తిరుపతి బుల్లెట్ రైలు లింక్‌కు రైల్వే కార్పొరేషన్ అంగీకారం
చిత్తూరు–తిరుపతి బుల్లెట్ రైలు లింక్‌కు రైల్వే కార్పొరేషన్ అంగీకారం
అమరావతి మీదుగానే హైదరాబాద్–చెన్నై హైస్పీడ్ కారిడార్..
దక్షిణ భారత బుల్లెట్ రైలు కేంద్రంగా ఏపీ
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)
దేశంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న హైస్పీడ్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్లో ఆంధ్రప్రదేశ్‌కు కీలక ప్రాధాన్యం దక్కనుంది. హైదరాబాద్–అమరావతి–చెన్నై హైస్పీడ్ రైలు కారిడార్‌ను అమరావతి మీదుగానే నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్) సానుకూలంగా స్పందించింది. అదే సమయంలో చెన్నై–బెంగళూరు హైస్పీడ్ కారిడార్‌లోని చిత్తూరును, హైదరాబాద్–చెన్నై కారిడార్‌లోని తిరుపతితో అనుసంధానించే ప్రత్యేక బుల్లెట్ రైలు లింక్ కారిడార్ ప్రతిపాదనకు కూడా ప్రాథమిక అంగీకారం లభించింది. దీంతో దక్షిణ భారతదేశంలోని ప్రధాన హైస్పీడ్ రైలు మార్గాలు పరస్పరం అనుసంధానమయ్యే అవకాశం ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు చిత్తూరు–తిరుపతి మధ్య సుమారు 65 కిలోమీటర్ల పొడవున ప్రత్యేక హైస్పీడ్ లింక్ కారిడార్ ఏర్పాటును ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్ పరిశీలిస్తోంది. దీనికి సంబంధించి తుది స్థల నిర్ధారణ సర్వే, వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక తయారీకి సంస్థ అంగీకరించింది. నివేదిక సిద్ధమైన అనంతరం కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖకు పంపించి తుది ఆమోదం పొందనున్నారు. ఈ లింక్ కారిడార్ ఏర్పడితే చెన్నై–బెంగళూరు, హైదరాబాద్–చెన్నై హైస్పీడ్ మార్గాలు నేరుగా అనుసంధానమవుతాయి. ఫలితంగా బెంగళూరు నుంచి చిత్తూరు, తిరుపతి మీదుగా అమరావతి వరకు నేరుగా బుల్లెట్ రైలు ప్రయాణం సాధ్యమవుతుంది.
హైదరాబాద్–అమరావతి–చెన్నై హైస్పీడ్ కారిడార్ మొత్తం 760.09 కిలోమీటర్ల మేర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మీదుగా విస్తరించనుంది. ఇందులో తెలంగాణలో 180.32 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా 518.54 కిలోమీటర్లు, తమిళనాడులో 61.23 కిలోమీటర్ల మేర మార్గం ఉండనుంది. మొత్తం 18 స్టేషన్లను ప్రతిపాదించారు. తెలంగాణలో హైదరాబాద్, శంషాబాద్, భారత్ సిటీ, డ్రైపోర్ట్, హాలియా, వాడపల్లి స్టేషన్లు ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో దాచేపల్లి, అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, తిరుపతి స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. తమిళనాడులో తిరువళ్లూరు, చెన్నై ఔటర్ రింగ్ రోడ్–మింజూర్, చెన్నై సెంట్రల్ స్టేషన్లు ప్రతిపాదించారు. అమరావతి సమీపంలోని రావెల వద్ద ప్రతిపాదిత అంతర్జాతీయ విమానాశ్రయాన్ని దృష్టిలో ఉంచుకుని కారిడార్ మార్గంలో మార్పులు చేయాలనే ప్రతిపాదన వచ్చినప్పటికీ, అమరావతి నగరానికి సౌకర్యవంతంగా ఉండేలా మొదట ప్రతిపాదించిన మార్గానికే ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా తుది స్థల సర్వే, వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలను సిద్ధం చేయాలని ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌కు సూచించింది. చెన్నై–బెంగళూరు హైస్పీడ్ కారిడార్‌లో భాగంగా చిత్తూరు జిల్లాకు ప్రత్యేక ప్రాధాన్యం లభించనుంది. మొత్తం 306 కిలోమీటర్ల పొడవున్న ఈ కారిడార్‌లో తమిళనాడులో 133 కిలోమీటర్లు, కర్ణాటకలో 101 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్‌లో 72 కిలోమీటర్ల మేర మార్గం ఉండనుంది. ఈ మార్గంలో చిత్తూరు ప్రధాన స్టేషన్‌గా ఉండనుండగా, మూడు రాష్ట్రాల్లో కలిపి మొత్తం ఏడు స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని కౌండిన్య వన్యప్రాణుల అభయారణ్యం మీదుగా బుల్లెట్ రైలు మార్గం వెళ్లనున్న నేపథ్యంలో వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా 11.8 కిలోమీటర్ల పొడవున సొరంగ మార్గాన్ని నిర్మించనున్నారు. ఈ ప్రత్యేక సొరంగ నిర్మాణం దేశంలోనే అత్యాధునిక ఇంజినీరింగ్ సాంకేతికతకు నిదర్శనంగా నిలవనుంది. అటవీ ప్రాంతానికి ఎలాంటి నష్టం కలగకుండా ప్రాజెక్టును అమలు చేయడానికి ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. మరోవైపు హైదరాబాద్–బెంగళూరు హైస్పీడ్ కారిడార్ మొత్తం 597 కిలోమీటర్ల మేర విస్తరించనుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా 264 కిలోమీటర్ల మార్గం ఉండనుండగా, తెలంగాణలో 239 కిలోమీటర్లు, కర్ణాటకలో 94 కిలోమీటర్ల మేర విస్తరించనుంది. ఈ మార్గంలో కర్నూలు, డోన్, గుత్తి, అనంతపురం, దుద్దేబండ, హిందూపురం ప్రాంతాలకు హైస్పీడ్ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. మూడు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 15 స్టేషన్లు ప్రతిపాదించారు. చిత్తూరు–తిరుపతి లింక్ కారిడార్‌కు ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్ ప్రాథమిక అంగీకారం తెలపడం రాయలసీమకు పెద్ద ఊరటనిచ్చే అంశంగా భావిస్తున్నారు. ఈ లింక్ ద్వారా చిత్తూరు, తిరుపతి ప్రాంతాలు దేశంలోని ప్రధాన హైస్పీడ్ రైలు నెట్‌వర్క్‌లో భాగమవుతాయి. పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక రంగాలకు భారీ ఊతం లభించనుంది. ముఖ్యంగా తిరుమల పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు వేగవంతమైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మూడు ప్రధాన బుల్లెట్ రైలు కారిడార్లు, చిత్తూరు–తిరుపతి ప్రత్యేక లింక్ కారిడార్ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారత హైస్పీడ్ రైలు వ్యవస్థకు కేంద్ర బిందువుగా మారనుంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అమరావతి నగరాలను ఒకే నెట్‌వర్క్‌లో అనుసంధానం చేయడం ద్వారా పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడులు, పర్యాటకం, ఉపాధి అవకాశాలకు కొత్త ఊపిరి లభించనుంది. ప్రస్తుతం సర్వేలు, డీపీఆర్ తయారీ ప్రక్రియలను వేగవంతం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులను ఆదేశించడంతో ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల అమలుపై ఆశలు పెరిగాయి.

