టరీ వద్ద గత మూడు రోజులుగా వందలాది ట్రాక్టర్లు క్యూలో నిలిచిపోయాయి. చాలా ట్రాక్టర్లకు ఇప్పటికీ టోకెన్లు లేదా నంబర్లు ఇవ్వలేదని రైతులు ఆరోపిస్తున్నారు. కొన్ని ఫ్యాక్టరీల వద్ద ఒక ట్రాక్టర్ మామిడి అన్లోడ్ చేయడానికి రెండు నుంచి మూడు రోజుల సమయం పడుతోంది. ఇప్పటికే కోసిన మామిడిని ట్రాక్టర్లలో ఉంచితే నాణ్యత దెబ్బతింటోంది. తోటల్లో ఉన్న కాయలు పక్వానికి వచ్చి చెట్ల కిందే రాలిపోతున్నాయి. జిల్లాలో ఇంకా ఐదు శాతం కూడా మామిడి కోత పూర్తి కాలేదని రైతు సంఘాలు చెబుతున్నాయి. కాయలు కోసినా కొనుగోలు కేంద్రాల్లో స్థలం లేకపోవడం, కోయకపోతే చెట్ల కిందే రాలిపోవడం వల్ల రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. గత కొద్ది రోజులుగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సతీష్ తదితరులు ఫ్యాక్టరీలను సందర్శిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రైతులకు కనీసం కిలోకు రూ.7 చొప్పున ధర ఇవ్వాలని, జిల్లాలోని అన్ని గుజ్జు పరిశ్రమలు కొనుగోళ్లు చేపట్టాలని సూచించారు. అయితే పరిశ్రమల యాజమాన్యాల వైఖరిలో పెద్దగా మార్పు కనిపించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యాలు మాత్రం తమకు అంతర్జాతీయ మార్కెట్లో ఆర్డర్లు తక్కువగా ఉన్నాయని, ఎగుమతులు మందగించాయని, ప్రస్తుతం అధిక ధరలకు కొనుగోలు చేస్తే భారీ నష్టాలు వస్తాయని చెబుతున్నాయి. దీంతో రైతులు, పరిశ్రమల మధ్య ధరల వివాదం మరింత తీవ్రమవుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో సోమవారం రాత్రి వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ ఆధ్వర్యంలో హైబ్రిడ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోకాకోలా సంస్థ ప్రతినిధులు, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, ఏపీఈడీఏ, నాలుగు జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో తోతాపురి ధరలు, పరిశ్రమల సమస్యలు, రైతుల ఇబ్బందులపై విస్తృతంగా చర్చించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో కిలోకు రూ.7 ధరతో కొనుగోళ్లు ప్రారంభించినప్పటికీ ఇతర ప్రాంతాల్లో తక్కువ ధరలు ఉండటం వల్ల మార్కెట్‌లో అసమానతలు ఏర్పడ్డాయని తెలిపారు. రైతులకు నష్టం కలగకుండా రాష్ట్రాల వారీగా ఒకే విధమైన ధర విధానాన్ని అమలు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. మూడు రాష్ట్రాల్లో సుమారు 50 వేల మంది తోతాపురి రైతులు ఉండగా, ఒక్క చిత్తూరు జిల్లాలోనే 30 వేల మందికి పైగా రైతులు ఈ పంటపై ఆధారపడి జీవిస్తున్నారని కలెక్టర్ వివరించారు. రైతులకు మెరుగైన ధరలు లభించేలా ప్రాసెసింగ్ యూనిట్లతో పాటు కొనుగోలు సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ఫ్యాక్టరీలకు వచ్చే ట్రాక్టర్లను వచ్చిన క్రమంలోనే అన్లోడ్ చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. రైతుల ప్రకారం ఫ్యాక్టరీల వద్ద ఇప్పటికీ ట్రాక్టర్లు రోజుల తరబడి నిలిచి ఉంటున్నాయి. కొన్నిచోట్ల టోకెన్లు ఇచ్చి వారం రోజుల తర్వాత కాయలు తీసుకురావాలని చెబుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కాణిపాకం వచ్చినప్పటికీ మామిడి రైతుల సమస్యలపై ప్రత్యేకంగా స్పందించలేదని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు ఎన్ని సమావేశాలు నిర్వహించినా ఫ్యాక్టరీల వైఖరిలో మార్పు రావడం లేదని ఆరోపిస్తున్నాయి. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తోతాపురి మామిడికి కిలోకు రూ.12 ధర వచ్చేలా చర్యలు చేపట్టింది. ఇందులో ప్రభుత్వం రూ.4 ప్రోత్సాహకంగా ఇవ్వగా, ఫ్యాక్టరీలు రూ.8 చెల్లించాల్సి ఉండేది. చివరకు రైతులకు సుమారు రూ.9 వరకు గిట్టుబాటు లభించింది. కానీ ఈ ఏడాది ధర ఒక్కసారిగా రూ.5కు పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మంగళవారం జిల్లాలోని మామిడి రైతులు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తమ సమస్యలను వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌ను కలిసి ధరల పతనం, కొనుగోళ్లలో జాప్యం, ఫ్యాక్టరీల నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ జిల్లాలోని పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని, రైతులకు ఇబ్బందులు లేకుండా తన వంతు చర్యలు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా వచ్చే వారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ప్రత్యేక సమావేశం నిర్వహించే అవకాశముందని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ తెలిపారు. ఆ సమావేశం అనంతరం తోతాపురి కొనుగోలు ధరలపై కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే రైతులు మాత్రం ఆ నిర్ణయం వచ్చేలోపు తోటల్లోని మామిడి కాయలు నేలరాలిపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర కూడా దక్కకపోవడం, కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి నిరీక్షించాల్సి రావడం, పండిన కాయలు చెట్ల కిందే కుళ్లిపోతుండటం రైతులను తీవ్ర నిరాశలోకి నెట్టింది. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని గత ఏడాది తరహాలో మద్దతు ధర ప్రకటించి, అన్ని గుజ్జు పరిశ్రమలు కొనుగోళ్లు చేపట్టేలా కఠిన చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి చూస్తే పండిన పంట చేతికొచ్చినా ఆదాయం మాత్రం అందని ద్రాక్షగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *