భారీ బందోబస్తు మధ్య నేడే నీట్ పరీక్ష
భారీ బందోబస్తు మధ్య నేడే నీట్ పరీక్ష
పరీక్ష పత్రాల భద్రతకు వైమానిక దళం సేవలు
మూడు పరీక్ష కేంద్రాలలో 1,111 మంది విద్యార్థులు
పరీక్ష కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తు
అభ్యర్థులకు ఉచిత రవాణా సౌకర్యం
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)
వైద్య విద్యలో ప్రవేశాలకు అత్యంత కీలకమైన నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష ఆదివారం దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ జరగనుంది. గతంలో చోటుచేసుకున్న పేపర్ లీకేజీలు, అవకతవకల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలు, రాధాకృష్ణన్ ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) అపూర్వమైన భద్రతా చర్యలను అమలు చేస్తోంది. దేశవ్యాప్తంగా పరీక్షల పారదర్శకతకు పెద్దపీట వేస్తూ సాంకేతిక, పరిపాలనా, భద్రతా వ్యవస్థలను మరింత పటిష్ఠం చేసింది. చిత్తూరు జిల్లాలోని పీవీకేఎన్ డిగ్రీ కళాశాలలో 463 మంది, సావిత్రమ్మ మహిళా డిగ్రీ కళాశాలలో 264 మంది, లిటిల్ ఫ్లవర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 384 మంది విద్యార్థులు కలిపి మొత్తం 1,111 మంది పరీక్షకు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ, విద్యాశాఖ, వైద్యశాఖ, విద్యుత్ శాఖ, అగ్నిమాపక శాఖ, ఆర్టీసీ శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశాయి.
దేశవ్యాప్తంగా అత్యంత సున్నితమైన ప్రశ్నపత్రాల రవాణాకు కేంద్ర ప్రభుత్వం భారత వైమానిక దళం సేవలను వినియోగిస్తోంది. ప్రశ్నపత్రాలను వివిధ ప్రాంతాలకు అత్యంత భద్రంగా, వేగంగా తరలించేందుకు ప్రత్యేక విమానాలను ఉపయోగిస్తోంది. ప్రశ్నపత్రాల తయారీ, అనువాదం, పరిశీలన ప్రక్రియలో పాల్గొనే నిపుణులను బయటి ప్రపంచంతో సంబంధం లేని అత్యంత రహస్య ప్రాంతాల్లో ఉంచి మొత్తం ప్రక్రియను నిర్వహించడం ద్వారా లీకేజీలకు తావులేకుండా చర్యలు చేపట్టింది. సాంకేతిక పరంగా కూడా ఎన్‌టీఏ ప్రత్యేక చర్యలు తీసుకుంది. పేపర్ లీక్ పుకార్లు, నకిలీ ప్రశ్నపత్రాల ప్రచారం జరుగుతున్న సామాజిక మాధ్యమాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థలు, బయోమెట్రిక్ తనిఖీలు, సీసీ కెమెరాల ఫోరెన్సిక్ విశ్లేషణల ద్వారా అక్రమాలను గుర్తించే విధానాలను అమలు చేస్తున్నారు. విద్యార్థులు లేదా ప్రజలు నకిలీ ప్రశ్నపత్రాలు, పుకార్లు, మధ్యవర్తుల మోసాలపై ఆధారాలతో ఫిర్యాదు చేయడానికి మైగవ్ భాగస్వామ్యంతో ప్రత్యేక ఫ్రాడ్ రిపోర్టింగ్ వేదికను అందుబాటులోకి తీసుకొచ్చారు. జిల్లా స్థాయిలో పటిష్ట నిఘా కోసం సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసులు, రెవెన్యూ, పరిపాలన, నిఘా విభాగాల అధికారులు ఇందులో భాగస్వాములయ్యారు. భవిష్యత్తులో ప్రస్తుతం అమలులో ఉన్న పెన్ అండ్ పేపర్ విధానానికి బదులుగా కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానాన్ని ప్రవేశపెట్టే అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.
చిత్తూరు జిల్లాలో పరీక్షల నిర్వహణ కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆధ్వర్యంలో ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక డీఎస్పీ స్థాయి అధికారిని నియమించారు. అదనంగా ఇద్దరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, ఐదుగురు ఎస్‌ఐలు, 50 మంది పోలీసు సిబ్బంది చొప్పున భద్రతా విధుల్లో ఉండనున్నారు. మొత్తం ముగ్గురు డీఎస్పీలు, ఆరుగురు ఇన్‌స్పెక్టర్లు, 15 మంది ఎస్‌ఐలు, 150 మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొంటున్నారు. ప్రశ్నపత్రాల రవాణాను పోలీసు ఎస్కార్ట్ ఆధ్వర్యంలో వీడియో చిత్రీకరణ మధ్య నిర్వహించనున్నారు. పరీక్షా కేంద్రాల్లో ప్రతి హాలులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. విద్యుత్ అంతరాయం తలెత్తకుండా జనరేటర్లు సిద్ధంగా ఉంచారు. అత్యవసర పరిస్థితుల కోసం అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉంచారు. దివ్యాంగ విద్యార్థులకు వీల్‌చైర్లు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వెలుపల తల్లిదండ్రులు వేచి ఉండేందుకు షామియానాలు, తాగునీటి సదుపాయాలు కల్పించారు. విద్యార్థులు సమయానికి కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచింది. పరీక్షా హాలులోకి మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, బ్లూటూత్ పరికరాలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావడాన్ని పూర్తిగా నిషేధించారు. ఇన్విజిలేటర్లు కూడా ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదని అధికారులు స్పష్టం చేశారు. ప్రతి కేంద్రంలో రెవెన్యూ, పోలీసు శాఖల తరఫున ప్రత్యేక నోడల్ అధికారులను నియమించి నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నారు. అక్రమాలకు పాల్పడే వారిపై పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) చట్టం-2024 కింద కఠిన చర్యలు, భారీ జరిమానాలు, జైలు శిక్షలు అమలులో ఉన్నాయని అధికారులు హెచ్చరించారు. విద్యార్థులు హాల్‌టికెట్‌లో పేర్కొన్న సూచనలను తప్పనిసరిగా పాటిస్తూ, ఎలాంటి ఆందోళనకు గురికాకుండా పరీక్షపై పూర్తి దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఈ కీలక పరీక్షను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించడం అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు.

