24, జూన్ 2026, బుధవారం

ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం వాయిదా

నేటి నుంచి ప్రారంభం కావాల్సిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం వాయిదా

జూలై 10 నుంచి ప్రారంభం .. 45 రోజులపాటు నిర్వహణ


(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)

జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి ప్రారంభం కావాల్సిన తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మక ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం వాయిదా పడింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ కొనసాగుతుండటంతో దానికి ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా జూన్ చివరి వారంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి వరుసగా 45 రోజుల పాటు ప్రజల్లో నిర్వహించాలని ప్రణాళిక రూపొందించారు. అయితే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు వేచి ఉండాలని నిర్ణయించడంతో కార్యక్రమాన్ని జూలై 10వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు.

 చిత్తూరు జిల్లాతో పాటు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఇప్పటికే పార్టీ యంత్రాంగం సిద్ధమైంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, జిల్లా అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ, వార్డు కమిటీలు, బూత్ కన్వీనర్లు, తెలుగుయువత, తెలుగు మహిళ, తెలుగు రైతు, ఐటీ విభాగం సహా అన్ని అనుబంధ సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. మిత్రపక్షాలైన జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కూడా కలుపుకొని కూటమి తరఫున ప్రజల్లోకి వెళ్లే విధంగా కార్యాచరణ రూపొందించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, చేపట్టిన అభివృద్ధి పనులు, భవిష్యత్తు లక్ష్యాలను ప్రతి ఇంటికి చేరవేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా పార్టీ నిర్ణయించింది. గతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ వాటిని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయామని భావిస్తున్న పార్టీ ఈసారి ప్రజల వద్దకే వెళ్లి ప్రభుత్వ పనితీరును వివరించాలని నిర్ణయించింది. ప్రజలతో నిరంతర సంబంధాలు కొనసాగిస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకోవడం ద్వారా పార్టీ, ప్రభుత్వంపై విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలని భావిస్తోంది. ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేకంగా కరపత్రాలు, సమాచార పుస్తకాలు సిద్ధం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, మంజూరైన నిధులు, అమలవుతున్న సంక్షేమ పథకాల వివరాలను అందులో పొందుపరుస్తున్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పెంపు, తల్లికి వందనం, దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, మహిళా సాధికారత కార్యక్రమాలు, యువతకు ఉపాధి అవకాశాలు, మెగా డీఎస్సీ, రైతులకు అందిస్తున్న సాయాలు, మౌలిక వసతుల కల్పన, రహదారుల నిర్మాణం, సాగునీటి ప్రాజెక్టులు, స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాల సాధన కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఇంటింటికీ వెళ్లి వివరించనున్నారు.

అంతేకాకుండా ప్రజల నుంచి నేరుగా సమస్యలను తెలుసుకోవడం కూడా ఈ కార్యక్రమంలో కీలక అంశంగా ఉండనుంది. గ్రామాలు, పట్టణాల్లో తాగునీరు, రహదారులు, విద్యుత్, సంక్షేమ పథకాల అమలు, ఇతర స్థానిక సమస్యలపై ప్రజల నుంచి వినతులను స్వీకరించనున్నారు. వాటిని నమోదు చేసి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లే విధంగా పార్టీ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు, సూచనలను కూడా సేకరించి భవిష్యత్తు కార్యాచరణలో ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలకు వాస్తవాలను ప్రజల ముందు ఉంచడం కూడా ఈ కార్యక్రమం ద్వారా చేపట్టనున్న మరో ప్రధాన అంశంగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పరిణామాలు, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల మధ్య తేడాను ప్రజలకు వివరించనున్నారు. ప్రజల్లోకి వెళ్లడం ద్వారా పార్టీ కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని నింపడంతో పాటు కూటమి ప్రభుత్వానికి ప్రజా మద్దతును బలోపేతం చేయాలని నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుండటంతో పార్టీ శ్రేణులు దానిపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాయి. ప్రతి ఓటు విలువైనదనే భావనతో ఓటర్ల జాబితాలో పేర్లు తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం జూలై 10వ తేదీ నుంచి "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమాన్ని ప్రారంభించి వరుసగా 45 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా నిర్వహించేందుకు పార్టీ ఇప్పటికే కార్యాచరణను సిద్ధం చేసింది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *