యాదమరి గ్రామ అభివృద్ధికి బహుముఖ ప్రణాళికలు
యాదమరిని బహుముఖ అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు
ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి అందజేసిన అధికారులు
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)
చిత్తూరు జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న యాదమరి గ్రామాన్ని వ్యవసాయం, విద్య, రవాణా, పర్యాటకం, గ్రామీణ పరిశ్రమల కేంద్రంగా అభివృద్ధి చేయడానికి సమగ్ర ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. గత నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యాదమరి పర్యటన సందర్భంగా జిల్లా అధికారులు ఈ మేరకు ప్రతిపాదనలనుసిద్ధం చేశారు. ముఖ్యమంత్రికి అందజేశారు. ముఖ్యమంత్రి ఈ ప్రతిపాదనలను ఆమోదించినట్లు సమాచారం. తమిళనాడు రాష్ట్ర సరిహద్దుకు 15 కిలోమీటర్లు, చిత్తూరు జిల్లా కేంద్రానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల యాదమరికి ప్రత్యేక భౌగోళిక ప్రాధాన్యం ఏర్పడింది. వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులను ప్రోత్సహించడం, అగ్రిటెక్ వినియోగాన్ని పెంపొందించడం, ఆహార ప్రాసెసింగ్ విలువ ఆధారిత వ్యవస్థలను అభివృద్ధి చేయడం, సేంద్రియ ఉత్పత్తులకు ప్రత్యేక మార్కెట్లు అన్వేషించడం వంటి అంశాలపై దృష్టి సారిస్తున్నారు. రైతుల ఆదాయం పెంచేందుకు పంటల ప్రాసెసింగ్ యూనిట్లు, నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నారు.
పశుసంవర్ధక రంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా పశువుల ఉత్పాదకత పెంపు, మేత మరియు దాణా భద్రతకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పశువులకు బీమా, రుణ సదుపాయాలను విస్తరించి రైతులను ఆర్థిక నష్టాల నుంచి రక్షించే చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. పాల సేకరణ కేంద్రాలు, పచ్చిక సాగు, కోల్డ్ స్టోరేజ్, రవాణా సదుపాయాల విస్తరణ ద్వారా అనుబంధ రంగాల ఆదాయం పెంచే ప్రణాళికలు రూపొందిస్తున్నారు జాతీయ రహదారి–69 యాదమరి సమీపంలో ఉండటంతో గ్రామాన్ని గ్రామీణ లాజిస్టిక్స్, రవాణా హబ్‌గా తీర్చిదిద్దే యోచన చేస్తున్నారు. ట్రక్ పార్కింగ్ కేంద్రాలు, మినీ గిడ్డంగులు, లోడింగ్ పాయింట్లు, రవాణా కార్యాలయాలు, లాజిస్టిక్స్ సేవలు ఏర్పాటు చేసి ప్రాంతీయ వాణిజ్య రవాణాను బలోపేతం చేయాలని ప్రతిపాదిస్తున్నారు. పరిసర గ్రామాల విద్యార్థులు యాదమరిపై ఆధారపడుతున్న నేపథ్యంలో విద్యా, నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా గ్రామాన్ని తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిజిటల్ లెర్నింగ్ కేంద్రాలు, నైపుణ్య శిక్షణ సంస్థలను మరింత బలోపేతం చేయాలని యోచిస్తున్నారు. గ్రామీణ సూక్ష్మ పరిశ్రమలకు ప్రోత్సాహం అందించేందుకు ఫ్యాబ్రికేషన్ వర్క్‌షాప్‌లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, రిపేర్ కేంద్రాలు, కొబ్బరి పీచు ఆధారిత కోయిర్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నారు. దీని ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు. చిత్తూరు నగరానికి సమీపంలో ఉండటం, తక్కువ ధరలకు భూములు అందుబాటులో ఉండటంతో గృహ నిర్మాణ రంగానికి కూడా యాదమరిలో మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ అభివృద్ధి, గృహ నిర్మాణాల పెంపుతో మౌలిక సదుపాయాల విస్తరణకు చర్యలు తీసుకోవాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
పర్యాటక కేంద్రంగా వెదురుల చెరువు
వెదుర్ల చెరువును పర్యాటక, వినోద కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్‌లు, పచ్చదనం, బోటింగ్, విద్యుత్ అలంకరణలు, ఫుడ్ కియోస్క్‌లు, కూర్చునే ప్రదేశాలు, సాంస్కృతిక కార్యక్రమాల వేదికలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దీని ద్వారా స్థానిక వ్యాపారాలకు ఊతం లభించడంతో పాటు పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు.
ఆధ్యాత్మిక కేంద్రంగా వరదరాజస్వామి ఆలయం
యాదమరిలోని వరదరాజస్వామి ఆలయం కూడా భక్తులకు ప్రత్యేక ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోంది. పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే ఈ ఆలయాన్ని ఆలయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. వ్యవసాయం నుంచి పర్యాటకం వరకు అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రూపొందుతున్న ఈ ప్రణాళికలు అమలైతే యాదమరి గ్రామం ప్రాంతీయ అభివృద్ధికి ఆదర్శంగా నిలుస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

