స్థానిక సంస్థలకు16వ ఆర్థిక సంఘం నిధుల వెల్లువ
స్థానిక సంస్థలకు16వ ఆర్థిక సంఘం నిధుల వెల్లువ
ఉమ్మడి చిత్తూరు జిల్లాకు రూ.1,300 కోట్లు..
గ్రామ పంచాయతీలకు అధిక వాటా
ఐదేళ్లలో విడతలవారీగా నిధుల విడుదల..
ఎన్నికలు, ఆన్‌లైన్ లెక్కలు తప్పనిసరి
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)
గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌ల ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు భారీ స్థాయిలో నిధులు కేటాయించేందుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రానికి మొత్తం రూ.16,627 కోట్లు కేటాయించనున్నట్లు తెలుస్తుండగా, అందులో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సుమారు రూ.1,300 కోట్లు అందనున్నాయి. ఈ నిధులు 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 వరకు ఐదేళ్లపాటు విడతల వారీగా విడుదల కానున్నాయి. బేసిక్ గ్రాంట్లు, పనితీరు ఆధారిత గ్రాంట్ల రూపంలో ఈ నిధులు స్థానిక సంస్థలకు చేరనున్నాయి. గతంలో 15వ ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రానికి రూ.12,800 కోట్లు మంజూరు కాగా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని స్థానిక సంస్థలకు సుమారు రూ.930 కోట్లు మాత్రమే అందాయి. ప్రస్తుతం 16వ ఆర్థిక సంఘం కింద నిధుల కేటాయింపులో గణనీయమైన పెరుగుదల చోటుచేసుకోవడంతో గ్రామీణాభివృద్ధి పనులకు ఊతం లభించనుంది. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, ఘన వ్యర్థాల నిర్వహణ, వీధి దీపాల నిర్వహణ, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, కార్యాలయ నిర్వహణ, కార్మికుల వేతనాల చెల్లింపులు వంటి అవసరాలకు ఈ నిధులు ఉపయోగపడనున్నాయి. ఈ నిధుల్లో గ్రామ పంచాయతీలకే అత్యధిక వాటా లభించనుంది. ఉమ్మడి జిల్లాలోని గ్రామ పంచాయతీలకు సుమారు రూ.900 కోట్లు, జిల్లా పరిషత్‌కు రూ.200 కోట్లు, మండల పరిషత్‌లకు రూ.195 కోట్లు అందనున్నాయి. ఈ మొత్తాలు ఆయా సంస్థల పనితీరు, జనాభా, విస్తీర్ణం, అవసరాలను పరిగణనలోకి తీసుకొని విడతలవారీగా విడుదల చేయనున్నారు. 16వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంలో కేంద్ర ప్రభుత్వం పలు నిబంధనలు విధించింది. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు నిర్వహించి ప్రజాప్రతినిధులు ఉండటం తప్పనిసరి. మూడు సంవత్సరాలకు సంబంధించిన బ్యాంకు ఖాతాల వివరాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా ఆన్‌లైన్‌లో ఉంచాలి. ఈ-గ్రామ స్వరాజ్ పోర్టల్‌లో గ్రామ పంచాయతీల ఆస్తులు, పనుల వివరాలను నమోదు చేయాలి. నిధుల వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు నవీకరించాలి. సామాజిక తనిఖీలు, ఆడిట్ నివేదికలను సక్రమంగా సమర్పించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను అమలు చేసిన స్థానిక సంస్థలకే కేంద్రం నిధులను విడుదల చేయనుంది. 16వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా గ్రామాల్లో తాగునీటి సమస్యలు, పారిశుద్ధ్య లోపాలు, చెత్త నిర్వహణ సమస్యలకు పరిష్కారం లభించనుంది. పంచాయతీలకు సొంత ఆదాయం తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ నిధులు గ్రామీణాభివృద్ధికి కీలకంగా మారనున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వందలాది గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లకు ఈ నిధులు ఆర్థిక ఊరట కల్పించనున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగవంతం కానుంది.

