22, జూన్ 2026, సోమవారం

రూపాయి పెరిగిన తోతాపురి మామిడి ధర

రూపాయి పెరిగిన తోతాపురి మామిడి ధర.. 

టోకెన్లు, అన్‌లోడింగ్ సమస్యలతో రైతుల అవస్థలు

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)

జిల్లాలో తోతాపురి మామిడి రైతులకు ధర విషయంలో కొంత ఊరట లభించినప్పటికీ, టోకెన్ల కొరత, ఫ్యాక్టరీల వద్ద అన్‌లోడింగ్ జాప్యం కొత్త సమస్యగా మారింది. గత కొద్ది రోజులుగా కిలోకు రూ.5 మాత్రమే చెల్లిస్తున్న మామిడి గుజ్జు పరిశ్రమలు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జోక్యంతో సోమవారం నుంచి కిలోకు రూ.6 చెల్లించడం ప్రారంభించాయి. రైతులకు కనీసం రూ.6 కంటే తక్కువ ధర చెల్లించరాదని కలెక్టర్ అన్ని ఫ్యాక్టరీ యాజమాన్యాలను హెచ్చరించారు. కొనుగోలు ధరలను పర్యవేక్షించేందుకు కలెక్టరేట్‌లో ప్రత్యేక మాస్టర్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి, స్వయంగా ఫ్యాక్టరీ యాజమాన్యాలతో మాట్లాడి ధర విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. ప్రతి ఫ్యాక్టరీ వద్ద కొనుగోలు ధరలను ప్రదర్శించే బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

జిల్లాలో దాదాపు అన్ని మామిడి గుజ్జు పరిశ్రమలు కిలోకు రూ.6 చెల్లిస్తున్నప్పటికీ, బంగారుపాళ్యం ప్రాంతంలోని ఒక ఫ్యాక్టరీ మాత్రం రూ.5 మాత్రమే చెల్లిస్తుండటంతో ఉద్యానవన శాఖ ఉప సంచాలకుడు సతీష్ అక్కడికి వెళ్లి యాజమాన్యంతో చర్చలు జరిపి వెంటనే రూ.6 చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. ఉద్యానవన శాఖ అధికారులు అన్ని ఫ్యాక్టరీలతో సమన్వయం చేసుకుంటూ రైతులకు గిట్టుబాటు ధర అందేలా పర్యవేక్షిస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో 4.5 లక్షల టన్నుల తోతాపురి మామిడి దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు రెండు లక్షల టన్నులకు పైగా మామిడికాయలను రైతులు మామిడి గుజ్జు పరిశ్రమలకు సరఫరా చేశారు. ఇంకా సీజన్ పూర్తికావడానికి మరో రెండు వారాలకు పైగా సమయం ఉండటంతో భారీగా మామిడికాయలు ఫ్యాక్టరీలకు చేరుతున్నాయి. అయితే చాలా ఫ్యాక్టరీలు మామిడికాయలను అన్‌లోడ్ చేసుకునే విషయంలో తీవ్ర జాప్యం చేస్తున్నాయి. ట్రాక్టర్లు, లారీలలో వచ్చిన మామిడికాయలను దింపేందుకు రెండు నుంచి మూడు రోజుల వరకు సమయం పడుతోంది. దీంతో పూర్తిగా పక్వానికి వచ్చిన కాయలు వాహనాల్లోనే మాగిపోతున్నాయి. మాగిపోయిన మామిడికాయలను ఫ్యాక్టరీ అధికారులు నాణ్యత లేదంటూ తిరస్కరిస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రెండు, మూడు రోజుల పాటు వాహనాలు ఫ్యాక్టరీల వద్ద నిలిచిపోవడంతో ట్రాక్టర్ యజమానులు అదనపు బాడుగను డిమాండ్ చేస్తున్నారు. సాధారణంగా ఒక ట్రిప్పుకు తీసుకునే బాడుగ కంటే రెండు, మూడు రెట్లు ఎక్కువగా వసూలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఒకవైపు మామిడికాయలు పాడైపోవడం, మరోవైపు అదనపు రవాణా ఖర్చులు భరించాల్సి రావడంతో రైతులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధర పెరిగినప్పటికీ టోకెన్ల సమస్య మాత్రం రైతులను వెంటాడుతోంది. జిల్లాలోని పలు ఫ్యాక్టరీల వద్ద 15 రోజుల వరకు టోకెన్లు పూర్తిగా జారీ అయిపోయిన పరిస్థితి నెలకొంది. మామిడికాయలు పక్వానికి వచ్చి నేలరాలుతున్నా టోకెన్లు దొరక్క రైతులు ఆందోళన చెందుతున్నారు. పలుకుబడి ఉన్న వ్యక్తులు, రాజకీయ నాయకులకు సంబంధించిన రైతులకు మాత్రమే టోకెన్లు సులభంగా లభిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని కొన్ని ఫ్యాక్టరీలు రాజకీయ నాయకుల ఆధీనంలో ఉండటంతో సాధారణ రైతులకు టోకెన్లు దొరకడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. టోకెన్ల కోసం ఫ్యాక్టరీల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. ధరను రూ.6కు పెంచడం రైతులకు కొంత ఉపశమనం కలిగించినప్పటికీ, అన్‌లోడింగ్ జాప్యం, టోకెన్ల కొరత, పెరిగిన రవాణా ఖర్చులు రైతుల ఆందోళనలను మరింత పెంచుతున్నాయి. మరో 15 రోజుల వరకు మామిడి సీజన్ కొనసాగే అవకాశం ఉండటంతో ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఫ్యాక్టరీల్లో అన్‌లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు టోకెన్ల జారీ వ్యవస్థలో పారదర్శకత తీసుకురావాలని రైతులు కోరుతున్నారు. ధరల విషయంలో జోక్యం చేసుకున్నట్లుగానే టోకెన్లు, అన్‌లోడింగ్ సమస్యలపై కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటేనే రైతులకు పూర్తి స్థాయిలో ఊరట లభిస్తుందని అభిప్రాయపడుతున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *