నేడు మామిడి రైతుల చలో కలెక్టరేట్
నేడు మామిడి రైతుల చలో కలెక్టరేట్
ఉద్యానవన శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం
కొనసాగుతున్న ఏడు రూపాయల కొనుగోలు ధర
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)
చిత్తూరు జిల్లా మామిడి రైతుల సమస్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. తోతాపురి మామిడికి గిట్టుబాటు ధర లభించకపోవడం, గుజ్జు పరిశ్రమలు పారదర్శకంగా కొనుగోళ్లు చేపట్టకపోవడం, ర్యాంపులు మరియు ఫ్యాక్టరీల ధరల మధ్య భారీ వ్యత్యాసం ఉండటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టరేట్ వద్ద చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించాలని మామిడి రైతుల సంక్షేమ సంఘం పిలుపునిచ్చింది. రైతుల ఆందోళనలకు స్పందించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సోమవారం మామిడి రైతుల సమస్యలపై ప్రత్యేక జిల్లా స్థాయి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఉద్యానవన శాఖ, మార్కెటింగ్ శాఖ, వ్యవసాయ శాఖ, పరిశ్రమల శాఖ అధికారులతో పాటు సంబంధిత విభాగాల ప్రతినిధులు పాల్గొననున్నారు. జిల్లాలో మామిడి రైతులు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితులు, ధరల సమస్య, కొనుగోలు ప్రక్రియ, గుజ్జు పరిశ్రమల వ్యవహార శైలి, రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులు తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నట్లు అధికారులు తెలిపారు. రైతుల నుంచి వచ్చిన వినతులు, సంఘాల డిమాండ్లు, ప్రజాప్రతినిధుల సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుని సాధ్యమైన పరిష్కార మార్గాలను అన్వేషించనున్నారు.
జిల్లాలో 31 జ్యూస్ ఫ్యాక్టరీలో ఉండగా అందులో 28 ఫ్యాక్టరీలు పని చేస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఉన్న గుజ్జు పరిశ్రమల్లో కేవలం 14 ఫ్యాక్టరీలు మాత్రమే తోతాపురి మామిడి కొనుగోళ్లు చేపడుతున్నాయి. మిగిలిన పరిశ్రమలు కొనుగోళ్లకు ముందుకు రాకపోవడంతో రైతులపై అదనపు భారం పడుతోంది. ఫలితంగా పండిన కాయలను నిల్వ ఉంచే అవకాశం లేక రైతులు తక్కువ ధరకే విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తవణంపల్లి మండలంలోని సిద్ధార్థ ఫ్యాక్టరీ రైతులకు కిలోకు రూ.7.50 చెల్లిస్తుండగా, మిగిలిన పరిశ్రమలు రూ.7 చొప్పున మాత్రమే కొనుగోలు చేస్తున్నాయి. సిద్ధార్థ ఫ్యాక్టరీ ముందస్తుగా పర్మిట్లు జారీ చేసి, వాటిలో పేర్కొన్న తేదీల్లోనే రైతులు సరఫరా చేయాల్సిన విధానాన్ని అమలు చేస్తోంది. దీంతో రైతులకు కొంతవరకు స్పష్టత లభిస్తున్నప్పటికీ, ఇతర ఫ్యాక్టరీల్లో అలాంటి వ్యవస్థ లేకపోవడంతో రైతులు గంటల తరబడి, కొన్నిసార్లు రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇతర ఫ్యాక్టరీల వద్దకు వచ్చే ట్రాక్టర్లు, లారీలను వచ్చిన క్రమంలో పంపుతున్నారని, దీంతో రవాణా ఖర్చులు, కార్మిక వ్యయాలు పెరిగి రైతులపై అదనపు ఆర్థిక భారం పడుతోందని రైతులు వాపోతున్నారు.
ఇటీవల బాధ్యతలు స్వీకరించిన జిల్లా ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ సతీష్ శనివారం గంగాధర నెల్లూరు మండలంలోని జైన్ ఫ్యాక్టరీని సందర్శించి అక్కడి ప్రాసెసింగ్ విధానాన్ని పరిశీలించారు. ఫ్యాక్టరీ యాజమాన్యంతో సమావేశమై రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. ఈ సందర్భంగా డీడీ సతీష్ మాట్లాడుతూ రైతులు పూర్తిగా పక్వానికి వచ్చిన తోతాపురి మామిడిని మాత్రమే ఫ్యాక్టరీలకు సరఫరా చేయాలని సూచించారు. లేత కాయలు లేదా నాణ్యత లేని కాయలు తీసుకువస్తే తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. రైతులు నేరుగా ఫ్యాక్టరీలకు సరఫరా చేస్తే ప్రభుత్వం పర్యవేక్షణ ఉంటుందని, ర్యాంపుల ద్వారా విక్రయించే కాయల విషయంలో ప్రభుత్వానికి ప్రత్యక్ష బాధ్యత ఉండదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, శనివారం నుంచి మామిడి ధర కిలోకు మరో రూపాయి తగ్గి రూ.6కు చేరిందనే ప్రచారం రైతుల్లో ఆందోళన కలిగించింది. అయితే ఈ ప్రచారాన్ని జిల్లా గుజ్జు పరిశ్రమల అసోసియేషన్ ఖండించింది. ప్రస్తుతం జిల్లాలోని పరిశ్రమలు యథావిధిగా కిలోకు రూ.7 చొప్పునే కొనుగోలు చేస్తున్నాయని స్పష్టం చేసింది. ధర తగ్గింపుపై జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని వెల్లడించింది.
మరోవైపు మామిడి రైతుల సంక్షేమ సంఘం మాత్రం ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని కనీస ధరను కిలోకు రూ.15గా ప్రకటించాలని డిమాండ్ చేస్తోంది. ఒకవేళ ఆ ధరను అమలు చేయలేని పరిస్థితి ఉంటే, మార్కెట్ ధరకు మరియు కనీస మద్దతు ధరకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భర్తీ చేయాలని కోరుతోంది. గుజ్జు పరిశ్రమలు కొనుగోలు ధరలను ఫ్యాక్టరీ గేట్ల వద్ద స్పష్టంగా ప్రదర్శించాలని, కొనుగోలు ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే డబ్ల్యూడీఆర్ఏ ద్వారా ప్రభుత్వ గిడ్డంగుల్లో మామిడి గుజ్జు నిల్వకు అనుమతులు తీసుకురావాలని, చిత్తూరు మాంగో క్లస్టర్ ప్రతిపాదించిన రైతు కేంద్రిత వ్యాపార విధానానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాయి. గత ఏడాది ధరల పతనం కారణంగా భారీ నష్టాలు ఎదుర్కొన్న రైతులు ఈ ఏడాది కూడా అదే పరిస్థితి పునరావృతమవుతుందేమోనన్న ఆందోళనలో ఉన్నారు. ఉత్పత్తి వ్యయం, ఎరువులు, మందులు, కార్మిక చార్జీలు, రవాణా ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం లభిస్తున్న ధరలు సాగు ఖర్చులకు కూడా సరిపోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం జరగనున్న జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం, అలాగే రైతుల చలో కలెక్టరేట్ కార్యక్రమం జిల్లాలో మామిడి ధరల సమస్యకు పరిష్కార మార్గం చూపుతుందా అనే అంశంపై రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జిల్లా యంత్రాంగం తీసుకునే నిర్ణయాలు వేలాది మంది మామిడి రైతుల భవిష్యత్తుపై ప్రభావం చూపనున్నాయి.

