6, జూన్ 2026, శనివారం

ఫ్యాక్టరీల నిర్లక్ష్యంతో మామిడి రైతుల్లో ఆందోళన

 ఫ్యాక్టరీల నిర్లక్ష్యంతో మామిడి రైతుల్లో ఆందోళన

కొనుగోళ్లలో జాప్యంతో రైతుల గుండెల్లో గుబులు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 78 వేల హెక్టార్లలో సాగు..

 7.80 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)

 చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడి రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటామని, నాణ్యమైన ప్రతి పండును కొనుగోలు చేస్తామని ప్రకటిస్తుండగా, మరోవైపు జిల్లాలోని మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులు ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రైతులు అయోమయంలో పడిపోయారు. చెట్లపై పక్వానికి వచ్చిన మామిడికాయలను కోయాలా.. వద్దా అనే సందిగ్ధ పరిస్థితి నెలకొంది. చిత్తూరు జిల్లా రాష్ట్రంలోనే తోతాపురి మామిడి సాగుకు ప్రధాన కేంద్రంగా ఉంది. జిల్లాలో సుమారు 78 వేల హెక్టార్లలో తోతాపురి మామిడి సాగు జరుగుతోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది రైతులు, కూలీలు, వ్యాపారులు ఈ పంటపై ఆధారపడి జీవిస్తున్నారు. ఉద్యానవన శాఖ అంచనాల ప్రకారం ఈ ఏడాది జిల్లాలో సుమారు 7.80 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడి ఉత్పత్తి కానుంది. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా 25 నుంచి 30 శాతం వరకు దిగుబడి తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో మొత్తం 44 మామిడి గుజ్జు ప్రాసెసింగ్ పరిశ్రమలు ఉండగా, చిత్తూరు జిల్లా పరిధిలో సుమారు 31 పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో ఇప్పటివరకు 24 పరిశ్రమలు మాత్రమే ప్రారంభమయ్యాయి. వాటిలో కూడా కేవలం 14 పరిశ్రమలు మాత్రమే తోతాపురి మామిడిని కొనుగోలు చేస్తున్నాయి. అదీ పూర్తిస్థాయిలో కాకుండా మొక్కుబడిగా కొనుగోళ్లు సాగిస్తున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా రెండు కన్వేయర్ బెల్టులతో పనిచేసే పరిశ్రమలు ప్రస్తుతం ఒకే బెల్టుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ప్రకారం రైతులు కిలోకు రూ.7 చొప్పున మామిడిని విక్రయిస్తున్నారు. అయితే అంతర్జాతీయ పరిస్థితులు ఈసారి మామిడి మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, గల్ఫ్ దేశాల్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా అక్కడి దిగుమతిదారులు పెద్దఎత్తున కొనుగోలు ఆర్డర్లు ఇవ్వడం లేదు. సాధారణంగా చిత్తూరు జిల్లాలోని మామిడి పరిశ్రమలు గల్ఫ్ దేశాల వ్యాపారుల నుంచి ఆర్డర్లు పొంది మామిడి గుజ్జును తయారు చేసి ఎగుమతి చేస్తుంటాయి. ఈసారి ఆ ఆర్డర్లు తగ్గిపోవడంతో పరిశ్రమల యజమానులు కొనుగోళ్ల విషయంలో వెనుకంజ వేస్తున్నారు. చాలా పరిశ్రమలు జాబ్ వర్క్ విధానంలో పనిచేస్తుంటాయి. అంటే వ్యాపారులు ఇచ్చిన ఆర్డర్ల మేరకు మాత్రమే గుజ్జును తయారు చేస్తాయి. ప్రస్తుతం వ్యాపారులు కిలోకు రూ.6 విలువైన మామిడితోనే గుజ్జు తయారు చేయాలని సూచిస్తుండగా, రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.7గా ఉండటంతో పరిశ్రమల యజమానులు నష్టాల భయంతో కొనుగోళ్లను పరిమితం చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం జిల్లా కలెక్టర్ పరిశ్రమల యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి అన్ని ఫ్యాక్టరీలను ప్రారంభించి రైతుల నుంచి తోతాపురి మామిడిని కొనుగోలు చేయాలని కోరారు. అనంతరం పరిస్థితిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్వయంగా సమీక్షించారు. విజయవాడలో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో కోకాకోలా, పార్లే, పెప్సీ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు, పల్ప్ పరిశ్రమల యజమానులు, జిల్లాల కలెక్టర్లతో చర్చించారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. నాణ్యమైన ప్రతి పండును కొనుగోలు చేస్తామని, చివరి పండు వరకు మార్కెట్ సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. వ్యాపారుల ద్వారా కాకుండా నేరుగా రైతుల నుంచే పండ్లను కొనుగోలు చేయాలని పల్ప్ పరిశ్రమలను ఆదేశించారు. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా కొనుగోలు ఆర్డర్లు ఇవ్వాలని పానీయాల తయారీ సంస్థలను కోరారు. అయితే మంత్రి ఆదేశాల తర్వాత కూడా జిల్లాలో పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదని రైతులు చెబుతున్నారు. పక్వానికి వచ్చిన మామిడికాయలను కోయకపోతే నాణ్యత దెబ్బతింటుందని, కోసి మార్కెట్‌కు తీసుకొస్తే కొనుగోలు కేంద్రాల్లో ఆలస్యం అవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల తోటల్లో మామిడికాయలు అధికంగా పక్వానికి చేరుకుంటుండటంతో రైతుల ఆందోళన మరింత పెరుగుతోంది. ఇదిలా ఉండగా, ఉద్యానవన శాఖ రైతులకు దశలవారీగా కోతలు చేపట్టాలని సూచిస్తోంది. ఒకేసారి కోతలు చేపడితే మార్కెట్‌పై ఒత్తిడి పెరిగి ధరలు పడిపోయే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. పూర్తిగా పరిపక్వత చెందిన పండ్లను మాత్రమే కోయడం ద్వారా నాణ్యత పెరిగి మంచి ధర లభించే అవకాశం ఉందని సూచిస్తున్నారు. పల్ప్ పరిశ్రమల ప్రతినిధులు మాత్రం రైతులకు అండగా ఉంటామని చెబుతున్నారు. గత ఏడాది మార్కెట్ డిమాండ్‌ను మించి గుజ్జు ఉత్పత్తి చేయడంతో ప్రస్తుతం భారీ నిల్వలు మిగిలిపోయాయని, అయినప్పటికీ రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత మేర కొనుగోళ్లు చేపడతామని హామీ ఇస్తున్నారు. ప్రభుత్వం, పరిశ్రమలు, వ్యాపార సంస్థలు సమన్వయంతో వెంటనే చర్యలు తీసుకోకపోతే వేలాది మంది రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొనే పరిస్థితి ఉందని రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి. చిత్తూరు జిల్లాలోని తోతాపురి మామిడి రైతుల భవిష్యత్తు ప్రస్తుతం పరిశ్రమల కొనుగోళ్లపైనే ఆధారపడి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *