24, జూన్ 2026, బుధవారం

రైతులకు మద్దతు ధర కోసం జిల్లా అధికారులకు కసరత్తు

రైతులకు మద్దతు ధర కోసం జిల్లా అధికారులకు కసరత్తు

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)

చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కిలోకు 4 రూపాయల మద్దతు ధర సక్రమంగా అందేలా జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వం ప్రకటించిన ఈ పథకం అమలులో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా, అర్హులైన ప్రతి రైతుకు ప్రయోజనం చేకూరేలా ఉద్యానవన శాఖ, వ్యవసాయ మార్కెట్ శాఖలు సమన్వయంతో చర్యలు చేపడుతున్నాయి. ఇందుకోసం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ప్రతిరోజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మామిడి క్రయ విక్రయాలను ధరను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని మామిడి గుజ్జు పరిశ్రమలు, ర్యాంపులు, మండీల ద్వారా సరఫరా అవుతున్న తోతాపురి మామిడి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. రైతులు ఏ ఏ పత్రాలు అందజేయాలో వివరంగా ఉద్యానవన శాఖ అధికారులు ఒక కరపత్రాన్ని కూడా ముద్రించి మామిడి రైతులకు అందజేస్తున్నారు.

జిల్లాలో ప్రస్తుతం 31 మామిడి గుజ్జు కర్మాగారాలు ఉండగా, వాటిలో 27 కర్మాగారాలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ కర్మాగారాలన్నీ తోతాపురి రకం మామిడిని కొనుగోలు చేస్తున్నాయి. ఇప్పటివరకు సుమారు 1.5 లక్షల టన్నుల తోతాపురి మామిడి కర్మాగారాలు, ర్యాంపులు, మండీలకు చేరినట్లు అధికారుల అంచనా. ఇంకా తోటల్లో దాదాపు 2 లక్షల టన్నుల వరకు మామిడి కాయలు కోతకు సిద్ధంగా ఉన్నాయని భావిస్తున్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా మామిడి కోతలు ఊపందుకోవడంతో రైతులు పెద్దఎత్తున తమ దిగుబడిని విక్రయిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతులకు నేరుగా అందించేందుకు ప్రతి కర్మాగారంలో ఉద్యానవన శాఖ అధికారులను ప్రత్యేకంగా నియమించారు. రైతులు మామిడి కాయలను కర్మాగారాలకు సరఫరా చేసిన అనంతరం పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం వివరాలు సంబంధిత అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ వివరాల ఆధారంగా రైతుల అర్హతను నిర్ధారించి మద్దతు ధర చెల్లింపుల ప్రక్రియ చేపట్టనున్నారు. అలాగే ర్యాంపులు, మండీలకు మామిడి సరఫరా చేస్తున్న రైతులు కూడా అక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులకు తమ వివరాలు అందజేయాల్సి ఉంటుంది. ఇతర రాష్ట్రాలకు తోతాపురి మామిడి విక్రయించిన రైతులు, కొనుగోలు చేసిన వ్యాపారులు సమీపంలోని రైతు సేవా కేంద్రంలో నమోదు చేసుకోవాలని ఉద్యానవన శాఖ సూచించింది. ఇలా అన్ని మార్గాల ద్వారా జరిగిన అమ్మకాల వివరాలను నమోదు చేసి రైతులకు ప్రభుత్వం ప్రకటించిన ప్రయోజనం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో కొందరు వ్యాపారులు, కొన్ని మామిడి గుజ్జు కర్మాగారాలు కొనుగోలు వివరాల్లో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈసారి ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. రైతుల పేర్లతో తప్పుడు బిల్లులు సృష్టించడం, కొనుగోలు పరిమాణాల్లో వ్యత్యాసాలు చూపించడం వంటి ఆరోపణలు పునరావృతం కాకుండా ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేస్తున్నారు. ప్రతి లావాదేవీని నమోదు చేస్తూ పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక ర్యాంపుల నిర్వహణ విషయంలో కూడా వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. గత సంవత్సరాల్లో తీసుకున్న రిజిస్ట్రేషన్లు ఈ ఏడాదికి చెల్లవని స్పష్టం చేస్తూ, అన్ని ర్యాంపులు కొత్తగా నమోదు చేసుకోవాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్ లేకుండా కొనుగోళ్లు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతుల నుంచి కొనుగోలు చేసే ప్రతి కేంద్రం అధికారికంగా నమోదు కావడం ద్వారా మామిడి కొనుగోళ్లపై పూర్తి నియంత్రణ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలో ప్రస్తుతం మామిడి ధరలు రైతుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అన్ని కర్మాగారాలు కిలోకు ₹6 కంటే తక్కువ ధరకు మామిడిని కొనుగోలు చేయరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల అమలును జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రైతులకు కనీస గిట్టుబాటు ధర లభించేలా ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాయి. ఇదిలా ఉండగా బుధవారం ఉదయం గంగాధర నెల్లూరు మండలంలోని జైన్ కర్మాగారం వద్ద ఒక రైతు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. మామిడి లోడింగ్‌లో జాప్యం, ధరల సమస్యల నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే ఉద్యానవన శాఖ ఉప సంచాలకుడు సతీష్, గంగాధర నెల్లూరు తహసీల్దార్ అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు కర్మాగార యాజమాన్యానికి పలు సూచనలు చేశారు. రైతుల వాహనాలను వరుస క్రమంలోనే లోడింగ్‌కు అనుమతించాలని, మధ్యలో ఎటువంటి జోక్యాలు లేదా ప్రాధాన్యతలు ఇవ్వకూడదని ఆదేశించారు. రైతులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి రాకుండా లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. రైతులకు న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పథకం సమర్థవంతంగా అమలైతే జిల్లాలోని వేలాది మంది తోతాపురి మామిడి రైతులకు ఊరట లభించనుంది. ప్రస్తుతం సాగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలు, డేటా సేకరణ, ప్రత్యేక పర్యవేక్షణ చర్యలు రైతులకు నేరుగా ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా కొనసాగుతున్నాయి. రైతుల నుంచి పూర్తి వివరాలు సేకరించిన అనంతరం మద్దతు ధర చెల్లింపుల ప్రక్రియ మరింత వేగం అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *