24, జూన్ 2026, బుధవారం

పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రూ.304.86 కోట్ల అభివృద్ధి పనులు

పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రూ.304.86 కోట్ల అభివృద్ధి పనులు

విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, గ్రామ పంచాయతీ భవనాలు, రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యం

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన వైద్య, రవాణా, పరిపాలనా సేవలు అందించేందుకు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాలో రూ.304.86 కోట్ల వ్యయంతో 1,934 అభివృద్ధి పనులు చేపట్టారు. వీటిలో 179 పనులు పూర్తికాగా, 610 పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి.

ఉపాధి హామీ పథకం కింద అత్యధికంగా 1,708 పనులకు రూ.18,505.69 కోట్ల పరిపాలన అనుమతులు మంజూరయ్యాయి. చెరువుల అభివృద్ధి, గ్రామీణ మౌలిక సదుపాయాలు, నీటి సంరక్షణ, పచ్చదనం పెంపు వంటి పనులు ఇందులో భాగంగా చేపడుతున్నారు. ఇప్పటివరకు 70 పనులు పూర్తికాగా, 599 పనులు పురోగతిలో ఉన్నాయి. మరో 1,039 పనులు ప్రారంభం కావాల్సి ఉంది. గ్రామీణ ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలను గ్రామ స్థాయిలోనే అందించేందుకు విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, సబ్ హెల్త్ సెంటర్-హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్ భవనాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చారు. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల పథకం కింద మూడు భవనాల నిర్మాణ పనులకు రూ.165 కోట్ల అనుమతులు లభించగా, మూడు పనులు పూర్తయ్యాయి. అలాగే 15వ ఆర్థిక సంఘం నిధులతో 57 ఆరోగ్య కేంద్రాల భవనాలకు రూ.2,052 కోట్ల మంజూరు చేయగా, 41 భవనాల నిర్మాణం పూర్తయింది. మరో 16 పనులు ప్రారంభం కావాల్సి ఉంది. విలేజ్ హెల్త్ క్లినిక్‌ల ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు సాధారణ వైద్య పరీక్షలు, గర్భిణులు, బాలింతలకు వైద్య సేవలు, రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల గుర్తింపు, మందుల పంపిణీ వంటి సేవలు అందుబాటులోకి వస్తాయి. దీంతో గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లే అవసరం తగ్గి, ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు చేరువ కానున్నాయి. గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి 17 పనులకు రూ.544 కోట్ల పరిపాలన అనుమతులు లభించాయి. వీటిలో 14 భవనాలు పూర్తయ్యాయి. గ్రామ సభలు, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, గ్రామస్థాయిలో పరిపాలన నిర్వహణకు ఈ భవనాలు కేంద్రాలుగా ఉపయోగపడనున్నాయి.

ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద నాలుగు రహదారి పనులకు రూ.2,739.40 కోట్ల పరిపాలన అనుమతులు మంజూరయ్యాయి. గ్రామాలను ప్రధాన రహదారులతో అనుసంధానం చేయడం, మారుమూల ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు కల్పించడం, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాను సులభతరం చేయడం ఈ పథకం లక్ష్యం. రెండు పనులు పూర్తికాగా, ఒక పని కొనసాగుతోంది. మరో మూడు పనులు నిలిచిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. నాబార్డ్ రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ (ఆర్‌ఐడీఎఫ్) ట్రాంచ్-29, 30 కింద 27 పనులకు రూ.5,001 కోట్ల పరిపాలన అనుమతులు మంజూరయ్యాయి. ఈ నిధులతో గ్రామీణ రహదారులు, వంతెనలు, మురుగు కాలువలు, తాగునీటి సదుపాయాలు, సాగునీటి సంబంధిత మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపడుతున్నారు. వీటిలో 14 పనులు పూర్తికాగా, ఎనిమిది పనులు కొనసాగుతున్నాయి. మరో ఐదు పనులు ప్రారంభం కావాల్సి ఉంది. మొత్తంగా జిల్లాలో చేపట్టిన ఈ పనులు గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు, రహదారులు, గ్రామ పరిపాలన, మౌలిక వసతుల అభివృద్ధికి దోహదపడనున్నాయని పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు. త్వరితగతిన మిగిలిన పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *