6, జూన్ 2026, శనివారం

మంత్రి అచ్చెన్న సమీక్షతో చిత్తూరు జిల్లా మామిడి రైతుల్లో ఆశలు



మంత్రి అచ్చెన్న సమీక్షతో చిత్తూరు జిల్లా మామిడి రైతుల్లో ఆశలు

తోత‌పూరి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని వినతి

గత ఏడాది వలె మద్దతు ధర ప్రకటించాలని మనవి

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

తోత‌పూరి మామిడి పరిస్థితులపై బుధవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పల్ప్ పరిశ్రమలు, బాట్లింగ్ కంపెనీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతుల్లో భరోసా ఏర్పడుతోంది. ఈ ఏడాది రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందన్న ఆశతో ఉన్న రైతులు ప్రభుత్వం గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గత సంవత్సరం ఎదుర్కొన్న చేదు అనుభవాలు ఈసారి పునరావృతం కాకూడదని రైతులు స్పష్టం చేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సుమారు 78 వేల హెక్టార్లలో తోత‌పూరి మామిడి సాగు జరుగుతోంది. వేలాది మంది రైతులు ఈ పంటపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఈ ఏడాది వాతావరణ పరిస్థితుల ప్రభావంతో 25 నుంచి 30 శాతం వరకు దిగుబడి తగ్గే అవకాశం ఉన్నప్పటికీ రైతులు మార్కెట్‌పై ఆశలు పెట్టుకుని పంటను సంరక్షించారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో తోత‌పూరి మామిడి ధర రూ.7 నుంచి రూ.7.50 మధ్య కొనసాగుతుండగా, ఇది రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గత సంవత్సరం తోత‌పూరి మామిడికి రాష్ట్ర ప్రభుత్వం కిలోకు రూ.12 మద్దతు ధర ప్రకటించింది. అందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.4 ప్రోత్సాహకం ఇవ్వగా, మిగిలిన మొత్తాన్ని ఫ్యాక్టరీలు చెల్లించాల్సి ఉంది. అయితే చాలా ఫ్యాక్టరీలు రైతులకు పూర్తి స్థాయిలో చెల్లింపులు చేయలేదని రైతులు ఆరోపిస్తున్నారు. కొందరు ఫ్యాక్టరీలు రూ.8 ఇవ్వాల్సిన చోట రూ.4 నుంచి రూ.5 మాత్రమే చెల్లించాయని చెబుతున్నారు. మరికొన్ని పరిశ్రమలు ఇప్పటివరకు కూడా రైతులకు బకాయిలు పూర్తిగా చెల్లించలేదని రైతులు వాపోతున్నారు. గత సీజన్‌లో ఫ్యాక్టరీలు సకాలంలో మామిడి కాయలను కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కోతకు వచ్చిన పండ్లను నిల్వ ఉంచలేక చాలామంది రైతులు రోడ్ల పక్కన పారబోశారు. మరికొందరు తోటల్లోనే కాయలను వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈసారి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. విజయవాడ నుండి నిర్వహించిన వర్చువల్ సమీక్షలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ తోత‌పూరి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రైతులకు న్యాయమైన ధర లభించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. పూర్తిగా పరిపక్వత చెందిన నాణ్యమైన ప్రతి పండును కొనుగోలు చేస్తామని, రైతుల నుంచి నేరుగా కొనుగోళ్లు చేపట్టాలని పల్ప్ ప్రాసెసింగ్ యూనిట్లకు ఆదేశించినట్లు తెలిపారు. వ్యాపారుల ద్వారా కాకుండా రైతుల నుంచే నేరుగా పండ్లు కొనుగోలు చేయాలని మంత్రి స్పష్టం చేయడం రైతుల్లో కొంత భరోసా కలిగిస్తోంది. ఈ ఏడాది ముందుగానే కొనుగోలు ప్రణాళికలు సిద్ధం చేశామని పరిశ్రమల ప్రతినిధులు మంత్రికి హామీ ఇచ్చారు. గత సంవత్సరం మాదిరిగా ఒకేసారి కొనుగోళ్లు జరగకుండా ఎక్కువ రోజులు కొనుగోలు ప్రక్రియ కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతుల నుంచే నేరుగా పండ్లను సేకరించి పండ్లు వృథా కాకుండా చూస్తామని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం పల్ప్ పరిశ్రమలు భారీ నిల్వల సమస్యను ఎదుర్కొంటున్నాయని, గత ఏడాది మార్కెట్ డిమాండ్‌ను మించి పల్ప్ ఉత్పత్తి జరగడంతో ఇబ్బందులు తలెత్తాయని వెల్లడించారు. అయినప్పటికీ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సాధ్యమైనంత మేరకు కొనుగోళ్లు చేపడతామని పేర్కొన్నారు.

అయితే జిల్లాలో ఇప్పటికీ అనేక పల్ప్ ఫ్యాక్టరీలు తోత‌పూరి మామిడిని కొనుగోలు ప్రారంభించలేదని రైతులు చెబుతున్నారు. కొనుగోళ్లు ఆలస్యం అయితే మార్కెట్లో ధరలు మరింత పడిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకుని అన్ని ఫ్యాక్టరీలు కొనుగోళ్లు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఒకేసారి కోతలు చేపట్టడం వల్ల మార్కెట్‌పై ఒత్తిడి పెరిగి ధరలు తగ్గే అవకాశం ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. దశలవారీగా కోతలు చేపట్టేలా రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా అధికారులకు సూచించారు. దీని వల్ల నాణ్యత మెరుగుపడటంతో పాటు రైతులకు మెరుగైన ధర లభించే అవకాశం ఉంటుందని తెలిపారు. తమిళనాడులోని కృష్ణగిరి మార్కెట్లో తక్కువ ధరలు నమోదవుతున్న అంశాన్ని కూడా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో సమాన ధరల విధానం అమలుపై చర్చలు జరుపుతామని వెల్లడించారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ ఏడాది సుమారు 7.80 లక్షల మెట్రిక్ టన్నుల తోత‌పూరి ఉత్పత్తి నమోదయ్యే అవకాశం ఉందని ఉద్యానవన శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 44 మామిడి ప్రాసెసింగ్ యూనిట్లు ఉండగా, వీటిలో 37 యూనిట్లు ఈ సీజన్‌లో కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం 20 యూనిట్లు మాత్రమే కార్యకలాపాలు ప్రారంభించగా, వాటిలో కేవలం 7 యూనిట్లు మాత్రమే తోత‌పూరి ప్రాసెసింగ్ చేపడుతున్నట్లు వెల్లడించారు. గత అనుభవాల నేపథ్యంలో ప్రభుత్వం ఈసారి ప్రకటించే మద్దతు ధర పూర్తిస్థాయిలో అమలయ్యేలా కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఫ్యాక్టరీలు రైతులకు సకాలంలో చెల్లింపులు చేసేలా పర్యవేక్షించాలని, రైతులకు నష్టం కలగకుండా జిల్లా యంత్రాంగం నిరంతరం పరిస్థితులను సమీక్షించాలని కోరుతున్నారు. తోత‌పూరి రైతుల సమస్యలను ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించి గిట్టుబాటు ధర కల్పిస్తేనే రైతాంగం నిలదొక్కుకుంటుందని జిల్లాలో రైతులు అభిప్రాయపడుతున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *