11, జూన్ 2026, గురువారం

గంగాధర నెల్లూరు సీడీపీవోపై విచారణకు ఆదేశాలు


గంగాధర నెల్లూరు సీడీపీవోపై విచారణకు ఆదేశాలు

ఆరోపణలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన పీడీ

రీజినల్ జాయింట్ డైరెక్టర్ చిత్తూరు పర్యటనకు అవకాశం

సహచర సీడీపీవోపై విచారణకు ఇద్దరు సీడీపీవోలు విముఖత

విచారణ అధికారిని నియమించాలని జిల్లా కలెక్టర్‌కు ఫైల్

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ

గంగాధర నెల్లూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీవో పద్మసునందపై వెలుగులోకి వచ్చిన అవినీతి, అక్రమాల ఆరోపణలు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి చేరినట్లు సమాచారం. పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వరుస కథనాలు ప్రచురితమవడంతో పాటు అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ చేసిన ఫిర్యాదులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటేశ్వరి, గంగాధర నెల్లూరు ప్రాజెక్టుకు సంబంధించిన ఆరోపణలు, ఫిర్యాదుల వివరాలను శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ మనోరంజని దృష్టికి తీసుకెళ్లినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పత్రికల్లో ప్రచురితమైన కథనాలు, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఆరోపణలు, అంగన్‌వాడీ ఉద్యోగ సంఘాలు అందజేసిన వినతిపత్రాల ప్రతులను కూడా ఉన్నతాధికారులకు పంపినట్లు తెలుస్తోంది. సీడీపీవోపై వచ్చిన ఆరోపణల తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న రీజినల్ జాయింట్ డైరెక్టర్ స్వయంగా చిత్తూరుకు వచ్చి విచారణ జరిపే అవకాశాలు ఉన్నట్లు శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రాథమిక నివేదికలు, అందిన ఫిర్యాదులు, స్థానిక స్థాయిలో ఏర్పడిన పరిస్థితులను పరిశీలించి తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

ఇప్పటికే ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటేశ్వరి విచారణకు ఆదేశాలు జారీ చేయగా, తొలుత ఐరాల సీడీపీవో నిర్మలను విచారణ అధికారిగా నియమించారు. అయితే ఆమె విచారణ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు తెలియజేయడంతో చిత్తూరు సీడీపీవో శ్యామ్‌సుగుణకు బాధ్యతలు అప్పగించారు. అయితే తోటి సీడీపీవోపై విచారణ నిర్వహించేందుకు ఆమె కూడా ముందుకు రాలేదని తెలుస్తోంది. దీంతో పక్షపాతం లేకుండా విచారణ జరిపేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖకు సంబంధం లేని మరో విభాగానికి చెందిన అధికారిని విచారణ అధికారిగా నియమించాలని ప్రాజెక్టు డైరెక్టర్ జిల్లా కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. జిల్లా కలెక్టర్ ఆమోదం అనంతరం కొత్త విచారణ అధికారిని నియమించే అవకాశం ఉంది.

అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆరోపణలు

గంగాధర నెల్లూరు ప్రాజెక్టులో అంగన్‌వాడీ కార్యకర్తలు, మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లపై సీడీపీవో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆరోపించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. కేంద్రాల తనిఖీల పేరుతో సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని, సెలవులు, విధుల నిర్వహణ, పరిపాలనా అంశాల్లో వివక్షతతో వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. యూనియన్ కార్యకలాపాల్లో పాల్గొన్న ఉద్యోగులను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని, బదిలీల భయం చూపిస్తూ ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ప్రతి అంగన్‌వాడీ కేంద్రం నుంచి నెలకు రూ.1,000 చొప్పున వసూలు చేస్తున్నారని, గత 15 నెలలుగా ఈ విధంగా డబ్బులు సేకరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల మరమ్మతులు, ఇతర అభివృద్ధి పనుల పేరుతో నిధుల వినియోగంలో అవకతవకలు జరిగాయని, ప్రభుత్వ నిధుల వినియోగంలో పారదర్శకత లేదని యూనియన్ ఆరోపించింది. సిబ్బంది సమస్యలను పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఉద్యోగులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఫిర్యాదులో వివరించింది.

విస్తృత చర్చకు దారితీసిన ఆరోపణలు

గంగాధర నెల్లూరు ప్రాజెక్టు పరిధిలోని కొన్ని అంగన్‌వాడీ కేంద్రాల పరిస్థితులు, భవనాల నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పన, నిధుల వినియోగం తదితర అంశాలపై ఇప్పటికే పలు పత్రికలు, టెలివిజన్ ఛానళ్లు, సామాజిక మాధ్యమాల్లో కథనాలు వెలువడ్డాయి. దీనిపై అంగన్‌వాడీ ఉద్యోగ సంఘాలు, సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసనలు, ధర్నాలు కూడా నిర్వహించాయి. సీడీపీవోపై వచ్చిన ఆరోపణలపై నిష్పాక్షిక, సమగ్ర విచారణ జరిపి నిజానిజాలను వెలికితీయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, అంగన్‌వాడీ సిబ్బందికి న్యాయం చేయాలని కోరుతున్నాయి. రీజినల్ జాయింట్ డైరెక్టర్ స్థాయిలో వ్యవహారం పరిశీలనకు వెళ్లడం, జిల్లా స్థాయి అధికారులకే కాకుండా రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల దృష్టికి చేరడం గంగాధర నెల్లూరు ఐసీడీఎస్ ప్రాజెక్టులో చోటుచేసుకున్న పరిణామాల తీవ్రతకు నిదర్శనంగా భావిస్తున్నారు.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *