18, జూన్ 2026, గురువారం

టాప్-10లో చిత్తూరు ఎమ్మెల్యే

టాప్-10లో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ నాయుడు

మొట్టమొదటి విజయంతోనే రాష్ట్రస్థాయి గుర్తింపు

ప్రజా సేవ, అభివృద్ధి, అందుబాటులో ఉండే నాయకత్వానికి దక్కిన అరుదైన గౌరవం

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

రాజకీయాల్లో తొలి అడుగే విజయవంతమైతే అది సాధారణ విషయం. అయితే తొలి ఎన్నికల్లోనే ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమ పనితీరు కనబరిచిన ఎమ్మెల్యేల జాబితాలో టాప్-10లో స్థానం సంపాదించడం మాత్రం అరుదైన ఘనత. ఆ అరుదైన గౌరవాన్ని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ నాయుడు సాధించారు. రాష్ట్రంలోని 175 మంది ఎమ్మెల్యేలలో పదో స్థానాన్ని దక్కించుకోవడం ద్వారా చిత్తూరు నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చూపుతున్న చిత్తశుద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో కనబరుస్తున్న చురుకుదనం, అభివృద్ధి కార్యక్రమాల అమలులో తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడిగా ఏర్పరచుకున్న గుర్తింపే ఆయనను ఈ స్థాయికి చేర్చిన ప్రధాన కారణాలుగా రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

సాధారణంగా ప్రజాప్రతినిధులు ఎన్నికల తర్వాత ప్రజలకు దూరమవుతారనే విమర్శలు వినిపిస్తుంటాయి. అయితే గురజాల జగన్‌మోహన్ నాయుడు మాత్రం ఆ విమర్శలకు భిన్నంగా ప్రజల మధ్యే ఉంటూ తమ సమస్యలను నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గంలోని గ్రామాలు, వార్డులు, కాలనీల్లో తరచూ పర్యటిస్తూ ప్రజల సమస్యలను స్వయంగా వింటున్నారు. సమస్య తెలిసిన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు చేపట్టడం ఆయన పని తీరులో ప్రత్యేకతగా నిలిచింది. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ కార్యక్రమం ప్రజల్లో విశేష ఆదరణ పొందుతోంది. నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చే ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లే అవకాశం కల్పించడం ద్వారా ప్రజాప్రతినిధి మరియు ప్రజల మధ్య దూరాన్ని తగ్గించారు. ప్రజాదర్బార్‌లో వచ్చిన వినతులను శాఖల వారీగా పరిశీలించి వాటి పరిష్కారానికి నిరంతర పర్యవేక్షణ కొనసాగించడం వల్ల అనేక సమస్యలు వేగంగా పరిష్కారమవుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. ప్రజా సమస్యల పట్ల ఆయన చూపుతున్న అంకితభావం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, పారిశుధ్యం, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై నిరంతరం అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. సమస్యలను కేవలం వినడమే కాకుండా వాటి పరిష్కారం జరిగే వరకు పర్యవేక్షించడం వల్ల ప్రజల్లో విశ్వాసం పెరిగింది. 

పట్టణ అభివృద్ధి పై ప్రత్యేక శ్రద్ధ

చిత్తూరు పట్టణ అభివృద్ధిపై గురజాల జగన్‌మోహన్ నాయుడు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. గతంలో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న అనేక సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా రహదారుల విస్తరణ, ట్రాఫిక్ సమస్యల నివారణ, పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాల్లో వేగవంతమైన చర్యలు చేపడుతున్నారు. పట్టణ అభివృద్ధికి సంబంధించి మున్సిపల్ అధికారులతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తూ పనులు సకాలంలో పూర్తయ్యేలా పర్యవేక్షిస్తున్నారు. రోడ్ల విస్తరణ విషయంలో ఆయన తీసుకున్న చొరవకు ప్రజల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న వాహన రద్దీ కారణంగా చిత్తూరు పట్టణంలో ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలను గుర్తించి రహదారుల అభివృద్ధిపై దృష్టి పెట్టారు. అనేక ప్రాంతాల్లో రహదారుల విస్తరణ పనులను వేగవంతం చేయడంతో ప్రజలకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడుతోంది.

ప్రభుత్వ పథకాల అమలులో ముందంజ 

ప్రభుత్వ పథకాల అమలులో కూడా ఆయన చురుకైన పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, సమీక్షా సమావేశాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొంటూ ప్రజలతో మమేకమవుతున్నారు. ప్రభుత్వానికి మరియు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తూ ప్రజల అవసరాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నారు. ప్రజల తరఫున సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఆయన చూపుతున్న చొరవ కూడా ప్రశంసనీయమే. చిత్తూరు నియోజకవర్గానికి అవసరమైన నిధులు, అభివృద్ధి ప్రాజెక్టులు, మౌలిక వసతుల కల్పనకు సంబంధించి తరచూ ఉన్నతాధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రి దృష్టికి అంశాలను తీసుకెళ్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడిగా గుర్తింపు పొందుతున్నారు. కూటమి ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలను క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో ముందుంటున్నారు. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల మధ్య సమన్వయం సాధిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నారు. ప్రజలతో మమేకమవుతూ, అధికారులతో సమన్వయం చేసుకుంటూ, అభివృద్ధి పనులను ముందుండి పర్యవేక్షించే నాయకత్వం ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది.

ఫస్ట్ టైం ఎమ్మెల్యే... అనుభవిజ్ఞుడైన నేత లాగా 

రాజకీయాల్లో కొత్తవారిగా వచ్చినప్పటికీ అనుభవజ్ఞుడైన ప్రజాప్రతినిధిలా వ్యవహరిస్తూ ప్రజల విశ్వాసాన్ని సంపాదించడం ఆయన విజయానికి మరో కారణంగా చెప్పవచ్చు. వినయం, సరళత, ప్రజలతో సాన్నిహిత్యం, సమస్యల పరిష్కారంలో చొరవ వంటి అంశాలు ఆయనను ఇతర ప్రజాప్రతినిధుల నుంచి భిన్నంగా నిలబెట్టాయి. ప్రజల అవసరాలను అర్థం చేసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడం వల్ల ఆయనకు అన్ని వర్గాల ప్రజల నుంచి ఆదరణ లభిస్తోంది. రాష్ట్ర టాప్-10 ఎమ్మెల్యేల జాబితాలో స్థానం సంపాదించడం కేవలం వ్యక్తిగత విజయంగా కాకుండా చిత్తూరు నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలకు లభించిన గుర్తింపుగా భావిస్తున్నారు. మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై తక్కువ కాలంలోనే రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందడం ఆయన ప్రజా సేవా దృక్పథానికి నిదర్శనంగా నిలిచింది. ప్రజల సమస్యల పట్ల అంకితభావం, అభివృద్ధి పట్ల నిబద్ధత, అందుబాటులో ఉండే నాయకత్వం, ప్రభుత్వ కార్యక్రమాల సమర్థ అమలు, ప్రజల తరఫున నిరంతర పోరాటం వంటి అంశాలే గురజాల జగన్‌మోహన్ నాయుడిని రాష్ట్ర ఉత్తమ ఎమ్మెల్యేల సరసన నిలబెట్టాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. చిత్తూరు అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషి కొనసాగితే భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవడం ఖాయమనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *