3, జూన్ 2026, బుధవారం

భగ్గుమన్న కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు


భగ్గుమన్న కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు 
ఖరీఫ్‌ ముంగిట రైతుపై ఎరువుల ధరల పిడుగు
బస్తాపై రూ.300 నుంచి రూ.600 వరకు పెంపు
మామిడి, చెరకు, టమోటా, వరి రైతులపై భారీ భారం
కృత్రిమ కొరత, అధిక ధరలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభానికి ముందే కాంప్లెక్స్ ఎరువుల ధరలు అమాంతం పెరిగాయి. దీంతో చిత్తూరు జిల్లా రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే విత్తనాలు, కూలీల వేతనాలు, డీజిల్‌, విద్యుత్‌, పురుగుమందుల ధరల పెరుగుదలతో వ్యవసాయ ఖర్చులు అదుపుతప్పాయి. ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఎరువుల ధరల మోత రైతులకు మరో పెద్ద భారంగా మారింది. ముఖ్యంగా కాంప్లెక్స్‌ ఎరువుల ధరలను ఎరువుల తయారీ సంస్థలు వరుసగా పెంచుతున్నాయి. దీంతో రైతులు ఈ ఖరీఫ్‌ సీజన్‌ను ఎలా ఎదుర్కోవాలనే ఆందోళనలో ఉన్నారు. ఒక్కో బస్తాపై రూ.300 నుంచి రూ.600 వరకు ధరలు పెరగడంతో సాగు వ్యయం గణనీయంగా పెరిగిపోతోంది.

చిత్తూరు జిల్లాలో వరి, చెరకు, మామిడి, టమోటా, వేరుశనగ, కూరగాయల సాగు పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ పంటలన్నింటికీ అధికంగా కాంప్లెక్స్‌ ఎరువులు వినియోగించాల్సి వస్తుంది. ప్రస్తుతం 12-32-16, 14-35-14, 24-24-0, 10-26-26, 16-20-0-13, 16-16-16 వంటి ఎరువుల ధరలు భారీగా పెరిగాయి. గతంలో రూ.1900 నుంచి రూ.2000 మధ్య ఉన్న కొన్ని ఎరువుల బస్తాలు ఇప్పుడు రూ.2450 వరకు చేరుకోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతకాలం క్రితం రూ.1400 ఉన్న కొన్ని రకాల ఎరువులు ఇప్పుడు రూ.2000 దాటిపోవడం రైతులను కలవరపెడుతోంది. మే నెలలోనే రెండు సార్లు ధరలు పెంచిన కంపెనీలు ఇప్పుడు మూడోసారి కూడా పెంపునకు సిద్ధమవుతున్నట్లు రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. జిల్లాలోని పలమనేరు, బంగారుపాళ్యం, పూతలపట్టు, గంగవరం, యాదమరి,  రామకుప్పం ప్రాంతాల్లో మామిడి తోటలు వేలాది ఎకరాల్లో సాగవుతున్నాయి. మామిడి తోటల నిర్వహణలో ఎరువుల వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ఒక్కో రైతు సీజన్‌కు 20 నుంచి 50 బస్తాల వరకు ఎరువులు వినియోగించాల్సి వస్తుంది. తాజా ధరల పెంపుతో ఒక్కో రైతుపై వేల రూపాయల అదనపు భారం పడుతోంది. ఇప్పటికే మామిడి దిగుబడులకు గిట్టుబాటు ధరలు రాకపోవడంతో నష్టాల్లో ఉన్న రైతులకు ఇప్పుడు ఎరువుల ధరల పెంపు మరింత కష్టాలను తెచ్చిపెట్టింది. జిల్లాలో టమోటా, కూరగాయల సాగు అధికంగా జరుగుతోంది. ఈ పంటలకు ఎరువుల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఎకరానికి వందల కిలోల ఎరువులు అవసరమవుతాయి. ప్రస్తుతం ఎరువుల ధరలు పెరగడంతో ఒక ఎకరం సాగు ఖర్చు గణనీయంగా పెరిగిందని రైతులు చెబుతున్నారు. విత్తనాల ధరలు, కార్మికుల కూలీలు, పురుగుమందుల ఖర్చులు ఇప్పటికే పెరిగిపోయిన తరుణంలో ఎరువుల ధరల పెంపు రైతులకు తట్టుకోలేని భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 *కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారస్తులు*

ఎరువుల ధరల పెంపుతో పాటు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో కృత్రిమ కొరత కూడా రైతులను వేధిస్తోంది. యూరియా, డీఏపీ వంటి ఎరువులు సరిపడా అందుబాటులో లేకపోవడంతో రైతులు అంగళ్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతులకు అవసరమైన ఎరువులను పూర్తిస్థాయిలో ఇవ్వకుండా కొంతమంది డీలర్లు లింక్‌ ఎరువులు కొనుగోలు చేయాలని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతర ఎరువులు తీసుకుంటేనే యూరియా ఇస్తాం అంటూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు రైతులు చెబుతున్నారు. యూరియా బస్తా అధికారిక ధర రూ.266 మాత్రమే. ధర పెరగలేదు. అయినా కొన్ని ప్రాంతాల్లో అదనంగా రూ.100 నుంచి రూ.150 వరకు వసూలు చేస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. డీఏపీ ఎరువుల ధర అధికారికంగా తక్కువగానే ఉన్నప్పటికీ మార్కెట్‌లో మాత్రం అధిక ధరలకు విక్రయిస్తున్నారని వాపోతున్నారు. కొరత పేరుతో కొంతమంది వ్యాపారులు రైతులను దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో రాజకీయ ప్రభావం ఉన్నవారికి, పెద్ద రైతులకు ముందుగా ఎరువులు అందుతున్నాయని, చిన్న, సన్నకారు రైతులు మాత్రం రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

*ఎరువులపై యుద్ధ ప్రభావం*

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి సరుకుల ధరల పెరుగుదల, యుద్ధ పరిస్థితులు, రవాణా ఖర్చులు అధికమవడం, రూపాయి విలువ పడిపోవడం వంటి కారణాలతో ఉత్పత్తి వ్యయం పెరిగిందని ఎరువుల కంపెనీలు చెబుతున్నాయి. అయితే రైతులు మాత్రం దీనిని అంగీకరించడం లేదు. పాత ధరలతో కొనుగోలు చేసిన ముడి సరుకులతో తయారైన ఎరువులకే కొత్త ఎంఆర్‌పీలు ముద్రించి విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పాత స్టాక్‌ను కూడా కొత్త ధరలకు అమ్ముతూ రైతులపై అదనపు భారం మోపుతున్నారని మండిపడుతున్నారు. ఎరువుల ధరల నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మారడం లేదని రైతులు చెబుతున్నారు. ఎంఆర్‌పీ కంటే అధిక ధరలకు విక్రయించే డీలర్లపై చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల్లో కూడా అవసరమైన ఎరువులు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.

*సరిపడ ఎరువులను అందుబాటులో ఉంచాలి*

రాబోయే ఖరీఫ్‌ సీజన్‌లో చిత్తూరు జిల్లాకు సరిపడా ఎరువుల నిల్వలను ముందుగానే అందుబాటులో ఉంచాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కృత్రిమ కొరత సృష్టించే డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, బ్లాక్‌ మార్కెట్‌ను అరికట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఎంఆర్‌పీ ధరలకే ఎరువులు అందేలా ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. వ్యవసాయం ఇప్పటికే నష్టాల బాటలో నడుస్తోందని, ఇలాంటి సమయంలో ఎరువుల ధరల పెంపు రైతును మరింత అప్పుల బారిన పడేస్తోందని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది. రైతు బతికితేనే దేశం బతుకుతుందని చెప్పే ప్రభుత్వాలు ఇప్పుడు రైతుల కష్టాలను అర్థం చేసుకుని వెంటనే జోక్యం చేసుకోవాలని, ఎరువుల ధరలను నియంత్రించి రైతాంగాన్ని ఆదుకోవాలని జిల్లావ్యాప్తంగా రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *