నేడు రూ.117.61 కోట్ల పెట్టుబడి సాయం
రైతన్నలకు శుభవార్త..
నేడు రూ.117.61 కోట్ల పెట్టుబడి సాయం
పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధుల విడుదల
జిల్లాలో 1.78 లక్షల మంది రైతులకు లబ్ధి
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడంతో పాటు ఖరీఫ్, రబీ సీజన్లలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులకు రైతులు అప్పుల బారిన పడకుండా ముందుగానే పెట్టుబడి సాయం అందించాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన, అన్నదాత సుఖీభవ పథకాల కింద శనివారం నిధులు విడుదల కానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 23వ విడత పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనుండగా, రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ తొలి విడత సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. చిత్తూరు జిల్లాలో మొత్తం 1,78,385 మంది రైతులకు రూ.117.61 కోట్ల మేర ఆర్థిక సాయం అందనుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ అన్నదాత సుఖీభవ పథకం కింద 1,78,385 మంది రైతులకు రూ.89.19 కోట్లు, కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి కిసాన్ యోజన 23వ విడత కింద 1,42,109 మంది రైతులకు రూ.28.42 కోట్లు విడుదల కానున్నాయి.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. చిన్న, సన్నకారు రైతులకు ఏడాదికి రూ.6,000 చొప్పున మూడు విడతల్లో నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. సాగు ప్రారంభ సమయంలో రైతులకు పెట్టుబడి కొరత తలెత్తకుండా చూడటం, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఈసారి విడుదల కానున్న 23వ విడతలో ఒక్కో రైతుకు రూ.2,000 చొప్పున అందనుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు అదనపు పెట్టుబడి సాయం అందించాలనే లక్ష్యంతో ఒక్కో రైతుకు రూ.5,000 చొప్పున తొలి విడత నిధులు జమ చేయనుంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కలిపి ఒక్కో అర్హ రైతుకు రూ.7,000 వరకు అందనున్నాయి. చిత్తూరు నియోజకవర్గంలో పీఎం కిసాన్ యోజన కింద 9,004 మంది రైతులకు రూ.1.80 కోట్లు విడుదల కానుండగా, అన్నదాత సుఖీభవ పథకం కింద 11,321 మంది రైతులకు రూ.5.66 కోట్లు జమ కానున్నాయి. రెండు పథకాలు కలిపి 11,321 మంది రైతులకు రూ.7.46 కోట్లు అందనున్నాయి. పూతలపట్టు నియోజకవర్గంలో పీఎం కిసాన్ కింద 28,037 మంది రైతులకు రూ.5.61 కోట్లు, అన్నదాత సుఖీభవ కింద 33,881 మంది రైతులకు రూ.16.94 కోట్లు విడుదల కానున్నాయి. మొత్తం 33,881 మంది రైతులకు రూ.22.55 కోట్లు అందనున్నాయి. పలమనేరు నియోజకవర్గంలో అత్యధికంగా పీఎం కిసాన్ కింద 31,328 మంది రైతులకు రూ.6.27 కోట్లు, అన్నదాత సుఖీభవ కింద 38,368 మంది రైతులకు రూ.19.18 కోట్లు విడుదల కానుండగా, రెండు పథకాల కింద కలిపి 38,368 మంది రైతులకు రూ.25.45 కోట్లు జమ కానున్నాయి. కుప్పం నియోజకవర్గంలో పీఎం కిసాన్ కింద 25,652 మంది రైతులకు రూ.5.13 కోట్లు, అన్నదాత సుఖీభవ కింద 36,473 మంది రైతులకు రూ.18.24 కోట్లు విడుదల కానున్నాయి. మొత్తం రూ.23.37 కోట్ల ప్రయోజనం 36,473 మంది రైతులకు లభించనుంది. నగరి నియోజకవర్గంలో పీఎం కిసాన్ యోజన ద్వారా 10,217 మంది రైతులకు రూ.2.04 కోట్లు, అన్నదాత సుఖీభవ ద్వారా 12,472 మంది రైతులకు రూ.6.24 కోట్లు అందనున్నాయి. మొత్తం రూ.8.28 కోట్ల మేర సాయం అందనుంది. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పీఎం కిసాన్ కింద 29,597 మంది రైతులకు రూ.5.92 కోట్లు, అన్నదాత సుఖీభవ పథకం కింద 36,047 మంది రైతులకు రూ.18.02 కోట్లు విడుదల కానున్నాయి. దీంతో మొత్తం 36,047 మంది రైతులకు రూ.23.94 కోట్ల ప్రయోజనం కలగనుంది. పుంగనూరు నియోజకవర్గంలో పీఎం కిసాన్ యోజన ద్వారా 8,274 మంది రైతులకు రూ.1.65 కోట్లు, అన్నదాత సుఖీభవ కింద 9,823 మంది రైతులకు రూ.4.91 కోట్లు విడుదల కానుండగా, మొత్తం 9,823 మంది రైతులకు రూ.6.57 కోట్ల మేర పెట్టుబడి సాయం అందనుంది. ఖరీఫ్ సాగు ప్రారంభ దశలోనే రైతులకు నగదు అందుబాటులోకి రావడం వల్ల విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొనుగోలు, వ్యవసాయ పనుల నిర్వహణకు ఉపశమనం లభిస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు ఈ పథకాలను అమలు చేస్తున్నాయని అధికారులు తెలిపారు.

