11, జూన్ 2026, గురువారం

కీలక మలుపు తిరిగిన అట్రాసిటీ కేసు

కీలక మలుపు తిరిగిన అట్రాసిటీ కేసు
ఈ కేసులో ఫిర్యాదును ఉపసంహరించుకున్న కవిత
టీడీపీలో సద్దుమణిగిన వర్గ విభేదాలు
ఊపిరి పీల్చుకున్న కేసులో నిందితులు

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)

చిత్తూరు రాజకీయాలను గత కొద్ది వారాలుగా కుదిపేసిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఫిర్యాదుదారైన మోప్మా రిసోర్స్ పర్సన్ బి. కవిత తన ఫిర్యాదును ఉపసంహరించుకోవడంతో రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసిన వివాదం సద్దుమణిగినట్లు కనిపిస్తోంది. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన ఘటన ఆధారంగా నమోదైన ఈ కేసు కేవలం న్యాయపరమైన అంశంగా కాకుండా అధికార పార్టీ అంతర్గత రాజకీయాలకు కేంద్రబిందువుగా మారింది. కేసు నమోదు, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు, ఎమ్మెల్యే స్పందన, రాష్ట్ర నాయకత్వం జోక్యం, చివరకు ఫిర్యాదు ఉపసంహరణ వరకు జరిగిన పరిణామాలు జిల్లా రాజకీయాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తించాయి.

ఏప్రిల్ 28న చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని మోప్మా విభాగంలో జరిగిన సంఘటనకు సంబంధించి బి. కవిత ఫిర్యాదు మేరకు చిత్తూరు వన్ టౌన్ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంతో పాటు భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఫిర్యాదులో ఏ-1 మౌళి, ఏ-2 జాగా, ఏ-3 శ్రీనివాసులు, ఏ-4 యమునా, ఏ-5 రేఖ, ఏ-6 వరలక్ష్మి, ఏ-7 దుర్గ, ఏ-8 రాణి, ఏ-10 సుమతి, ఏ-11 భవ్యలత, ఏ-12 మాధవి తదితరుల పేర్లు ఉన్నాయి. ఫిర్యాదు ప్రకారం నిందితులు గుంపుగా కార్యాలయానికి చేరుకుని తనను ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారని, అసభ్య పదజాలంతో దూషించారని, నిర్బంధించి వేధించారని, శారీరకంగా తోసిపుచ్చారని, ఏ-5 రేఖ కాళ్లు తాకాలని బలవంతం చేశారని పేర్కొన్నారు. అంతేకాకుండా అక్కడ విధుల్లో ఉన్న సిబ్బందిని కూడా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించినట్లు ఆరోపించారు. ఈ వ్యవహారం సాధారణ ఫిర్యాదుగా ప్రారంభమైనప్పటికీ రాజకీయంగా పెద్ద దుమారం రేపింది. చిత్తూరుకు చెందిన ఒక ప్రజాప్రతినిధి ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది. అయితే కేసులో పేర్లు ఉన్న వారిలో ఎక్కువ మంది చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌కు సన్నిహితులుగా గుర్తింపు పొందిన కార్యకర్తలు కావడంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. ఒక ప్రజాప్రతినిధి ఫిర్యాదు ఆధారంగా మరో ప్రజాప్రతినిధి అనుచరులపై అట్రాసిటీ కేసు నమోదు కావడం అధికార పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

తన అనుచరులపై అట్రాసిటీ కేసు నమోదు కావడాన్ని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తీవ్రంగా పరిగణించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. కేసు నమోదు విధానం, తనకు సరైన సమాచారం అందించకపోవడం, జరిగిన సంఘటనను అతిశయోక్తిగా చూపించడం వంటి అంశాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నిరసనలో భాగంగానే తనకు ప్రభుత్వం కేటాయించిన గన్‌మెన్లను వెనక్కి పంపించారు. ప్రభుత్వ భద్రత అవసరం లేదని ప్రకటించడం రాజకీయంగా సంచలనంగా మారింది. ఎమ్మెల్యే తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమై పార్టీ నాయకత్వం దృష్టిని ఆకర్షించింది. ఈ కేసు కారణంగా చిత్తూరు తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే స్థానికంగా ఉన్న విభేదాలు ఈ కేసుతో మరింత స్పష్టంగా కనిపించాయని భావించారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా ఉండేందుకు రాష్ట్ర నాయకత్వం రంగంలోకి దిగినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిసింది. ఇరు వర్గాలతో సంప్రదింపులు జరిపి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నాలు చేపట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

వివాదానికి ముగింపు పలికే దిశగా చిత్తూరు పార్లమెంట్ సభ్యుడు దగ్గుమళ్ల ప్రసాదరావు స్వయంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నివాసానికి వెళ్లి సమావేశమైనట్లు సమాచారం. ఈ సమావేశంలో నెలకొన్న అపోహలు, అసంతృప్తులు, పార్టీకి కలుగుతున్న నష్టం వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అనంతరం ఇరు వర్గాల మధ్య రాజీ కుదిరినట్లు ప్రచారం సాగింది. ఈ పరిణామాల తర్వాతే ఫిర్యాదుదారు కవిత తన ఫిర్యాదును ఉపసంహరించుకోవడం రాజకీయంగా మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఫిర్యాదు ఉపసంహరణతో కేసులో పేర్లు ఉన్న నిందితులు, వారి కుటుంబ సభ్యులు, మద్దతుదారులు ఊపిరి పీల్చుకున్నారు. అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు కావడంతో గత కొన్ని రోజులుగా వారిలో తీవ్ర ఆందోళన నెలకొంది. రాజకీయ భవిష్యత్తు, సామాజిక ప్రతిష్ట, న్యాయపరమైన ఇబ్బందులపై వారు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఫిర్యాదుదారే వెనక్కి తగ్గడంతో వారికి గణనీయమైన ఉపశమనం లభించినట్లు తెలుస్తోంది. మరోవైపు చిత్తూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఈ పరిణామాన్ని స్వాగతిస్తున్నారు. పార్టీ అంతర్గత విభేదాలు బయటపడటం వల్ల కార్యకర్తలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ వివాదం కొనసాగితే పార్టీకి రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఫిర్యాదు ఉపసంహరణ, ఇరు వర్గాల మధ్య రాజీ కుదిరినట్లు వస్తున్న సంకేతాలతో పార్టీ శ్రేణుల్లో ఉపశమనం కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే చిత్తూరు రాజకీయాలను కుదిపేసిన ఈ అట్రాసిటీ కేసు ప్రస్తుతం కీలక మలుపు తిరిగి, వివాదానికి తాత్కాలికంగా తెరపడిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ పరిణామాలు భవిష్యత్తులో స్థానిక రాజకీయ సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది ఆసక్తికరంగా మారింది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *