మామిడి రైతులకు తీపి కబురు
మామిడి రైతులకు తీపి కబురు.. కిలోకు రూ.4 ప్రోత్సాహకం
రైతన్నకు అండగా ప్రభుత్వం.. జిల్లాలో హర్షాతిరేకాలు
చంద్రబాబు చిత్రపటాలకు పాలాభిషేకాలు.. రైతు సంఘాల సంబరాలు
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)
రోజురోజుకూ పడిపోతున్న తోతాపురి మామిడి ధరలతో తీవ్ర ఆందోళనలో ఉన్న చిత్తూరు జిల్లా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా కిలోకు రూ.4 చొప్పున ప్రోత్సాహకం అందించాలని నిర్ణయించడంతో జిల్లాలోని వేలాది మంది మామిడి రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. రైతు సంఘాలు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ సీజన్ ప్రారంభంలో తోతాపురి మామిడి ధర కిలోకు రూ.7 పలికినా, రోజురోజుకూ తగ్గుతూ ప్రస్తుతం ఫ్యాక్టరీల వద్ద రూ.5కు పడిపోయింది. రాంపులలో అయితే రూ.3 నుంచి రూ.4కే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావంతో విదేశీ ఎగుమతులు మందగించడం, గత ఏడాది నిల్వలు ఇంకా పల్ప్ పరిశ్రమల్లో ఉండిపోవడంతో ఈసారి మామిడి గుజ్జు కర్మాగారాలు పూర్తి స్థాయిలో కొనుగోళ్లు చేపట్టడం లేదు. జిల్లాలో ఉన్న 31 పరిశ్రమల్లో అనేకం సగం సామర్థ్యంతోనే పనిచేస్తుండగా, కొన్ని పరిశ్రమలు తోతాపురి కొనుగోళ్లకే ముందుకు రావడం లేదు.
దీంతో ఉత్పత్తి ఖర్చులు పెరిగిన ఈ పరిస్థితుల్లో కిలోకు రూ.5 ధర కూడా గిట్టుబాటు కావడం లేదని రైతులు, రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల తిరుపతి పర్యటన సందర్భంగా మామిడి రైతుల సమస్యలను జిల్లా రైతు సంఘం ప్రతినిధులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రైతుల వినతిపై స్పందించిన ప్రభుత్వం, గత ఏడాది తరహాలోనే కిలోకు రూ.4 చొప్పున ప్రోత్సాహకం అందించాలని నిర్ణయించింది. అయితే ఈ సబ్సిడీ అమలుకు సంబంధించిన విధివిధానాలు ఇంకా వెలువడాల్సి ఉంది. గత ఏడాది రైతులు ఫ్యాక్టరీలకు సరఫరా చేసిన మామిడికాయల ఇన్‌వాయిస్‌ల ఆధారంగా టన్నుకు రూ.4,000 చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈసారి కూడా అదే విధానాన్ని అనుసరిస్తారా? లేక సాగు విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రోత్సాహకం చెల్లిస్తారా? అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే ఈ సీజన్‌లో రైతులు సుమారు లక్షన్నర టన్నుల మామిడిని పల్ప్ పరిశ్రమలకు సరఫరా చేసినట్లు అంచనా. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకంపై రైతు సంఘాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. చిత్తూరు జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు ఉమాపతి నాయుడు మాట్లాడుతూ, మామిడి రైతుల కష్టాలను అర్థం చేసుకుని గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా కిలోకు రూ.4 మద్దతు ప్రకటించడం రైతాంగంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేక చొరవతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గుజ్జు పరిశ్రమలు కూడా ప్రభుత్వం సూచించిన మేరకు కనీసం కిలోకు రూ.8 చెల్లించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. చిత్తూరు ఎంపీ డి. ప్రసాదరావు, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటాలకు పాలాభిషేకాలు నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాల్లో రైతులు పరస్పరం స్వీట్లు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్ లో పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ఆధ్వర్యంలో మామిడి రైతులు సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఫోటోలతో డాన్స్ చేశారు. మిఠాయిలు పంచుకొని, టపాకాయలు కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బంగారుపాళ్యం మండల గౌరవఅధ్యక్షులు ఎన్ పి జయప్రకాష్,మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎన్ పి ధరణి, తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, మామిడి రైతులు పాల్గొన్నారు. ధరలు పతనమై తీవ్ర నిరాశలో ఉన్న సమయంలో ప్రభుత్వం అందించిన ఈ ఆర్థిక చేయూత మామిడి రైతుల్లో కొత్త ఆశలు నింపిందని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. విధివిధానాలు త్వరగా ప్రకటించి, ప్రోత్సాహకాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తే మామిడి రైతులకు మరింత ఊరట లభించనుంది. ప్రస్తుతం కష్టాల్లో ఉన్న జిల్లాలోని లక్షలాది మంది రైతులకు ఈ నిర్ణయం నిజంగానే తీపి కబురుగా మారింది.

